యూనివర్సిటీలు కళ తప్పాయ్..!
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:00 AM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కళ తప్పాయని, ఎక్కడా సెమినార్లు కనిపించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎక్కడా సెమినార్లు కనిపించడం లేదు
‘ఉన్నత విద్య’ మరింత మెరుగుపడాలి: సీఎం చంద్రబాబు
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కళ తప్పాయని, ఎక్కడా సెమినార్లు కనిపించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్నాతకోత్సవాలు మొక్కుబడిగా జరుగుతున్నాయని, ఇస్తున్న డిగ్రీలకూ విలువ లేకుండా పోతోందన్నారు. విదేశాల్లో కాన్వకేషన్లు జరిగితే తల్లిదండ్రులు కూడా పాల్గొంటారని, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. విద్యా రంగంపై కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. పాఠశాల విద్యలో కరిక్యులమ్ ప్రస్తుత అభివృద్ధికి అనుగుణంగా లేదని, చాలావరకు సంబంధం లేకుండా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సిలబ్‌సలో పర్యావరణ సబ్జెక్టులు ఉండాలని, బయో డైవర్సిటీ విద్యా విధానం అమలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అక్షరాస్యత పెంచాలని, అలాగే ప్రజలందరికీ జీవిత కాలం నైపుణ్యాలు మెరుగుపర్చాలని ఆదేశించారు. రాష్ట్రంతో పాటు బయటి రాష్ర్టాల్లోని జాతీయ విద్యా సంస్థలు ఎలాంటి కరిక్యులమ్ అమలు చేస్తున్నాయో పరిశీలించాలని సూచించారు. ఉన్నత విద్యలో మనం ఎక్కడున్నామో అధ్యయనం చేయాలని ఆదేశించారు. పరిశ్రమలను వర్సిటీల్లో భాగస్వామ్యం చేయాలని నిర్దేశించారు.
ప్రత్యేకంగా వృత్తి విద్య డిగ్రీలు
సాధారణ విద్యతో సంబంధం లేకుండా వృత్తి విద్యలో ప్రత్యేకంగా డిగ్రీలు ఇచ్చే విధానాన్ని రూపొందిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. విద్యారంగంపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలో సాధారణ డిగ్రీ విధానం అమల్లో ఉందని, చదువు మధ్యలో ఆపేసిన వారి కోసం వృత్తి విద్య డిగ్రీలు ప్రవేశపెడుతున్నామని వివరించారు. వారు నేర్చుకునే వృత్తికి సంబంధించి మాత్రమే ఆ డిగ్రీ ఉంటుందన్నారు. 20 యూనివర్సిటీలను టాప్-100లోకి తేవడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఇకపై విద్యార్థులు, ఫ్యాకల్టీకి ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. మూడు నెలల్లో వర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, త్వరలో యూనివర్సిటీలకు ఉమ్మడి చట్టం తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 598 పాఠశాలల్లో విద్యార్థులు 40 కంటే తక్కువ ఉన్నారని, వచ్చే ఏడాదికి ఆ సంఖ్య వందకు పెరిగేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, బోధనపై తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఈ నెలాఖరుకు అందరూ గ్యారెంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఆటిజం కేంద్రాలు పెడుతున్నామని తెలిపారు. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.571 కోట్లు అవసరమని, కలెక్టర్లు ఆ పనులు చేపట్టాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాల కల్పనకు రూ.1,700 కోట్లు సిద్ధంగా ఉన్నాయని, కలెక్టర్లు పనులు చేయించాలని సూచించారు. దాతల విరాళాల కోసం యాప్ రూపొందించామన్నారు. దాతలు వస్తువులను నేరుగా పాఠశాలలకూ డెలివరీ చేయవచ్చన్నారు. పాఠశాలల్లో ఏఐ ట్యూటర్ విధానం పెట్టి, పిల్లలు వెనకబడిన పాఠ్యాంశాల వీడియోలు తల్లిదండ్రులకు పంపుతామన్నారు. జేఈఈ, నీట్‌లో పోటీ పడేందుకు కొన్ని మెరుగైన ప్రభుత్వ విద్యా సంస్థలను ఎంపిక చేస్తున్నామన్నారు. ఈ ఏడాది అక్షరాంధ్రలో 25 లక్షల మంది వయోజనులు త్వరలో పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు.