రైల్వే కనెక్టివిటీ పెరగాలి
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:21 AM
రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీని బెంచ్‌మార్క్‌గా నిలపాలని రైల్వే అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా ఏపీలో రైల్వే కనెక్టివిటీ పెరిగే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
దేశంలోని మార్కెట్లకు ఉద్యాన ఉత్పత్తుల రవాణా
ఆ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి
2027 నాటికి 73 అమృత్ రైల్వేస్టేషన్లు అభివృద్ధి
రైల్వే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
విజయవాడ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏపీని బెంచ్‌మార్క్‌గా నిలపాలని రైల్వే అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న 225 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులను దేశంలోని వివిధ మార్కెట్లకు రవాణా చేసేలా ఏపీలో రైల్వే కనెక్టివిటీ పెరిగే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై సచివాలయంలో సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. పొరుగు రాష్ట్రాల్లోని హింటర్‌ల్యాండ్‌ను ఏపీ పోర్టులు అన్నింటితో అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏపీ పోర్టులకు రైలు రవాణాకు నెలకొన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయని.. మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులతో ప్రధాన లైన్లను త్వరితగతిన అనుసంధానం చేయాలని సీఎం పేర్కొన్నారు. తిరుపతి- రేణిగుంట ప్రాంతం పారిశ్రామిక హబ్‌గా తయారవుతోందని, దీనిని ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానిస్తే పారిశ్రామిక ఉత్పత్తులను వేగంగా, తక్కువ వ్యయానికే రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. ఇచ్ఛాపురం- తడ మధ్య నాలుగు వరుసల రైల్వేలైన్ల నిర్మాణం వచ్చే మూడేళ్లలో కార్యరూపం దాల్చేలా డీపీఆర్ తయారు చేయాలని రైల్వే అధికారులను ఆదేశించారు. అవసరమైన భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైల్వే ప్రాజెక్టుల పర్యవేక్షణ, భూసేకరణ తదితర ప్రక్రియలకు రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా డిప్యూటీ తహసీల్దార్లను నియమించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో అమృత్ పథకం కింద ఎంపికైన 73 రైల్వేస్టేషన్లను 2027 నాటికి అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అలాగే రాయలసీమ- కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్టవిటీ పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట తదితర రైల్వే జంక్షన్లలో రద్దీని తగ్గించడంపైనా చర్చించారు. రాజధాని అమరావతిని కలుపుతూ ఎర్రుపాలెం- నంబూరు కొత్త రైల్వేలైన్ నిర్మాణ ప్రతిపాదనను త్వరగా పట్టాలెక్కించాలని సూచించారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాలను అమరావతి కోర్ కేపిటల్‌తో కలిపేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ను పూర్తిగా ఆధునీకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాలకు రైల్ కనెక్టవిటీ పెంచడంపైనా, విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్- కొవ్వూరు సహా రాష్ట్రంలో వివిధ రైల్వే మార్గాలపైనా సమీక్షించారు. హైదరాబాద్- చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదరాబాద్- బెంగళూరు లైన్లను హైస్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 864 కిలోమీటర్ల పొడవున చేపట్టే ఈ కారిడార్ కోసం రూ.1,90,907 కోట్ల వ్యయం అవుతుందని సీఎంకు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,318 కిలోమీటర్ల పొడవున రూ.34,310 కోట్లతో 39 కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. ఈ సమీక్షలో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.