Share News

అభివృద్ధి పనులతో ఉపాధి అనుసంధానం

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:01 AM

స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీరామ్‌జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులతో ఉపాధి అనుసంధానం

  • విజన్‌ 2047 లక్ష్యంగా జీరామ్‌జీ కార్యాచరణ

  • పెండింగ్‌ పనులు తక్షణమే పూర్తిచేయాలి

  • వీబీ జీరామ్‌జీపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీరామ్‌జీ పథకం కింద పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలని సూచించారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్‌లో వీబీ జీరామ్‌జీ పథకంపై సీఎం సమీక్షించారు. వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని గ్రామీణ స్థాయిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులతో అనుసంధానించాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిపోయిన పెండింగ్‌ పనులు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. 2025-26లో వేతన కాంపోనెంట్‌ కింద రూ.4,619 కోట్లు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ. 1,962కోట్లు వ్యయం చేసినట్లు అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద వ్యయం చేసిన రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. వీబీ జీరామ్‌జీ కింద రాష్ట్రానికి అవసరమైన పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌరవిద్యుత్‌ వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు, జల్‌జీవన్‌ మిషన్‌ కింద మరమ్మతులు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు, ప్రజా భవనాల నిర్మాణం, ట్రాన్స్‌పోర్టు షెడ్లు, పార్కింగ్‌ ప్రాంతాల అభివృద్ధి, కమ్యూనిటీ ఆస్తుల అభివృద్ధికి అవకాశాలున్నాయని సీఎం సూచించారు. అలాగే నీటి భద్రత, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు చేపట్టే పనులను కూడా ఈ పథకం కింద చేపట్టవచ్చని పేర్కొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 04:02 AM