Share News

కుల చిచ్చుకు కుట్రలు!

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:13 AM

‘రాష్ట్రంలో కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. రాజకీయ నిరసనలు పెరిగాయి.. విచ్చలవిడితనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు..’ అని పోలీసులకు సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.

కుల చిచ్చుకు కుట్రలు!

  • వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు: చంద్రబాబు

  • రాజకీయ నిరసనలపై ప్రత్యేక నిఘా పెట్టండి

  • పోలీసు శాఖకు ముఖ్యమంత్రి ఆదేశం

  • శాంతిభద్రతల పరిరక్షణలో టెక్నాలజీకి పెద్దపీట

  • వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు

  • మైనర్లకు ‘సోషల్‌ మీడియా’ కట్టడి

  • నియంత్రణ చట్టం తీసుకొస్తున్నాం

  • రోడ్డు ప్రమాదాలు తగ్గాల్సిందే

  • గంజాయి సాగే కాదు.. వినియోగమూ తగ్గాలి

  • 15 రోజులకోసారి అవగాహన ర్యాలీలు

  • ఇక ప్రతి నెలా సమీక్షిస్తా: ముఖ్యమంత్రి

సమాజంలో అశాంతి రేకెత్తించేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో కుల, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. రాజకీయ నిరసనలు పెరిగాయి.. విచ్చలవిడితనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు..’ అని పోలీసులకు సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, సీఎస్‌ విజయానంద్‌, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ప్రత్యేక సీఎ్‌సలు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఇందులో ఎస్పీలు, నగరాల పోలీసు కమిషనర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. రాజకీయ నిరసనలతో కులాలు, మతాల మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారని.. అటువంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి, వర్చువల్‌గా సమీక్షలో పాల్గొన్న జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాల సంఖ్య పెంపు, డ్రోన్ల పర్యవేక్షణ ద్వారా ఎంతో మార్పు తెచ్చినందుకు పోలీసు శాఖను అభినందించారు. కొన్ని జిల్లాలు ప్రశాంతంగా ఉన్నాయని.. మిగతా జిల్లాల్లో తీవ్ర నేరాల కట్టడికి మరింత మెరుగైన పనితీరు కనబరచాలని ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మైనర్లు (16ఏళ్ల లోపువారు) సోషల్‌ మీడియా వినియోగించకుండా నియంత్రించే చట్టం తీసుకు రాబోతున్నామని చెప్పారు. హత్యలు తగ్గినా ఆత్మహత్యలు పెరగడం.. గంజాయి సాగు తగ్గినా వినియోగం తగ్గకపోవడం.. మహిళలపై నేరాలు తగ్గినా ఆత్మహత్యలు తగ్గకపోవడం.. రోడ్లు బాగున్నా రోడ్డు ప్రమాదాలు అదుపులోకి రాకపోవడం లాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆత్మహత్య చేసుకునే వారిలో మహిళలు, వ్యవసాయ కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు కూడా ఉన్నారని.. కారణాలు విశ్లేషించి కౌన్సెలింగ్‌ చేపట్టాలని ఆదేశించారు. పోలీసింగ్‌లో సాధించిన విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.


నేరాల కట్టడికి ఏఐ4ఏపీ: డీజీపీ

హత్యలు, దాడులు, గంజాయి సాగు, మహిళలపై నేరాలు తగ్గాయని.. శిక్షల శాతం, దొంగలపాలైన సొమ్ము రికవరీ పెరిగిందని డీజీపీ తెలిపారు. ఆత్మహత్యలు పెరిగాయన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు, డ్రోన్లు మంచి ఫలితాలు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ పోలీసింగ్‌ కృత్రిమ మేధ (ఏఐ) వైపు అడుగులు వేస్తోందన్నారు. మూడు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టు కింద ఏఐ4ఏపీ ప్రారంభించి దేశంలోనే మొదటి అడుగు వేశామని చెప్పారు. ‘గతంలో గంజాయి అంటే ఏపీ పేరు వినిపించేది.. ఇప్పుడు కట్టడిలో మార్గదర్శకంగా నిలుస్తోంది.. ఇతర రాష్ట్రాలు ఏపీ తరహాలో ముందుకెళ్లాలి’ అని నిరుడు పలు రాష్ట్రాలతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో కేంద్రం పేర్కొన్నట్లు ‘ఈగల్‌’ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ చెప్పారు. ఇందుకు సీఎం అభినందించారు. గంజాయి, డ్రగ్స్‌ వినియోగం తగ్గించేందుకు ప్రతి 15 రోజులకోసారి అవగాహన ర్యాలీలు చేపట్టాలని సూచించారు. వాటి బారిన పడినవారిని డీ-అడిక్షన్‌ కేంద్రాలకు తరలించాలన్నారు. ఇక నెలకోసారి సమీక్ష జరుపుతానని చెప్పారు. మహిళలకు ఏ క్షణంలో ఆపద వచ్చినా శక్తి బృందాలు అత్యంత వేగంగా స్పందిస్తున్నాయని.. మహిళలపై నేరాల తగ్గుదలకు అదొక ప్రధాన కారణమని మహిళా రక్షణ విభాగం ఐజీ రాజకుమారి వివరించారు.

ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన పెంచండి

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి పది సార్లు హెచ్చరికలు పంపుతున్నామని, అప్పటివరకూ చలాన్లు విధించడం లేదని ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ తెలిపారు. పది ఉల్లంఘనల తర్వాత కూడా నామమాత్రంగానే చలాన్లు విధించాలని, దానికంటే ముందు ప్రజల్లో అవగాహన మరింత పెంచాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం అవగాహన కల్పించడం అంతంతమాత్రంగానే ఉందన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 06:07 AM