నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందో తెలుసు!
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:02 AM
సాధారణ కార్యకర్తకైనా, అగ్ర నాయకుడికైనా పార్టీనే సుప్రీం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానన్నారు.
పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే వారిని ఉపేక్షించబోం
కార్యకర్తకైనా.. అధినేతకైనా పార్టీయే సుప్రీం
గొడ్డలి పార్టీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి
డీఎస్సీపై దుష్ప్రచారానికి గట్టిగా కౌంటర్ ఇచ్చాం
పార్టీ శ్రేణులతో కాఫీ కబుర్లులో సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సాధారణ కార్యకర్తకైనా, అగ్ర నాయకుడికైనా పార్టీనే సుప్రీం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందనేది తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానన్నారు. కార్యకర్తలను పట్టించుకోని నాయకులు, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో జీరో టాలరెన్స్‌తో వ్యవహరిస్తామని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం యూనిట్ ఇన్‌చార్జులకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై వారికి దిశా నిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వం పెంపొందించడానికే శిక్షణ ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ‘‘ప్రభుత్వం చేసిన మంచిని మనం చెప్పుకోకుంటే గొడ్డలి పార్టీ చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించింది. దానికి గట్టిగా కౌంటర్ ఇవ్వగలిగాం. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చక్కగా చెప్పగలిగాం. కాబట్టే గొడ్డలి పార్టీ మినహా మిగిలిన పార్టీలకు చెందిన నేతలు డీఎస్సీలో ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారు. డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లే గొడ్డలి పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించగలిగితే గొడ్డలి పార్టీ కుట్రలను ప్రజలే అడ్డుకుంటారు.’’ అని వివరించారు. గొడ్డలి పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ‘‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చాం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా.. వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నాం. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా.. పార్టీపైనా ఉంది. ఏ ఎన్నికలు జరిగినా ప్రతి బూత్‌లోనూ గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువే రావాలి. ప్రభుత్వ అధికారి, ప్రజా ప్రతినిధి, నాయకుడి ప్రవర్తన ఓట్లపై చాలా ప్రభావం చూపుతుంది. యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జులు, మండల అధ్యక్షులకు గౌరవం దక్కేలా చూసే బాధ్యత మనదే’’నని చంద్రబాబు స్పష్టం చేశారు.