Share News

మంచిని గెలిపించండి!

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:36 AM

గతంలో ఇచ్చిన హామీ మేరకు మూడు కొత్త జిల్లాలు ఇచ్చా. వచ్చే జూలై నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తా.

మంచిని గెలిపించండి!

  • వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి: సీఎం

  • వెలిగొండ నుంచి జూలైనాటికి నీరిస్తాం

  • తొలిదశలో మార్కాపురం ప్రాంతానికి అందిస్తాం

  • ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే 3 జిల్లాలిచ్చా

  • జగన్‌లా జనాలకు నామాలు పెట్టను

  • ప్రాజెక్టు పూర్తిచేయకుండానే నాడు జాతికి అంకితం

  • ఫీడర్‌ కాలువ లైనింగ్‌ పనులు చేయలేదు

  • నిర్వాసితులకు నష్టపరిహారమూ ఇవ్వలేదు

  • మేమొచ్చాక రూ.540 కోట్లతో గాడిలో పెట్టాం

  • ఇప్పుడు మరో 436 కోట్లతో లైనింగ్‌ పనులు: సీఎం

వెలిగొండ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మార్కాపురం జిల్లా.. జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా.. పోలవరం ప్రాజెక్టుతో నష్టపోయిన ప్రజలకు పోలవరం జిల్లా ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు 3 జిల్లాలూ ఇచ్చా.

గత పాలకుల్లా సరిహద్దు రాళ్లపై కూడా నా బొమ్మలు వేయించుకునే బుద్ధి నాకు లేదు. ప్రజల భూమిపై ప్రజలకే హక్కు కల్పించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.

- సీఎం చంద్రబాబు

ఒంగోలు, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘గతంలో ఇచ్చిన హామీ మేరకు మూడు కొత్త జిల్లాలు ఇచ్చా. వచ్చే జూలై నాటికి వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తిచేసి జాతికి అంకితం చేస్తా. మాజీ ముఖ్యమంత్రి జగన్‌లా జనాలకు నామాలు పెట్టే తత్వం కాదు నాది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లి నుంచి బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు వెలిగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన.. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద రూ.436 కోట్లతో చేపడుతున్న ఫీడర్‌ కాలువ పనులకు శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులతో సమీక్షించారు. సాయంత్రం కొత్త జిల్లా కేంద్రమైన మార్కాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నాటి సీఎం జగన్‌ వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రాగానే పోలవరంతోపాటు వెలిగొండను ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టామని చెప్పారు. ‘తీరా ఇక్కడ జరిగిన, జరగాల్సిన పనులను చూస్తే జగన్‌ దగా బయటపడింది. మొదటి దశ పూర్తిచేయాలంటే కనీసం రూ.2,042 కోట్లు, రెండో దశ పూర్తికి ఇంకో రూ.1,900 కోట్లు కావాలని తేలింది. అవసరమైన కాలువ లైనింగ్‌ పనులు పూర్తిచేయకుండా, నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మేం అధికారంలోకి వచ్చినఈ 20 నెలల్లో రూ.540 కోట్లు వ్యయం చేసి పనులను గాడిలో పెట్టాం.మరో రూ.436 కోట్లతో ఫీడర్‌ కాలువ లైనింగ్‌ పనులకు ఇప్పుడు శంకుస్థాపన చేశాం. 7,200 మంది నిర్వాసితులకు రూ.930 కోట్లు పరిహారం చెల్లించాలి. తొలి దశ పనులన్నీ పూర్తిచేసి జూలైనాటికి వెనుకబడిన మార్కాపురం ప్రాంతానికి వెలిగొండ జలాలను అందించి మాట నిలబెట్టుకుంటా’ అని తెలిపారు. నల్లమల సాగర్‌, తీగలేరు కాలువ, తూర్పు కెనాల్‌ పనులకు రూ.2,540 కోట్లు ఖర్చుచేసి జిల్లాలో ఎక్కువ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. మార్కాపురంలో కలెక్టరేట్‌ భవన నిర్మాణం, ఇతర సౌకర్యాలకు 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.


వెయ్యికి కక్కుర్తి పడొద్దు..

కావలసింది కులం, మతం కాదు.. ఎవరు మంచిచేస్తే వారికి అండగా నిలిస్తేనే ప్రజల జీవితాలు మెరుగుపడతాయని చంద్రబాబు చెప్పారు. ‘నెలకు రూ.4 వేలు, 6 వేల చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్నాం. ఆ విషయాన్ని మరచి.. ఎన్నికల్లో వెయ్యి రూపాయలకు కక్కుర్తిపడొద్దు. నిజానికి 2019 ఎన్నికల్లో కూడా నన్నే సీఎంను చేసి ఉంటే 2021కే వెలిగొండ జలాలు మీకు అందేవి. ఇప్పటికైనా వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకుని.. భవిష్యత్‌లో అన్ని స్థానాల్లో కూటమి పార్టీలను గెలిపించాలి’ అని పిలుపిచ్చారు. రాయలసీమ అభివృద్ధి కోసం పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా పండ్లతోటల అభివృద్ధికి పునాదులు వేస్తున్నామని.. మార్కాపురం, ప్రకాశం జిల్లాలూ వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి వాటిని ఆ పథకంలో చేర్చామన్నారు.

బీసీలు, దళితులకు సమన్యాయం

బలహీనవర్గాలకు అండగా ఉండడంతో పాటు వర్గీకరణ ద్వారా దళితులందరికీ సమన్యాయం చేశామని సీఎం చెప్పారు. ‘అవినీతి, అక్రమాలు లేకుండా మెగా డీఎస్సీ నిర్వహించాం. 15,000 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు.. మరో 6 వేల మందికి పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. రానున్న రోజుల్లో సరికొత్త జనాభా పాలసీని తీనుకొచ్చి ప్రతి కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉండేవిధంగా చూస్తాం’ అని చెప్పారు.


పోరుమామిళ్ల, రాచర్లకూ నీరు: సీఎం

నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌లో 53.83 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు సమీక్ష సందర్భంగా సీఎంకు తెలియజేశారు. రోజుకు 200 మీటర్ల మేర కాలువ లైనింగ్‌ పనులు చేస్తున్నామన్నారు. 1.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులను మే చివరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. వెలిగొండ టన్నెళ్లు పూర్తయ్యాక పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

హెరిటేజ్‌పై అభాండాలు

‘కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని రసాయనాలతో తయారు చేసిన చరిత్ర గత పాలకులది’ అని సీఎం మండిపడ్డారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌పై అభాండాలు వేస్తున్నారని అన్నారు. నాడు సొంత బాబాయిని చంపి అబద్ధాలు ప్రచారం చేసిన వారు ఇప్పుడు హెరిటేజ్‌పై నెపం మోపుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు.

మా సమస్యలు తెలుసుకున్నారు..

రైతుల కుటుంబాల్లో ఆనందం నింపి, ఆదాయం వచ్చేలా చేయడానికి ప్రాజెక్టును పూర్తిచేస్తానని సీఎం హామీ ఇచ్చారు. గతంలో ఏ సీఎం ఇలా రైతులను కలిసి మాట్లాడలేదు. ఆయన మా సమస్యలను తెలుసుకున్నారు. ఏయే పంటలు సాగు చేస్తున్నారని అడిగారు. ఎన్ని అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారో కూడా తెలుసుకున్నారు.

- గండి వీరారెడ్డి

తానే పూర్తిచేస్తానన్నారు..

వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నేనే.. దానిని పూర్తి చేసేదీ నేనేనని చంద్రబాబు చెప్పారు. మోసపూరిత మాటలు చెప్పేవారిని నమ్మొద్దని, కష్టపడి పనిచేసేవారిని గెలిపించుకోవాలని కోరారు. వెలిగొండను పూర్తిచేసేందుకు శ్రమిస్తున్న సీఎంకు కృతజ్ఞతలు.

- అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.


రైతులతో కలసి కెనాల్‌ను పరిశీలించిన సీఎం

ఫీడర్‌ కెనాల్‌ లైనింగ్‌ పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత సీఎం.. పెద్దబొమ్మాలపురానికి చెందిన సురవరం గండివీరారెడ్డి, అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి అనే రైతులతో కలసి రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాన్ని, కెనాల్‌ పనులను పరిశీలించారు. ప్రాజెక్టును పూర్తిచేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గం మొత్తానికి సాగు, తాగు నీరందిస్తానని హామీ ఇచ్చారు. దీనిపై ఆ ఇద్దరు రైతులూ మీడియాతో తమ ఆనందం పంచుకున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 05:44 AM