పుష్కరాల్లోపే రహదారుల పనులు
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:30 AM
గోదావరి పుష్కరాలను దృష్టిలోపెట్టుకొని రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులను వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
471 గ్రామాల్లో నిర్మాణం, మరమ్మతులు పూర్తి చేయాలి
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
పోర్టుల అనుసంధాన రోడ్లకు ప్రాధాన్యం
ప్రధాన నగరాలకు రింగురోడ్లతో ఆర్థిక వృద్ధి
ఆర్‌అండ్‌బీపై సమీక్షలో సీఎం ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలను దృష్టిలోపెట్టుకొని రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులను వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పుష్కరాల ప్రారంభానికి చాలా ముందే ఈ పనులు పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి గోదావ రి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 471 గ్రామాల్లో రోడ్ల మరమ్మత్తు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచే యాలని సీఎం ఆదేశించారు. రహదారుల నిర్మాణం, శాఖాపరమైన అంశాలపై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పరిధిలో చేపట్టే పనులు అన్ని ప్రాంతాలకు రోల్‌మోడల్‌గా ఉండాలని సీఎం చెప్పారు. పుష్కరాలకోసం ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో 400 కోట్లతో 513 కి.మీ. రహదారుల నిర్మాణం, నిర్వహణ పనులు చేపట్టగా, వీటి నిర్మాణంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆర్‌అండ్‌బీ మంత్రికి సూచించారు. కుంభమేళా తరహాలో పుష్కరాలకు కూడా నిధులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలో పోర్టులను అనుసంధానించేలా నిర్మిస్తున్న రహదారులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో ఔటర్ కారిడార్ మోడల్స్‌ను అధ్యయనం చేయాలన్నారు. ఈ ఏడాదిలో 24,502 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తికావాలని చంద్రబాబు ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఈ-సైకిళ్ల వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.