Share News

పంట నష్టంపై రెండు రోజుల్లో నివేదిక

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:30 AM

అకాల వర్షాలు, భారీ గాలులు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పంట నష్టంపై రెండు రోజుల్లో నివేదిక

  • ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వొద్దు

  • అకాల వర్షాలు, గ్యాస్‌ సరఫరాపై సీఎం సమీక్ష

  • కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

అమరావతి, మార్చి 20(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు, భారీ గాలులు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గల్ఫ్‌ యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్‌ సిలెండర్ల సరఫరాకు అంతరాయం రాకుండా చూడాలని చెప్పారు. శుక్రవారం ఉండవల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అకాల వర్షాలతో 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా అంచనా వేశారు. అలాగే 9 జిల్లాల్లోని 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో ఉద్యాన పంటలపైనా ప్రభావం చూపాయని తెలిపారు. అరటి, బొప్పాయి, మిర్చి, మామిడి, నిమ్మ, బత్తాయి, కూరగాయల పంటలు దెబ్బతినగా, రూ.23కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. మొత్తం నష్టం రూ.63కోట్లుగా అంచనా వేశారు. దీనిపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. యుద్ధం కొనసాగితే.. ఎల్పీజీ గ్లోబల్‌ సప్లయ్‌ చైన్‌ దెబ్బతినే అవకాశం ఉందని, గ్యాస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఎల్పీజీ గ్యాస్‌ సిలెండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వకుండా చూడాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆలయాలు, అన్నక్యాంటీన్లు, అంగన్వాడీలకు గ్యాస్‌ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 04:30 AM