CM Chandrababu Naidu: కొత్త ఏడాదికి శుభవార్తతో శ్రీకారం
ABN , Publish Date - Jan 04 , 2026 | 04:07 AM
పెట్టుబడుల సాధనలో దేశంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్న వార్త రాష్ట్ర ప్రజలందరికీ గర్వించదగినదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇదే స్ఫూర్తితో మరిన్ని పెట్టుబడుల సాధనకు కృషి
ఏపీ టాప్‌లో నిలవడంపై సీఎం చంద్రబాబు
అమరావతి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల సాధనలో దేశంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందన్న వార్త రాష్ట్ర ప్రజలందరికీ గర్వించదగినదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ నంబర్‌వన్ స్థానంలో ఉందంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటంకిస్తూ ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రచురించిన కథనంపై స్పందించారు. కొత్త ఏడాదిని ఉత్తేజకరమైన శుభవార్తతో ప్రారంభిస్తున్నామని, పాలకుల విజన్, సంస్కరణల ప్రభావాన్ని ఇది ప్రతిఫలిస్తోందని ఎక్స్‌లో పోస్టు చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎస్ర్కో ఖాతాల ప్రకటన, తక్కువ సమయంలో అనుమతులు, ప్రోత్సాహకాలను అందించడం వంటివన్నీ పెట్టుబడుల్లో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాయని పేర్కొన్నారు. తమ వ్యాపారాభివృద్ధికి ఏపీని గమ్యస్థానంగా ఎంచుకున్న పెట్టుబడిదారులకు, వారు ఏపీపై ఉంచిన నమ్మకానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మైలురాయి ఒక ముగింపుగా భావించడం లేదని, నిరంతరం కొనసాగే పురోగతికి ఓ పునాదిగా భావిస్తున్నానని అన్నారు. ఈ స్ఫూర్తితో రాష్ట్ర సుస్థిరాభివృద్ధికి, మరిన్ని పెట్టుబడులను రాబట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.