Share News

నిరంతరం ప్రజల్లో ఉండండి

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:09 AM

కార్యకర్తలకు, ప్రజలకు ఎమ్మెల్యేలు మరింత అందుబాటులో ఉండాలని, ప్రజల్లో ఉండే నాయకుడే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

నిరంతరం ప్రజల్లో ఉండండి

  • అప్పుడే సుదీర్ఘకాలం రాజకీయాలు చేయగలరు

  • తిరుపతి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమీక్షలో సీఎం

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): కార్యకర్తలకు, ప్రజలకు ఎమ్మెల్యేలు మరింత అందుబాటులో ఉండాలని, ప్రజల్లో ఉండే నాయకుడే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండగలరని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఉండవల్లి నివాసంలో తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రి, జిల్లా అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, నాయకుల, అధికారుల పనితీరును సమీక్షించారు. తన వద్ద ఉన్న వివిధ నివేదికలు, సర్వే రిపోర్టుల ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంకులు సీల్డు కవర్‌లో అందించారు. మండల స్థాయి సమస్యలు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు, రోడ్లు, మున్సిపాలిటీల్లో సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించే నిర్ణయాలపై ఎమ్మెల్యేలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు పేదల సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు, ఎన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు, ఎన్ని ప్రజాదర్బార్‌లు పెట్టారు, ఎన్ని ప్రెస్‌ మీట్లు నిర్వహించారు, సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉన్నారు, వైసీపీ ఫేక్‌ ప్రచారాలను తిప్పికొట్టడంలో ఎంత మేర పనిచేస్తున్నారు వంటి అంశాలపై స్పష్టమైన డేటాతో రూపొందించిన నివేదికలను ఎమ్మెల్యేలకు సీఎం అందించారు. కార్యకర్తలకు, ప్రజలకు ఎంతమేర అందుబాటులో ఉంటున్నారనే అంశంపైనా నివేదికల ఆధారంగా నేతలకు పలు సూచనలు చేశారు. ఆరేడు నివేదికలు, సర్వేలు ఆధారంగా డాటా అనలటిక్స్‌ ద్వారా పనితీరును లెక్కించి ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చిన సీఎం.. వివిధ విభాగాల్లో జిల్లా అధికారుల పనితీరుపైనా నివేదికల ఆధారంగా వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. లా అండ్‌ ఆర్డర్‌, కీఫెర్ఫార్మెన్స్‌ ఇండికేటర్లలో నియోజకవర్గాల పనితీరుపైనా సమీక్ష నిర్వహించారు.

Updated Date - Mar 18 , 2026 | 04:10 AM