Share News

భక్తులను అగౌరవపరచొద్దు

ABN , Publish Date - Feb 11 , 2026 | 03:49 AM

దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి శ్రీశైలం ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, వారిని అగౌరవపరిచేలా ఎవరూ వ్యవహరించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

భక్తులను అగౌరవపరచొద్దు

  • శ్రీశైలంలో దీక్షాధారుల ఆందోళనపై సీఎం ఆరా

  • ఢిల్లీ నుంచే ఆలయాల్లో ఏర్పాట్లపై సమీక్ష

  • మంత్రులు ఆనం, అనితకు పర్యవేక్షణ బాధ్యతలు

అమరావతి/శ్రీశైలం, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): దీక్షలు, మాలధారణలతో ఎంతో కష్టపడి శ్రీశైలం ఆలయానికి చేరుకునే భక్తులకు ఇబ్బంది కలిగేలా, వారిని అగౌరవపరిచేలా ఎవరూ వ్యవహరించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శ్రీశైలంలో సోమవారం సాయంత్రం దీక్షాధారుల దర్శనం విషయంలో జరిగిన గందరగోళం, ఆందోళన ఘటనపై ఆరా తీశారు. శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో రద్దీ, వసతుల కల్పనపై ఢిల్లీ నుంచే మంత్రులు, సీఎస్‌, డీజీపీలతో పాటు దేవదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో కల్పించిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. శివరాత్రి నాటికి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం, హోం శాఖ మంత్రి అనిత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భక్తులకు వసతి, త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. శివరాత్రి రోజున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా పర్యవేక్షించాలని సీఎ్‌సకు సూచించారు. సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌ కూడా పాల్గొన్నారు.

శ్రీశైలంలో ప్రశాంతంగా దర్శనాలు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో మంగళవారం భక్తులకు దర్శనాలు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం దీక్షాధారుల దర్శనాల్లో జరిగిన గందరగోళంతో ఆలయ అధికారులు, జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పరిస్థితిని సమీక్షించి మరో 500 మంది పోలీస్‌ బలగాలను శ్రీశైలానికి తరలించారు. నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి సైతం శ్రీశైలంలోనే భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లు, సౌకర్యాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆలయ ఈఓ శ్రీనివాసరావు, చైర్మన్‌ పోతుగుంట రమేష్‌ నాయుడు కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునీల్‌ షెరాన్‌ మాట్లాడుతూ.. సోమవారం భక్తుల రద్దీ నేపథ్యంలో ఏఎస్పీ యుగంధర్‌ లాఠీ చూపుతూ నిలువరించారే తప్ప ఎవరిపైనా దాడి చేయలేదన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 03:49 AM