భూములు ఆక్రమిస్తే జైలుకు
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:37 AM
రాష్ట్రంలో భూములను ఆక్రమిస్తే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎంత పెద్దవాళ్లనైనా ఈ విషయంలో వదిలే ప్రసక్తి లేదని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి...
పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీ చేతికి.. దీనికోసమే రాజముద్రతో పాస్ పుస్తకాలు: సీఎం
క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తెచ్చాం
22ఏలో భూములు పెట్టి, టైటిలింగ్ యాక్ట్ తెచ్చి, వైసీపీ అరాచకం.. రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం
ఆ ఒక్క దుర్మార్గం సరిదిద్దడానికే 20 నెలలు
డిసెంబరు నాటికి పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి
రానున్న రోజుల్లో గూగుల్‌తో నేరుగా భూమి వద్దకు
సీమలోని ప్రతి ఎకరాకూ నీరందించడమే లక్ష్యం
నంద్యాల జిల్లా కొత్తబురుజులో సీఎం ప్రకటన
‘మీ భూమి - మీ హక్కు’లో రాజముద్రతో పాసుపుస్తకాల పంపిణీ
గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు ముద్రించడం కోసం రూ. 750 కోట్లు ఖర్చు చేశారు. 1.95 కోట్ల ఎకరాలను 22ఏలో పెట్టడమే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములను చెర పట్టారు. సొంత వాళ్లకు వాటిని కట్టబెట్టారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేశాం. వారు చేసిన ఆ ఒక్క దుర్మార్గాన్ని సరిదిద్దడానికే మాకు 20 నెలల సమయం పట్టింది.
- సీఎం చంద్రబాబు
నంద్యాల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూములను ఆక్రమిస్తే జైలుకు పంపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎంత పెద్దవాళ్లనైనా ఈ విషయంలో వదిలే ప్రసక్తి లేదని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి శాశ్వతంగా జైలులో ఉంచుతామని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్తబురుజు గ్రామంలో సోమవారం జరిగిన ‘మీ భూమి - మీ హక్కు’ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. రైతులకు స్వయంగా పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం వారితో ముఖాముఖి నిర్వహించారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో వివరాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. భూములను తా రుమారు చేయడానికి వీలులేకుండా క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాలను అందిస్తున్నామన్నారు.

గత ప్రభు త్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మం డిపడ్డారు. గత ప్రభుత్వంలో డోన్‌కు చెందిన మం త్రిగా ఉన్న వ్యక్తి సాధారణ రైతు భూమిని తన అనుచరులకు కట్టబెట్టేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.95 కోట్ల ఎకరాలను 22ఏలో పెట్టడమే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై నాడు అజమాయిషీ చేశారని, వాటిని సొంత వాళ్లకు కట్టబెట్టారన్నారు. తాము అధికారంలో కి వచ్చిన తర్వాత ఆ యాక్ట్‌ను రద్దు చేశామని గుర్తుచేశారు. వారు చేసిన ఆ ఒక్క దుర్మార్గాన్ని సరిదిద్దడానికే తనకు 20 నెలల సమయం పట్టిందన్నారు. తా ము అందించే పాసు పుస్తకాలను ఎవరూ ట్యాంపరిం గ్ చేయలేరని, తహసీల్దార్లు, వీఆర్వోలు ఒకవేళ తప్పు చేస్తే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వెంటనే పట్టేస్తుందని తెలిపారు. సర్వే రాళ్లపై జగన్ ఫొటోలు ముద్రించడం కోసం నాడు రూ.750 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’ అనే నినాదంతో ముందుకెళ్లాలని ప్రజలకు సీఎం సూచించారు.
సీమకు పారిశ్రామిక కళ తెస్తాం
‘‘ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ భూమి మీకు అప్పగించడం నా బాధ్యత. గత ప్రభుత్వంలో 6,860 గ్రామాల్లో రీ సర్వే చేసి అనేక తప్పులతో 19.93 లక్షల పాసు పుస్తకాలను ఇచ్చారు. ఆ రికార్డుల్లో జరిగిన తప్పులను సరిచేసి మళ్లీ కొత్తగా రైతులకు పుస్తకాలను అందిస్తున్నాం. డిసెంబరు నాటికి అందరికీ పాసు పుస్తకాలను అందజేస్తాం. భవిష్యత్తులో గూగుల్ సా యంతో తమ భూముల్లోకి రైతులు వెళ్లే విధంగా టెక్నాలజీని రూపొందిస్తాం. రిజిస్ట్రేషన్ విధానాన్ని మరింత సులభతరం చేస్తాం. హంద్రి-నివా, గాలేరు, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకా రం చుట్టారు. వాటిని కూటమి ప్రభుత్వం పూర్తి చే స్తోంది. ఇప్పటికే డోన్‌లోని 30 చెరువులతోపాటు కుప్పం ప్రాంతానికి నీరు తీసుకెళ్లాం. సీమలో ఉత్పత్తి అయ్యే పంటలను దేశవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం. మెరుగైన విత్తనాలతో పాటు కొత్త రకాల పంటలను కూడా ఈ ప్రాంతానికి పరిచయం చేస్తాం.’’
రూ. 100 కోట్లతో హార్టికల్చర్ హబ్
‘‘రాయలసీమలో దేశంలోనే ఎక్కడాలేని విధంగా రూ.100 కోట్లతో హార్టికల్చర్ హబ్‌ను ఏర్పాటు చేస్తాం. పూర్వోదయ పథకం కింద రూ.30 వేల కోట్ల నిధులు అందజేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. సీమలోని ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాం. మామిడి పండ్ల ధర తగ్గిన సమయంలో కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ కల్పించడంతో పాటు కవర్లను సబ్సిడీ రూపంలో అందించాం. కవర్లు తొడిగిన పండ్లతో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఎకరాకు రూ.40 వేల వరకు ఆదాయం వస్తోంది. గత ప్రభుత్వంలో భారీగా కుంభకోణాలు జరిగాయి. కల్తీ మద్యం కారణంగా 30 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. నెలకు రూ.100 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు. తిరుమల లడ్డూను కూడా కల్తీ చేశారు. లడ్డూ కల్తీ, మద్యం అవినీతి, భూదోపిడీలపై ప్రభుత్వం సమగ్ర ప్రక్షాళనకు పూనుకొంటుండగా, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లడ్డూపై సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికపై కూడా అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను శ్రీవారి భక్తుడిని. స్వామి పవిత్రత కు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహించేదిలేదు. సొంత బాబాయ్‌ను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించి నిందను నాపై వేశారు. కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏరో స్పేస్ సిటీ, ఓర్వకల్లులో పలు పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నాం. విద్యుత్ చార్జీలు పెంచబోమనే మాటకు కట్టుబడి ఉన్నా. గత వైసీపీ పాలనలో 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం మోపారు. ట్రూ అప్‌చార్జీ రూ.4600 కోట్ల భారం వేశారు. మేం వాటిని రద్దు చేశాం.’’ అని సీఎం తెలిపారు.
బుగ్గన నా భూమిని ఆక్రమించారు
న్యాయం కోసం ఆర్డీవోను 4 సార్లు కలిశాచంద్రబాబుకు ఓ రైతు ఫిర్యాదు
అక్కడే ఉన్న ఆర్డీవోపై సీఎం సీరియస్
తన భార్య పేరిట ఉన్న భూమిని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆక్రమించారంటూ ఓ రైతు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదుచేశాడు. ఆనా డు అధికారులు, పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కనీసం కేసు కూడా పెట్టలేదని వాపోయాడు. ఆ రైతు ఆవేదన ఆయన మాటల్లోనే.. ‘‘నా పేరు రామచంద్ర. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతుదొడ్డి స్వగ్రామం. నా భార్య రమాదేవి పేరు మీద ఉన్న 4.5 ఎకరాల భూమిని 2002లో అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆక్రమించారు. దీనికి వ్యతిరేకంగా నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నా. అయినా, నన్ను భూమిలోకి అడుగుపెట్టనీయడం లేదు. పొలంలోకి వెళ్తే నాపైనా, నా కుటుంబంపైనా కేసులు పెడతానని ప్యాపిలి ఎస్‌ఐ బెదిరించారు. న్యాయం చేయాలంటూ నాడు కలెక్టర్‌కు 6 సార్లు, ఆర్డీవోకు 4 సార్లు, ప్యాపిలి తహసీల్దార్ కు 32 సార్లు అర్జీలు ఇచ్చినా స్పందన లేదు. 110 ఏళ్ల నాటి భూమిని ఏ ప్రకారంగా బుగ్గనకువదిలిపెట్టాలని తహసీల్దార్‌ను అడిగాను.’’ అని రామచంద్ర వాపోయారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం, అక్కడే ఉన్న ఆర్డీవో నరసింహులుకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ‘‘ఆయన చెప్పేది పరిశీలించు. ఇలాంటి విషయాల్లో నేను లోతులకు వెళ తా. తప్పుంటే మాత్రం నువ్వు ప్రమాదంలో పడతా వ్’ అని హెచ్చరించారు. తప్పు చేసినవారు ఎంత పెద్దవాళ్లయినా, పీడీ యాక్ట్ నమోదు చేసి బెయిల్ రాకుండా శాశ్వతంగా జైలులో ఉంచుతామన్నారు.