ఎల్‌నినో ప్రభావం తీవ్రమే
ABN , Publish Date - Jul 24 , 2026 | 04:32 AM
దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌నినో ప్రభావంతో ఈసారి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. తాగునీటికీ తీవ్ర సమస్యలు ఎదురుకావచ్చని హెచ్చరించారు.
తాగునీటికి కటకట రావొచ్చు.. ఎద్దడి నివారణకు ప్రాధాన్యం
పశుగ్రాసానికి కొరత రావొద్దు.. ఉన్న నీటిని పొదుపుగా వాడాలి
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
కృష్ణా డెల్టాలో వరి ఎక్కువ సాగు చేయకుండా చూడాలి
వర్షాభావంతో రైతు నష్టపోకూడదు.. సబ్సిడీపై సీడ్‌బాల్స్
బనకచర్ల మీదుగా గోదావరి-కావేరి సంధానానికి కేంద్రం ఓకే
దీపం-2 కింద 4 నెలలకోసారి ఒకే రోజు లబ్ధిదారులకు డబ్బులు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి 1న ప్రధాని వస్తున్నారు
ఉత్తరాంధ్రలో ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ
ఆగస్టు చివర్లో మదనపల్లెలో ఉద్యాన హబ్ ప్రారంభం: సీఎం
పొగాకు రైతుల రుణాల రీషెడ్యూల్ మంచిదన్న మంత్రులు
సమన్వయంతో సంక్షోభాన్ని అధిగమిద్దాం: సీఎం
ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటిని ఆదా చేసేందుకు ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలను వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలి. కృష్ణా, గుంటూరు డెల్టాలో వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయకుండా చైతన్యపరచాలి.
ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఎంత మంది మంత్రులు చొరవ తీసుకుని మీమీ జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు? మంత్రి, కలెక్టర్ కలిసి పనిచేస్తే మెజారిటీ సమస్యలు పరిష్కారమైనట్లే. ఇకపై ఇది కచ్చితంగా జరగాలి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌నినో ప్రభావంతో ఈసారి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. తాగునీటికీ తీవ్ర సమస్యలు ఎదురుకావచ్చని హెచ్చరించారు. సంక్షోభాన్ని అధిగమించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, తాగునీటికి తొలి ప్రాధాన్యమివ్వాలని, పశుగ్రాసానికి కొరత రాకుండా చూడాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసి ఎల్‌నినో సంక్షోభాన్ని అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ అనంతరం ఎల్‌నినోపై సీఎం మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని.. పశ్చిమ గోదావరి జిల్లాలో 59 శాతం లోటు వర్షపాతం ఉంటే 460 శాతం అధికంగా వరి విస్తీర్ణం జరిగినట్లు అధికారులు చూపుతున్నారని, ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమిస్తామని ప్రశ్నించారు. సీఎం స్పందిస్తూ.. ఇప్పటికే వేసిన వరిని బతికించేందుకు చర్యలు తీసుకుంటూనే అదనంగా ఎవ్వరూ వరి సాగు చేయకుండా చూడాలన్నారు. వర్షాభావంతో రైతులు నష్టపోకుండా సబ్సిడీపై సీడ్‌బాల్స్ అందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. గోదావరి-కావేరి అనుసంధానంపై కేంద్రం సానుకూలంగా ఉందని, ఏపీ, కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణకూ ఎంతో ప్రయోజనమని సీఎం వివరించారు. బనకచర్ల మీదుగా గోదావరి-కావేరి లింక్‌తో తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఘర్ణణ వాతావరణం తగ్గడంతో పాటు తమిళనాడులో తాగునీటి సమస్యకు చెక్ పెట్టొచ్చని తెలిపారు.
పొగాకు రైతులకు ఏం చేస్తే మంచిది?
పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి మూడు ప్రతిపాదనలపై క్యాబినెట్‌లో చర్చ జరిగింది. పొగాకు రైతులకు రూ.60 వేలు వడ్డీ లేని రుణం ఇవ్వడం.. లోగ్రేడ్ రకానికి పొగాకు బోర్డు నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) ఇవ్వడం.. ఆథరైజ్డ్ క్రాప్ (నిర్దేశిత విస్తీర్ణంలో పొగాకు సాగు) వేసిన వారికి ఆర్థిక సాయం చేయాలన్న ఈ మూడు ప్రతిపాదనల కంటే.. వారి రుణాలను రీషెడ్యూల్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని కొందరు మంత్రులు సూచించారు. వీటిలో రైతులకు ఏది ఉపయుక్తంగా ఉంటుందో పరిశీలించాలని సీఎం కోరారు. పొగాకు బోర్డు అధికారులు శుక్రవారం వస్తున్నారని, వారితో చర్చల అనంతరం దీనిపై మరింత స్పష్టత వస్తుందని అన్నారు.
చేనేత కార్మికులకు నేతన్న భరోసాపైనా చర్చ జరిగింది. గతంలో ఎంత మందికి నేతన్న భరోసా ఇచ్చారని మంత్రి సత్యకుమార్ అధికారులను ప్రశ్నించారు. 73 వేల మందికి ఇచ్చామని వారు చెప్పగా.. ఈసారి సంఖ్య ఎందుకు తగ్గిందని మంత్రి అడిగారు. వారిలో అనర్హులను ఏరివేశామని.. అర్హులైన 52 వేల మందికి నేతన్న భరోసా ఇస్తున్నామని అధికారులు తెలిపారు.
దీపం-2 కింద 4 నెలలకోసారి ఒకే రోజు లబ్ధిదారులకు డబ్బులు వేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని.. గోదావరి పుష్కరాల ప్రారంభం రోజే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే ఎలా ఉంటుందని మంత్రులను సీఎం అడిగారు. విడివిడిగా చేస్తేనే బాగుంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మళ్లీ ఆలోచించి నిర్ణయిద్వామని సీఎం చెప్పారు.
ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్నందున ఉత్తరాంధ్ర జిల్లాల్లో పింఛన్లను ఒక రోజు ముందే ఇచ్చేసి.. పూర్తిగా ప్రధాని పర్యటనలో నిమగ్నం కావాలని మంత్రులను కోరారు.
ఉత్తరాంధ్ర ఆశలకు రెక్కలు కల్పించామన్న చంద్రబాబు.. ఇక ఆ ప్రాంతంలో వెనుకబాటుతనం ఉండకూడదని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం గేమ్ చేంజర్ అని.. ఏఐజీ ఆస్పత్రి, డేటా సెంటర్లు, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్.. ఇలా ఎన్నో పరిశ్రమలు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చనున్నాయన్నారు.
ఆగస్టు చివరి వారంలో మదనపల్లెలో ఉద్యానవన హబ్‌ను ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు.
3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మరింత అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఎజెండాలోని ఈ అంశాన్ని వాయిదా వేశారు. మరో రెండు అంశాలనూ వాయిదా వేశారు.