Share News

సెప్టెంబరులోగా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌

ABN , Publish Date - May 22 , 2026 | 04:17 AM

రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులను ఈ ఏడాది సెప్టెంబరులోగా గ్రౌండింగ్‌ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

సెప్టెంబరులోగా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌

  • 2028 చివరికి కార్యాలయాలు ప్రారంభించాలి.. మంత్రుల కమిటీ, అధికారులకు సీఎం నిర్దేశం

  • 756 ప్రాజెక్టుల ద్వారా రూ.21,64,756 కోట్ల పెట్టుబడితో 21,20,567 మందికి ఉద్యోగాలు

  • భూ కేటాయింపుల్లో పర్యాటకానికి ప్రాధాన్యం.. సూర్యలంక బీచ్‌ను గోవా ప్లస్‌గా తీర్చిదిద్దాలి

  • త్వరలో బాపట్ల బీచ్‌కు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం.. ఎంవోయూ ప్రాజెక్టులపై చంద్రబాబు సమీక్ష

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులను ఈ ఏడాది సెప్టెంబరులోగా గ్రౌండింగ్‌ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2028 డిసెంబరు నాటికి ఆయా సంస్థలు కార్యాలయాలను ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై మంత్రుల కమిటీతో సీఎం గురువారం సమీక్షించారు. ఎంవోయూల స్థితిగతులపై ఆరా తీశారు. ఈ ఒప్పందాలపై మంత్రి లోకేశ్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మంత్రుల కమిటీ తీసుకున్న చర్యలను వివరించారు. రాబోయే 23 నెలల్లో 756 ప్రాజెక్టుల ద్వారా రూ.21,64,756 కోట్ల పెట్టుబడితో 21,20,567 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని లోకేశ్‌ వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో ఉంచుతామని ప్రకటించారు. పెట్టుబడుల సాధనలోనూ, ప్రైవేటు రంగంలో పరిశ్రమలను ఆకట్టుకోవడంలోనూ ఏపీ పేరు మార్మోగుతోందని లోకేశ్‌ తెలిపారు.


21 ఆలయాలతో టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌

ప్రాజెక్టుల గ్రౌండింగ్‌, అనుమతుల వివరాలు, ఉద్యోగ కల్పనపై సింగిల్‌ పోర్టల్‌లో డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. భూ కేటాయింపుల్లో తొలుత పర్యాటక ప్రాజెక్టులకు, ఆ తర్వాత ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సూర్యలంక బీచ్‌ ఫ్రంట్‌ను గోవా ప్లస్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాలని, బాపట్ల బీచ్‌కు త్వరలోనే మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 21 ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్‌ టూరిజం సర్క్యూట్‌ ప్రాజెక్టును చేపట్టాలన్నారు. సెమీ కండక్టర్లు, ఎలకా్ట్రనిక్‌ కాంపోనెంట్ల తయారీ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ట్రాన్స్‌మిషన్‌తో పాటు సోలార్‌ రూఫ్‌టాప్‌ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఏపీ నిర్దేశించుకున్న 160 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే 99 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. చెత్త నుంచి విద్యుదుత్పత్తితో పాటు పోర్టులు, షిప్‌ బిల్డింగ్‌, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా రాష్ట్రంలో భూ సేకరణపై వివాదాలు ఏర్పడలేదని, రైతులతో పాటు పరిశ్రమలకు, ప్రభుత్వానికీ ప్రయోజనం కలిగేలా భూసేకరణ ఉండాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ద్వారా రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో 282 ప్రాజెక్టులు ఆమోదం పొందాయని సీఎం గుర్తుచేశారు. వీటిలో 114 ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుల వేగవంతమైన గ్రౌండింగ్‌ ఏర్పాట్లను ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేశ్‌, టీజీ భరత్‌, కొండపల్లి శ్రీనివాస్‌, బీసీ జనార్దనరెడ్డి, సీఎస్‌ సాయిప్రసాద్‌, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 04:19 AM