కుప్పం ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఔట్
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:20 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించారు. ఆయన స్థానంలో అనంతపురానికి చెందిన యువకుడు..
అనంత యువకుడికి బాధ్యతల అప్పగింత
అమరావతి/కుప్పం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించారు. ఆయన స్థానంలో అనంతపురానికి చెందిన యువకుడు, పార్టీ తరఫున పీ4 పథకాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీకాంత్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం కుప్పం నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులతో సీఎం సమావేశమయ్యారు. కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్, కడా రాజకీయ సలహా మండలి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఏపీఎ్‌సఆర్టీసీ వైస్‌చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ బీఆర్ సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ను కుప్పం బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు. కంచర్ల స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి కుప్పం బాధ్యతలు అప్పగిస్తానని, ఆయన ఆదేశాల ప్రకారం పార్టీ శ్రేణులు నడచుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అధినేత ఆదేశాలను శిరసావహిస్తానని అన్నారు. ఇంతకాలం తనకు సహకరించిన నియోజకవర్గ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు చెప్పి సమావేశం నుంచి నిష్క్రమించారు. చంద్రబాబు 1989లో కుప్పం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన.. కుప్పంలో తన తరఫున బాధ్యతలు నిర్వహించేందుకు తిరుపతికి చెందిన మనోహర్‌ను పీఏగా పెట్టుకున్నారు. మనోహర్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను నియమించారు. శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్థానిక నాయకులను కలుపుకొనిపోవడంలో విఫలమయ్యారు. ఆయన తీరుపై ఫిర్యాదులు ఎక్కువవుతుండడంతో ఆయన్ను పక్కనపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అనంతపురానికి చెందిన శ్రీకాంత్‌కు ఆ బాధ్యత కట్టబెట్టారు. సమావేశంలో పాల్గొన్న నేతలకు ఆయన్ను పరిచయం చేశారు. ఈయన అనంతపురం పాతూరు బోయవీధికి చెందిన నాగభూషణం, గంగమ్మ దంపతుల కుమారుడు. విజయవాడలోని ప్లానింగ్ కార్యాలయంలో ఇంజనీర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఏడాదిగా పనిచేస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి రమ్మని కబురు పెట్టారనీ, ఏయే బాధ్యతలు అప్పగిస్తారనేది లిఖితపూర్వకంగా తెలియజేస్తారని శ్రీకాంత్ వెల్లడించారు.
కుప్పం నేతలపై బాబు ఫైర్
కుప్పం నియోజవర్గ కీలక నేతల పనితీరును చంద్రబాబు ఈ సమావేశంలో ప్రశ్నించారు. సమీప బంధువులకు పదవులు కట్టబెట్టడం, రాష్ట్ర పదవులు కోరడం మాత్రమే చాలదని.. సొంత ఇంటిని కూడా దిద్దుకోవలసిన అవసరం ఉందని ఓ ముఖ్య నేతకు హితవు పలికారు. ఆ నాయకుడి సొంత పంచాయతీలో సమీప బంధువు పనితీరుపై నిర్వహించిన సర్వేలో అతి తక్కువ పాయింట్లు రావడంతో అధినేత ఈ వ్యాఖ్యలు చేశారు. సొంత వర్గాన్ని పెంచి పోషించడం తప్ప పార్టీకి ఏం ఉపయోగపడుతున్నారని 3 నియోజకవర్గాలకు సంబంధించిన అత్యున్నత నామినేటెడ్ పదవిలో ఉన్న ఇంకో కీలక నేతను నిలదీశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను స్వయంగా పర్యటించి ఆపించిన అక్రమ మైనింగ్‌తోపాటు ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా ఇప్పుడు జరుగుతుండడంపై నేతలను మందలించారు. అక్రమ కార్యకాపాలకు పాల్పడితే ఎంతటివారైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసులు బుక్ చేయిస్తానని స్పష్టం చేశారు. ఆగస్టులోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని, పార్టీకి సంపూర్ణంగా మెజారిటీ తెచ్చి తీరాలని శ్రేణులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా వ్యవహార శైలిని మార్చుకోవాలని.. లేదంటే ఎంతటి వారినైనా పక్కన పెట్టి, కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తానని తెగేసి చెప్పారు.