‘జలధార’ ప్లాన్ సిద్ధం చేయండి
ABN , Publish Date - Apr 16 , 2026 | 05:57 AM
నీటి భద్రత కోసం జలధార కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం పూర్తికాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా...
పోలవరం నీటి వినియోగంపై ముందే ప్రణాళిక: ముఖ్యమంత్రి
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): నీటి భద్రత కోసం జలధార కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం పూర్తికాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా ఏయే అవసరాలకు తరలించాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని జల వనరుల మంత్రి రామానాయుడుకు సూచించారు. బుధవారం నీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. ప్రధాన ప్రాజెక్టులన్నిటినీ పూర్తి చేసేందుకు కార్యాచరణతో సిద్ధంగా ఉన్నామని.. అయితే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.900 కోట్ల దాకా పరిహారం చెల్లించాల్సి ఉం దని, మిగిలిన ప్రాజెక్టులకు రూ.200 కోట్లు చెల్లించాలని మంత్రి నిమ్మల తెలిపారు. ఈ రూ.1100 కోట్లను చెల్లిస్తే ప్రధాన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు. ఆయనతో ఏకీభవించిన చంద్రబాబు.. రూ.1100 కోట్ల విడుదలకు ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్‌తో సంప్రదింపులు జరపాలని సీఎ్‌సను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. హోటళ్లు, షాపింగ్ ఏరియా ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల సుందరీకరణకు డిజైన్లు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. పోలవరం-పాపికొండలు-భద్రాచలం వర కూ బోటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ‘గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించేలా పనుల వేగాన్ని పెంచాలి. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యాం గ్యాప్-1, గ్యాప్-2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలి’ అని నిర్దేశించారు.
త్వరితగతిన ప్రాజెక్టులు..
వెలిగొండ, హంద్రీ-నీవా, చింతలపూడి ఎత్తిపోతల పథకం, వరికెలపూడిశిల, చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో పాటు పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకంపైనా సీఎం ఆరాతీశారు. భూగర్భజలాల పెంపు, జలధార, జలహారతి కార్యక్రమాలపైనా సమీక్షించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు తారకరామ తీర్థసాగరం, మహేంద్రతన య, తోటపల్లి బ్యారేజీ, మడ్డువలస, జంఝావతి, హిరమండలం ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. డిసెంబరు నాటికి వంశధార-నాగావళి అనుసంధానం, జూలైనాటికి నాగావళి-చంపాపతి అనుసంధానం పూర్తి చేయాలని సూచించారు. వంశధార నదిపై నిర్మించ తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నేరడి బ్యారేజ్‌కు న్యాయపరమైన చిక్కులు తొలగడంతో త్వరితగతిన టెండర్లు పిలవాలన్నారు. రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయని అధికారులు చెప్పగా.. అన్నమయ్య జిల్లా తరహాలో భూగర్బ జలాల మట్టం 8 మీటర్లకు చేరుకోవాలని సీఎం సూచించారు. ఈ నెల 1నాటికి 625 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని.. వీటిని పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు వివరించారు.