Share News

4వ సారి సీఎం అయినా... సామాన్య కార్యకర్తే!

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:03 AM

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ కమిటీల వర్క్‌షాపులో సీఎం చంద్రబాబు సామాన్య కార్యకర్తలా పాల్గొనడం అందరినీ ఆకర్షించింది.

4వ సారి సీఎం అయినా... సామాన్య కార్యకర్తే!

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ కమిటీల వర్క్‌షాపులో సీఎం చంద్రబాబు సామాన్య కార్యకర్తలా పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. 25 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వర్క్‌షాపునకు హాజరైన 1,050 మందికి పార్టీ సీనియర్‌ నేతలతో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో చంద్రబాబు పాల్గొని శిక్షణ శిబిరాల్లో సీనియర్‌ నేతలు చెబుతున్న అంశాలను ఆసక్తిగా విన్నారు. వర్క్‌షాపు జరుగుతున్న ప్రతి గదికీ వెళ్లి చివరి వరుసలో కూర్చుని నేతలు చెప్పిన అంశాలను విన్నారు. నాలుగోసారి సీఎంగా ఉన్నా సామాన్య కార్యకర్తలా తమతోపాటు చంద్రబాబు శిక్షణ తరగతుల్లో కూర్చోవడం తమకు స్ఫూర్తినిస్తోందని పలువురు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

పయ్యావులకు సీఎం ప్రశంసలు!

వర్క్‌షాపులో పార్టీ ఆవిర్భావంపై తరగతులు తీసుకునే బాధ్యతను మంత్రి పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. కేశవ్‌ క్లాస్‌ తీసుకుంటున్న సమయంలో చంద్రబాబు అక్కడికి వచ్చారు. పయ్యావుల ఆసకికరంగా చెబుతుండటంతో సీఎం చాలాసేపు అక్కడే వింటూ ఉండిపోయారు. టీడీపీ ఆవిర్భావం నాటి పరిస్థితులు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఆనాడు ఉన్న జనాదరణ, లక్ష్మీపార్వతి ప్రవేశం, ఎన్టీఆర్‌ పదవీచ్యుతుడు కావడం, పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని చంద్రబాబు దక్కించుకుని పార్టీని ముందుకు నడిపిన వైనం తదితర అంశాలను సోదాహరణగా పయ్యావుల వివరించారు. పయ్యావుల చెప్పిన తీరును చూసిన చంద్రబాబు... బాగా చెబుతున్నారంటూ ప్రశంసించారు.

లోకేశ్‌ యువగళానికి మూడేళ్లు

యువగళం పాదయాత్ర ప్రారంభించి మంగళవారంతో మూడేళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27న కుప్పం నుంచి లోకేశ్‌ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో భారీ కేక్‌ను టీడీపీ నేతలు కట్‌ చేసి వేడుక నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కేక్‌ను కట్‌ చేశారు. పలువురు మంత్రులు, నాయకులు లోకేశ్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 06:04 AM