మరోసారి వైకుంఠపాళి వద్దు
ABN , Publish Date - May 20 , 2026 | 05:02 AM
‘వైసీపీ పాలించిన ఆ ఐదేళ్లూ రాష్ట్ర విధ్వంస కాలం. అన్ని రంగాల్లో కుప్పకూలిపోయింది. హత్యలు, కుల, మతాల మధ్య గొడవలతో రాష్ట్రం అట్టుడుకుపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘వైసీపీ పాలించిన ఆ ఐదేళ్లూ రాష్ట్ర విధ్వంస కాలం. అన్ని రంగాల్లో కుప్పకూలిపోయింది. హత్యలు, కుల, మతాల మధ్య గొడవలతో రాష్ట్రం అట్టుడుకుపోయింది. ఆర్థికవ్యవస్థ, ప్రజల భద్రత, పారదర్శక పాలన సర్వనాశనం అయిపోయాయి. ఆ విధ్వంసాన్ని పూడ్చడానికి 23 నెలలు పట్టింది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో పయనిస్తోంది. మరోసారి వైకుంఠపాళి ఆడొద్దు. నేను రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం, తొందరపాటు నిర్ణయంతో మీరు వెనక్కులాగడం... ఇకపై వద్దు. టీడీపీ డీఎన్‌ఏలోనే బీసీలు ఉన్నారు. బీసీల అభివృద్ధికి, గౌరవానికి, రాజ్యాధికారానికి టీడీపీ కట్టుబడి ఉంది. బీసీ వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తున్నాం. ఇంకా అభివృద్ధి సాధించాలంటే బీసీ వర్గాల్లో ఐకమత్యం రావాలి. టీడీపీ మీకు రుణపడి ఉంది... మీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యింది... రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. నా స్నేహితుడు పవన్ కల్యాణ్ సహకారంతో, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్నేహంతో రాష్ట్రంలో అభివృద్ధి బుల్లెట్ వేగంతో దూసుకుపోతోంది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే ప్రజల సహకారం కావాలి. గొడ్డలి పార్టీ చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టండి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో మీరుకూడా భాగస్వామ్యులు కండి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.