Share News

3 నెలలు.. 28 జిల్లాలు

ABN , Publish Date - May 10 , 2026 | 04:34 AM

బంపర్‌ మెజారిటీతో గెలిచి 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. సీఎం చంద్రబాబు తరచూ.. పొలిటికల్‌ గవర్నెన్స్‌ మా విధానం అని చెబుతూ వచ్చారు.

3 నెలలు.. 28 జిల్లాలు

  • సీఎం సమీక్షలు సూపర్‌ హిట్‌!

  • ప్రజాప్రతినిధులు, అధికారులతో రివ్యూలు

  • వెయ్యికిపైగా సమస్యలు ప్రస్తావించిన నేతలు

  • ప్రాధాన్యాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కారానికి చంద్రబాబు ఆదేశాలు

  • 360 డిగ్రీల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరు పరిశీలన

  • వారికే నేరుగా రిపోర్టులు ఇచ్చిన వైనం

  • పనిచేస్తున్న నాయకులకు అభినందనలు

  • సరిగా లేనివారు మారాలని నిర్దేశం

అక్కడికక్కడే నిర్ణయాలు.. వెనువెంటనే ఆదేశాలు.. చకచకా పనులు.. ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు నెలలుగా నిర్వహిస్తున్న సమీక్షల పర్యవసానాలివి. పొలిటికల్‌ గవర్నెన్స్‌లో భాగంగా కొత్త పంథాలో చేపట్టిన ఈ సమీక్షలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ‘సూక్ష్మ పరిశీలన(మైక్రో అబ్జర్వేషన్‌)-స్థూల ప్రణాళిక(మ్యాక్రో ప్లానింగ్‌)’ ప్రాతిపదికన ఇవి జరుగుతున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బంపర్‌ మెజారిటీతో గెలిచి 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. సీఎం చంద్రబాబు తరచూ.. పొలిటికల్‌ గవర్నెన్స్‌ మా విధానం అని చెబుతూ వచ్చారు. చెప్పిన విధంగానే పాలనను కొత్త పుంతలు తొక్కిస్తూ.. ఇప్పటి వరకు చేపట్టని విధంగా కొత్త తరహా సమీక్షలకు శ్రీకారం చుట్టారు. గతంలో జిల్లాల వారీగా అధికారులతో, ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించడం చంద్రబాబుకు అలవాటు. ఈసారి పొలిటికల్‌ గవర్నెన్స్‌లో భాగంగా జిల్లాలవారీగా ఇటు ప్రజాప్రతినిధులు, అటు కలెక్టర్‌, ఎస్పీలతో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. సుమారు 3 నెలల కాలంలో 28 జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు ముగించారు. ప్రతిజిల్లా సమీక్షకూ సుమారు మూడున్నర గంటల సమయాన్ని కేటాయించారు.


పాలనే కాదు.. నేతలూ బాగుండాలి

క్షేత్రస్థాయిలో పరిస్థితులను పూర్తిగా బేరీజు వేసుకోవడం.. పనితీరు సరిగా లేని ప్రజాప్రతినిధులకు హితబోధ చేయడం.. ఎన్నికల నాటికి మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సుతిమెత్తగా హెచ్చరించడం.. తాజా సమీక్షల్లో చంద్రబాబు అనుసరించిన విధానం. నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందో అంశాలను రివ్యూల్లో సదరు ఎమ్మెల్యేలకే ఆయన విడమరిచి చెప్పారు. వారు ఏయే అంశాల్లో మెరుగ్గా ఉన్నారు.. ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో వివరించారు. పలువురు ఎమ్మెల్యేల కుటుంబసభ్యుల పనితీరు.. వారి అనుచరుల వ్యవహారశైలి, ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బంది వైఖరి వల్ల చెడ్డపేరు తెచ్చుకుంటున్నారంటూ కొందరు ఎమ్మెల్యేలకు చెప్పారు. మండలాల్లో జరుగుతున్న వివిధ పరిణామాలను కూడా సీఎం ప్రస్తావించడంతో పలువురు ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. ఫలానా ఎమెల్యే ఫలానా అంశాలను టచ్‌ చేస్తుండడం వల్ల నష్టం కలుగుతుందనే ఫీడ్‌బ్యాక్‌ తనకు వస్తోందని, వివాదాస్పద అంశాల జోలికి వెళ్లొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. ఇసుక, మద్యం, పేకాట క్లబ్బుల వంటి వాటి జోలికి వెళ్లవద్దని.. తప్పులు జరిగిఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు. కేవలం ఒక్క సర్వే కాకుండా వివిధ సర్వేల డేటాను ఉపయోగించి డేటా ఎనలటిక్స్‌ ద్వారా తుది నివేదికలు సిద్ధం చేశారు. వాటిని ఎమ్మెల్యేలకు సీల్డ్‌ కవర్‌లో అందజేశారు. నివేదికలు కచ్చితంగా ఉండడంతో ఒక్కరు కూడా విభేదించలేని పరిస్థితి నెలకొంది.


ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం

దూకుడుగా ఉండే పలువురు ఎమ్మెల్యేలకు.. తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టినవారికి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిచిన వారు.. మళ్లీ మళ్లీ గెలవాలని తాను కోరుకుంటానని, వన్‌టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదని, ఈ విషయంలో దిశానిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దానిని అందిపుచ్చుకోవాలని హితబోధ చేశారు. ఇక నేతల మధ్య గ్యాప్‌ తగ్గించేందుకూ ఈ సమావేశాల్లో చొరవ చూపారు. ఒకట్రెండు జిల్లాల భేటీల్లో వారి నడుమ సమస్యలను సరి చేశారు. కుటుంబ సభ్యులకు ఏ తరహాలో అయితే నచ్చచెబుతారో.. అదేస్థాయిలో చంద్రబాబు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాను ఇంత చెప్పిన తర్వాత కూడా మారకుంటే నిరభ్యంతరంగా పక్కన పెట్టేస్తానని తేల్చేశారు. కూటమి పార్టీల మధ్య ఐక్యత ఎట్టి పరిస్థితుల్లోనూ చెడిపోకూడదని.. తాను, పవన్‌ కల్యాణ్‌ ఎలా ఉన్నామో మూడు పార్టీల క్యాడర్‌ కూడా అలాగే ఉండాలని సూచించారు. ఐక్యంగా ఉంటే లాభాలు కలహాలతో వచ్చే నష్టాలను ఉదాహరణలతో వివరించారు.


సమస్యల ప్రస్తావన.. పరిష్కారాల సూచన

రాజకీయంగానే కాదు.. పాలనాపరంగానూ జిల్లాల్లో, నియోజకవర్గాల్లోని పరిస్థితిపై సీఎం సమీక్షలు జరిపారు. జిల్లా స్థాయి సమస్యలు మొదలుకొని గ్రామస్థాయిలో కీలకంగా ఉండే సమస్యలనూ ప్రస్తావించారని.. దీనివల్ల నియోజకవర్గాల్లోని చాలా సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. రకరకాల కారణాలతో అధికారుల స్థాయిలో ఆగిపోయిన చాలా పనులకు.. సమీక్షల తర్వాత మోక్షం కలుగుతోందనే భావన వారిలో వ్యక్తమవుతోంది. గతంలో ఇలా సమావేశాలు నిర్వహించలేదని, ఈ భేటీలు చాలా ఉపయోగకరంగా ఉటున్నాయని వారితో పాటు అధికారులూ అభిప్రాయపడుతున్నారు. తమ ఇబ్బందులను నేరుగా జిల్లా అధికారుల ముందే ఎమ్మెల్యేలు చెప్పడం, వాటికి సాంకేతికంగా ఉన్న అడ్డంకులను అధికారులు వివరించడం.. వాటికి సీఎం తనదైన శైలిలో పరిష్కార మార్గాలను చూపడంతో సమీక్షలకు సార్థకత చేకూరుతోంది. జిల్లాలవారీగా జరిగిన 28 సమీక్షల్లో ఎమ్మెల్యేలు 1000కిపైగా అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో ఎక్కువ భాగం గత ప్రభుత్వ విధ్వంసం వల్ల తలెత్తిన సమస్యలు, పెండింగ్‌లో ఉన్న పనులే. అనేక అభివృద్ధి పనులను గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. వీటిని పూర్తి చేయాలని అధికారులు, ఎమ్మెల్యేలు కోరారు. అధికభాగం ఆర్థిక అంశాలు ఉండగా కొన్ని ఆర్థికేతరం కూడా ఉన్నాయి. దీంతో వాటి పరిష్కారానికి సీఎం నిధుల లభ్యతను బట్టి హామీలిచ్చారు. ఎమ్మెల్యేలు తన దృష్టికి తెచ్చిన అంశాల్లోని అత్యవసరాన్ని బట్టి, అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వాటిపై ఎంత వరకు చర్యలు తీసుకుంటున్నారనే అంశంపైనా ఫాలో అప్‌ యాక్షన్‌ తీసుకోవాలని.. సీఎంవో అధికారులను ఆదేశించారు. సీఎం సమీక్షల్లో ప్రస్తానవకు వచ్చిన అంశాల్లో ఇప్పటికే 15 శాతం మేర పనులు పట్టాలెక్కాయి. మరో రెండు మూడు నెలల తర్వాత ఈ నిర్ణయాలకు సంబంధించి తీసుకున్న చర్యలపైనా తాను స్వయంగా పరిశీలిస్తానని సీఎం స్పష్టం చేశారు.


బాగా పనిచేస్తే ప్రోత్సాహం..

సీఎం సమావేశాల్లో జిల్లా సమస్యలతోపాటు నేతలు, అధికారుల పనితీరును 360 డిగ్రీల్లో పరిశీలించి విశ్లేషించారు. రానున్న రోజుల్లో కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని వాటిపై సమీక్షిస్తానని ఆయన చెప్పారు. బాగా పనిచేసిన అధికారులకు ప్రమోషన్లు ఉంటాయని చెప్పారు. అలాగే పార్టీని బలోపేతం చేసే విధంగా మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలకు ప్రోత్సాహం ఉంటుందని సమావేశంలోనే స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు తలపెట్టిన కొత్త తరహా సమీక్షలు ఫలితాలను ఇవ్వడం మొదలైందని పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభిప్రాయపడుతున్నారు.

బెంగాల్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి బాబు

పశ్చిమబెంగాల్‌ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఉదయం కోల్‌కతా విమానాశ్రయంలో చంద్రబాబుకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు బీజేపీ ఎంపీలు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ సీఎంని కలిశారు. అనంతరం బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ తొలి బీజేపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సువేందుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. బెంగాల్‌ నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవంతమైన పాలన అందిస్తుందన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో వికసిత్‌ భారత్‌ కల సాకారమయ్యేందుకు బెంగాల్‌ కూడా తన వంతు ప్రయత్నం చేస్తుందని ఆకాంక్షించారు.

Updated Date - May 10 , 2026 | 06:35 AM