Share News

పనులు ఎంత వరకు వచ్చాయ్‌..?

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:42 AM

రాజధాని అమరావతి లో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాలను సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి పరిశీలించారు.

పనులు ఎంత వరకు వచ్చాయ్‌..?

  • రాజధాని సహా సొంతింటి నిర్మాణాలను సతీమణితో కలిసి పరిశీలించిన సీఎం చంద్రబాబు

గుంటూరు(రాజధాని), జూలై 10(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి లో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాలను సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం సచివాలయం నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వారిద్దరు వెలగపూడిలో నిర్మిస్తున్న తమ సొంత ఇంటి నిర్మాణ పనులను చూసేందుకు వెళ్లారు. సచివాలయం నుం చి ఈ 6 రోడ్డు మీదుగా తమ ఇంటికి చేరుకుని అక్కడ కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. ప్రస్తుతం సివిల్‌ వర్కులు పూర్తై, ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయి. తుది దశకు చేరిన ఈ 6 రోడ్డు పనులు, కనెక్టివిటీ ఉన్న రోడ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అటు నుంచి కోర్‌ క్యాపిటల్‌ వైపు ప్రయాణించి అక్కడ జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. తొలుత న్యాయమూర్తుల భవన సముదాయాలను, అనంతరం ఐకానిక్‌ హైకోర్టు పనులను బయట నుంచే చూశారు. ఆ పక్కనే ఐకానిక్‌ సెక్రటేరియట్‌ భవనాల టవర్లను పరిశీలించారు. కారు దిగి వ్యూపాయిం ట్‌ వద్దకు వెళ్లి నిర్మాణాలను చూశారు. నిర్మాణ పురోగతిపై ఇంజనీర్లతో మాట్లాడారు. జీఏడీ టవర్‌ పురోగతిపైనా సీఎం ఆరా తీశారు.

Updated Date - Jul 11 , 2026 | 05:43 AM