Share News

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండానే..

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:17 AM

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా.. పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళదామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండానే..

  • పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి

  • బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌లో రాష్ట్ర వాదనలు భేష్‌

  • ఇదేవిధంగా వాదనలు కొనసాగించండి: సీఎం

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా.. పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళదామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నదీ జలాల సమస్యకు నదుల అనుసంధానమే పరిష్కారమని తేల్చిచెప్పారు. తుంగభద్ర సహా కృష్ణా జలాలపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీని వేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి పాటిల్‌ ప్రకటించారని, ఆ కమిటీ వేశాక విధివిధానాలేమిటో పరిశీలిద్దామన్నారు. తుంగభద్రలో ఇసుక మేటలు వేయడంతో నీటి నిల్వలు తగ్గిపోయి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. కృష్ణా ట్రైబ్యునల్‌-2లో రాష్ట్రం తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ కౌన్సిల్‌ సభ్యులు జయదీప్‌ గుప్త, ఉమాపతి, మంత్రి నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, సలహాదారులు ఎం.వెంకటేశ్వరరావు, గంగాధర్‌, ఈఎన్‌సీ నరసింహమూర్తి, అంతర్రాష్ట జల విభాగం ఎస్‌ఈ రాజేశ్వరీదేవి తదితరులు బుధవారం చంద్రబాబును కలిశారు. ఈ నెల 22 నుంచి బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌-2 ముందు వాదనలు వినిపించనున్న నేపథ్యంలో ..జయదీప్ గుప్త, ఉమాపతి ఇప్పటిదాకా బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట రాష్ట్రం తరఫున జరిగిన వాదనలను సీఎంకు వివరించారు. ఇప్పటిదాకా రాష్ట్రం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించారంటూ వారిని సీఎం అభినందించారు. కాగా, ఈ నెల 11న ఏపీ, తెలంగాణ సీఎ్‌సలతో కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు సమీక్ష ఉందని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు.

Updated Date - Jul 09 , 2026 | 04:18 AM