నేడు మెగా పీటీఎం
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:01 AM
విద్యాశాఖ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో..
రంపచోడవరంలో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
30 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో రంపకు వస్తున్న చంద్రబాబు
అమరావతి/రంపచోడవరం, జూలై 23(ఆంధ్రజ్యోతి): విద్యాశాఖ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఈ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీల ప్రాంగణంలో జరిగే పీటీఎంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ‘తల్లికి వందనం’ లబ్ధిదారులతోనూ సీఎం ముచ్చటించనున్నారు. ఉదయం 9 గంటలకు సమావేశాలు ప్రారంభిస్తారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. కాగా, పోలవరం జిల్లా ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ తొలిసారిగా రంపచోడవరం వస్తున్నారు. పర్యటన కోసం లోకేశ్ గురువారమే రంపచోడవరం చేరుకున్నారు.
సీఎంగా 30 ఏళ్ల తర్వాత రంపకు...
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మూడు దశాబ్దాల తర్వాత రంపచోడవరం వస్తుండడం విశేషం. 1995లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఇక్కడకు వచ్చారు. తర్వాత ఒకటి రెండు పర్యాయాలు ఎన్నికల ప్రచార సభలకు మినహా సీఎం హోదాలో రాలేదు. దీంతో ఆయన తాజా పర్యటనపై గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు ప్రయోజనం కల్పించేలా సీఎం వరాలు ఇస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.