Share News

తోతాపురి రైతులకు అండగా నిలవాలి

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

తోతాపురి రైతులకు అండగా నిలవాలి

  • 7.03 టన్నుల కొనుగోళ్లకు రూ.281కోట్లివ్వండి

  • ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని అమలు చేయండి

  • కేంద్ర మంత్రి చౌహాన్‌కు సీఎం చంద్రబాబు లేఖ

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు ఆదివారం సీఎం లేఖ రాశారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని (ప్రైస్‌ డెఫిషియన్సీ పేమెంట్‌ స్కీమ్‌) అమలు చేయాలని సీఎం కోరారు. అంతర్జాతీయ పరిణామాలతో మామిడి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడం, పల్ప్‌ పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్‌లో తోతాపురి మామిడి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతుల్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.281 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో దాదాపు 91,011 హెక్టార్లలో తోతాపురి సాగులో ఉందని, దీనిద్వారా 8.65 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తూ, లక్షలాది రైతు కుటుంబాలకు జీవనాధారంగా ఉందని తెలిపారు. అయితే ప్రస్తుత సీజన్‌లో పెట్టుబడి వ్యయం పెరగడం, ధరలు కుప్పకూలడంతో మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని మార్కెట్‌ పరిస్థితిని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, 7.03 లక్షల మెట్రిక్‌ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం అమలు చేస్తున్నదని తెలిపారు. దీంట్లో భాగంగా కిలోకు అదనంగా రూ.4 చొప్పున మామిడి రైతులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి కేంద్రం మద్దతివ్వాలని, ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టు వరకు జరిగే మామిడి కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేసేలా చూడాలని కేంద్రమంత్రికి రాసిన లేఖలో సీఎం కోరారు.

Updated Date - Jun 29 , 2026 | 05:27 AM