Share News

వేగంగా పట్టాలెక్కాలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 03:34 AM

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

వేగంగా  పట్టాలెక్కాలి

  • త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలి

  • స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానమే ప్రాతిపదిక

  • అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలి

  • గూగుల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, బీపీసీఎల్‌ వంటి

  • మెగా ప్రాజెక్టులకు అడ్డంకుల్లేకుండా చూడాలి

  • సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు

  • పెట్టుబడుల సాకారంపై నిరంతరం దృష్టి

  • ఇక ప్రతినెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష

  • ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకూ ఒప్పందాలను కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రతిష్ఠాత్మక సంస్థలు గూగుల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, బీపీసీఎల్‌ వంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భూకేటాయింపులు జరిపిన తర్వాత నిర్ణీత కాలవ్యవధిలో పనులు ప్రారంభించాలని, ఆయా సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. నిర్మాణాలకు ముందుకు రాకుంటే భూములు వెనక్కు తీసుకునేందుకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి సారించాలని అన్నారు. అవసరమైతే అనుమతులు రద్దు చేయాలన్నారు. ప్రతి ఒప్పందం వేగంగా సాకారం కావాలన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేలా ఎన్నారైలను ఆహ్వానించాలని మంత్రులు, అధికారులకు సూచించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులు మరిన్ని వచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అలాగే సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేవారికి అదనపు ప్రోత్సాహకాలను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు.


విశాఖలో ఐకానిక్‌గా ‘భారత్‌ మండపం’

విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. సూర్యలంక, పోలవరం, పులికాట్‌, గండికోట, శ్రీశైలం, మదనపల్లె, హార్స్‌లీ హిల్స్‌ వంటి క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఆయా క్లస్టర్లలో షాపింగ్‌ మాల్స్‌, హోటల్స్‌ వంటివి వస్తే పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకోవచ్చన్నారు. విశాఖలో భారత మండపం వస్తోందని, ఐకానిక్‌గా నిలిచేలా చూడాలని అన్నారు. అలాగే ప్రతి జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ, ఏలూరు లాంటి ప్రాంతాలు సహా రాష్ట్రంలో మరిన్ని హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు రావాలన్నారు. జాతీయ స్థాయి ఈవెంట్లు కూడా జరగాల్సి ఉందన్నారు. స్పోర్ట్స్‌ సిటీ, క్రియేటివ్‌ సిటీ ఎకోసిస్టమ్‌ క్రియేట్‌ చేయాలన్నారు. డైరీ, పౌలీ్ట్ర లైవ్‌స్టాక్‌, మీట్‌ ఎగుమతులూ పెరగాలని చెప్పారు. ఉద్యోగాల వివరాలతో నైపుణ్యం పోర్టల్‌ ప్రారంభించాలని సూచించారు. ఇకపై ప్రతినెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేస్తానని సీఎం అన్నారు.

Updated Date - Feb 19 , 2026 | 05:47 AM