Share News

శనగ కొనుగోలు లక్ష్యాన్ని పెంచండి

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:47 AM

రాష్ట్రంలో శనగ (బెంగాల్‌ గ్రామ్‌) రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

శనగ కొనుగోలు లక్ష్యాన్ని పెంచండి

  • కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శనగ (బెంగాల్‌ గ్రామ్‌) రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో శనగ ఉత్పత్తి భారీగా పెరగడంతో, అమ్మకానికి రైతులు పడుతున్న ఇబ్బందులపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుతం కేంద్రం అనుమతించిన కొనుగోలు పరిమితి సరిపోదని గుర్తించిన అచ్చెన్న.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం.. కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్రంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా 72వేల టన్నులు, నాఫెడ్‌ ద్వారా 12 వేల టన్నుల శనగలు కొనుగోలు చేశారు. మొత్తం 84 వేల టన్నుల కొనుగోలు పూర్తవడంతో ప్రస్తుతమున్న లక్ష్యం త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ఈ ఏడాది శనగ సాగు విస్తీర్ణం 3,88,413 హెక్టార్లకు పెరిగింది. ఉత్పత్తి కూడా 4,57,366 టన్నులకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి 94,500 టన్నుల కొనుగోలు లక్ష్యం మాత్రమే ఉన్నా.. పెరిగిన ఉత్పత్తి దృష్ట్యా దాన్ని 4,57,366 టన్నులకు పెంచాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం మార్కెట్‌లో శనగ ధర కనీస మద్దతు ధర కన్నా తక్కువగా ఉండటంతో రైతులు మొత్తం ఉత్పత్తిని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అదనపు కొనుగోళ్లు తప్పనిసరని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Apr 03 , 2026 | 05:47 AM