Share News

ప్రజల విశ్వాసం కోల్పోతే నష్టపోతాం

ABN , Publish Date - May 24 , 2026 | 04:03 AM

క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని, వారి విశ్వాసాన్ని నిలుపుకొనేలా నాయకులు పనిచేయాలని పూతలపట్టు నియోజకవర్గం కార్యకర్తలను టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తం చేశారు.

ప్రజల విశ్వాసం కోల్పోతే నష్టపోతాం

  • పనితీరులో పూతలపట్టు ర్యాంకు 133

  • కార్యకర్తల భేటీలో చంద్రబాబు వెల్లడి

చిత్తూరు/యాదమరి, మే 23 (ఆంధ్రజ్యోతి): క్షేత్ర స్థాయిలో ప్రజల విశ్వాసం కోల్పోతే తీవ్రంగా నష్టపోతామని, వారి విశ్వాసాన్ని నిలుపుకొనేలా నాయకులు పనిచేయాలని పూతలపట్టు నియోజకవర్గం కార్యకర్తలను టీడీపీ అధినేత చంద్రబాబు అప్రమత్తం చేశారు. సంజీవని ప్రజావేదిక అనంతరం 14 కండ్రిగలో ఏర్పాటు చేసిన 39వ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ‘‘క్లిష్ట సమయంలో జనసేన, బీజేపీ అండగా నిలిచాయి. మనం ఆ పార్టీ శ్రేణుల్ని కలుపుకొని వెళ్లాలి. అప్పట్లో వైసీపీ తప్పుల్ని ఎత్తి చూపడంలో విఫలమయ్యాం. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ప్రజలకు చేరువ కావాలి. చాలాకాలం తర్వాత పూతలపట్టు నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చాం. దాన్ని నిలబెట్టుకునేలా నాయకులు గట్టిగా పనిచేయాలి. కొందరు తీరు మార్చుకోవాలి. స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అన్ని స్థానాలనూ కైవసం చేసుకోవాలి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు వివరించే బాధ్యత నాయకులదే. పూతలపట్టు నియోజకవర్గం రాష్ట్రంలో 133వ ర్యాంకులో ఉంది. క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలు బాధ్యతగా పనిచేస్తే స్థానం మెరుగుపడుతుంది. టీడీపీలో ఉంటూ వైసీపీ వారితో లాలూచీ పడే వాళ్లు పార్టీలో ఉండడానికి వీల్లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సంతగేటులోని యాదమర్రి పీహెచ్‌సీలో ఉన్న డిజిటల్‌ నర్వ్‌ సెంటర్‌ను సీఎం పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో సంభాషించారు.

Updated Date - May 24 , 2026 | 04:04 AM