జాప్యం లేకుండా అనుమతులు
ABN , Publish Date - Apr 14 , 2026 | 06:38 AM
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దానికోసం ఇప్పటికే అమలు చేస్తున్న విధానాలను మరింత సరళతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
పరిశ్రమల ఏర్పాటులో సరళంగా నిబంధనలు
82 రకాల అనుమతులను 57కు తగ్గించాలి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ బృందంతో భేటీ
అమరావతి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దానికోసం ఇప్పటికే అమలు చేస్తున్న విధానాలను మరింత సరళతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అనవసరపు చట్టాలను, నిబంధనలను తొలగించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 కార్యక్రమంపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు స్టీల్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చింది. ఈ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచడం, అనుమతులను సులభతరం చేయడం, అనవసరపు నిబంధనల సడలింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల గురించి సందీప్ పౌండ్రిక్ వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుమతుల జారీలో జాప్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, ప్రణాళికల గురించి ఆయా శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, కేంద్రం సూచించిన మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. డీ-రెగ్యులేషన్ ఫేజ్-1 అమలు, ఫేజ్-2 ప్రస్తుత పరిస్థితి గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఫేజ్-1లో మొత్తం 7 అంశాల్లో 23 ప్రాధాన్య అంశాలను పూర్తి చేశామని, ఇక ఫేజ్-2లో 28 ప్రాధాన్య అంశాలు నిర్దేశించుకున్నట్టు అధికారులు చెప్పారు. మొత్తం 47 సిఫారసుల్లో ఇప్పటి వరకు 18 అమలు కాగా.. మే 31 నాటికి పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ‘‘పరిశ్రమలకు అనుమతుల జారీ ప్రక్రియలో ఇబ్బందులు తగ్గించి వేగం పెంచాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు తొలగింపే లక్ష్యంగా పనిచేయాలి. ప్రస్తుతం 800కు పైగా ఉన్న నిబంధనలను 100లోపునకు తీసుకురావాలి. అనుమతుల లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలి.’’ అని సీఎం సూచించారు.
అన్నింటా ఏపీ మెరుగు: సందీప్ పౌండ్రిక్
డీ-రెగ్యులేషన్ విషయంలో కేంద్రం ప్రతిపాదించిన అంశాల కంటే మెరుగ్గా ఏపీ పనిచేస్తోందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ కితాబునిచ్చారు. నిర్దిష్ట గడువులోగా ఏపీ ఫేజ్-2ని అమలు చేస్తుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.