Share News

పరిశ్రమలకు భూకేటాయింపుల్లో ఇబ్బందులు రానివ్వొద్దు

ABN , Publish Date - May 08 , 2026 | 05:11 AM

పరిశ్రమల స్థాపనకు భూకేటాయింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

పరిశ్రమలకు భూకేటాయింపుల్లో ఇబ్బందులు రానివ్వొద్దు

  • ఏపీఐఐసీ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల స్థాపనకు భూకేటాయింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో పారిశ్రామిక ప్రగతిపై జరిగిన సమీక్షలో గురువారం ఆయన మాట్లాడారు. ఏపీఐఐసీ భూములను నిషేధిత 22ఏ జాబితా నుంచి తప్పించాలని, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీల ద్వారా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల్లోని వివిధ ఉత్పత్తులు పాన్‌ ఇండియా, గ్లోబల్‌ బ్రాండ్స్‌ కావాలని ఆకాంక్షించారు. స్థానికంగా లభించే ముడిసరుకును గ్లోబల్‌ కంపెనీలకు అందిస్తే వాటిని కూడా బ్రాండింగ్‌ చేసుకోవాలని సూచించారు. అరకు కాఫీలాంటి బ్రాండింగ్‌ రాష్ట్ర ఉత్పత్తులకు రావాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక పార్కులు, ఉత్పత్తి యూనిట్ల వద్ద ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చెందాలని, భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. అమరావతి క్వాంటం కంప్యూటర్‌ సెంటర్‌ పనిచేయడం ప్రారంభిస్తే వాటికి కావాల్సిన పరికరాలను ఉత్పత్తి చేసేలా ఎకోసిస్టమ్‌ వస్తుందని, దీనిలో ఎంఎస్ఎంఈలు కీలకంగా ఉండాలని సీఎం సూచించారు.

Updated Date - May 08 , 2026 | 05:14 AM