సంత్ సేవాలాల్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధి
ABN , Publish Date - Feb 15 , 2026 | 04:06 AM
సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
నీట్, ఐఐటీ సీట్లు సాధించేలా ఎస్టీ విద్యార్థులకు శిక్షణ
గిరిజన సంక్షేమానికి బడ్జెట్‌లో 9 వేల కోట్లు
సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రూ.50 లక్షలు కేటాయించి సేవాలాల్ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నీట్, ఐఐటీ సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని చెప్పారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287 జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సంత్ శ్రీ సేవాలాల్ మన రాష్ట్రంలో జన్మించడం మన అదృష్టమని తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవమైన ఆయన సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శమేనన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నామని. 2026-27 వార్షిక బడ్జెట్‌లో రూ. 9,190 కోట్లు ఎస్టీల కోసం కేటాయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు మిరియాల శిరీషాదేవి, తోయక జగదీశ్వరి, చిర్రిబాలరాజు, గిరిజన నేతలు, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.