రాయలసీమకు జల సిరులు
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:29 AM
హంద్రీ-నీవా నుంచి రాయలసీమకు 50 టీఎంసీలు తరలించి సరికొత్త రికార్డు సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
హంద్రీ-నీవా నుంచి రికార్డు స్థాయిలో 40.109 టీఎంసీల జలాలు తరలింపు
50 టీఎంసీలు తీసుకెళ్లడమే లక్ష్యం: సీఎం
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): హంద్రీ-నీవా నుంచి రాయలసీమకు 50 టీఎంసీలు తరలించి సరికొత్త రికార్డు సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం వెలగపూడి సచివాలయానికి వచ్చిన ఆయనను రాయలసీమ మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దనరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కలసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి తొలిసారిగా 40.109 టీఎంసీల జలాలను రికార్డు స్థాయిలో రాయలసీమకు తరలించినందుకు సీఎం చంద్రబాబును రాయలసీమ మంత్రులు అభినందిస్తూనే... కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టు డిజైన్డ్ కెపాసిటీని మించి తొలిసారిగా రికార్డు స్థాయిలో 40.109 టీఎంసీలను సీమ ప్రాంతానికి తరలించడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. ‘హంద్రీ నీవాతో సీమకు నీటిని తరలించడంలో సఫలీకృతం కావడానికి కూటమి ప్రభుత్వమే కారణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు పంపుల సామర్థ్యాన్ని 12 పంపులకు పెంచాం. అలాగే 100 రోజుల్లో హంద్రీ-నీవా కాల్వల వెడల్పు పనులు పూర్తి చేయడమూ రికార్డే. ఈ ప్రాజెక్టులో భాగమైన మచ్చుమర్రి ఒక మేలి మలుపు’ అని పయ్యావుల అన్నారు. మచ్చుమర్రి వల్లే సీమకు నీళ్లు ఇవ్వగలుగుతున్నామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణతోనే హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. సీఎం స్పందిస్తూ... ‘సాధించిన దానితో తృప్తి పడొద్దు. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి నెల మొదటి వారంలోగా అదనంగా మరో 10 టీఎంసీలను తరలించి మొత్తంగా 50 టీఎంసీలను సీమకు పంపేలా చర్యలు చేపట్టండి. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువులు నిండినప్పుడే నాకు సంతోషం.’ అని సీఎం పేర్కొన్నారు.