అన్నీ గమనిస్తున్నా
ABN , Publish Date - May 08 , 2026 | 04:00 AM
‘‘ముఖ్యమంత్రిగా నేను ప్రతి గంటా, ప్రతి రోజూ లెక్కపెట్టుకుంటున్నాను. ఏ జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారనేది ప్రతిదీ గమనిస్తున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ప్రతి గంటా, ప్రతి రోజూ లెక్క పెడుతున్నా: సీఎం
వారంలో రెండేసి గంటలు మీ కోసం.. పార్టీ కోసం
ఈ భేటీలు మీకొక పరీక్ష..రేటింగ్స్ ఉంటాయి
బాగా పనిచేస్తే మీరు టాప్‌లో ఉంటారు
ప్రతికూల ఆలోచనలు చేస్తే నష్టపోతారు
ఇది మంత్రులకు కూడా వర్తిస్తుంది
ప్రజా సంతృప్తే మీ పనితీరుకు కొలబద్ద
మేం కాదు.. ‘మనం’ భావనతో ముందుకు
అందరూ ప్రజల వద్దకు వెళ్లాల్సిందే
అర్జీలను వంద శాతం పరిష్కరించాల్సిందే
భూసమస్యల పరిష్కారానికి మార్చి డెడ్‌లైన్
ప్రతివారం కొత్త కంపెనీ, ప్రతిరోజూ శంకుస్థాపనలతో పండగ వాతావరణం
పెట్టుబడుల సాధనలో జిల్లాలు పోటీ పడాలి
కలెక్టర్ల సమావేశంలో సీఎం దిశానిర్దేశం
ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు...ఏ కలెక్టర్ ఎట్లా ఉన్నారు... ఏ జిల్లా ఎట్లా ఉంది... ఏ మంత్రి ఏం చేస్తున్నారు..ఏ శాఖలో ఏం జరుగుతోందనేది రిపోర్టులు తెప్పించుకొని ప్రతి వారం రెండు గంటలు చ దువుతున్నా. ఆ తర్వాతే మీతో మాట్లాడుతున్నా. కలెక్టర్ల సమావేశం అనేది మీకు మూడు నెలలకోసారి నిర్వహించే పరీక్ష లాంటిది. మీకు కచ్చితంగా రేటింగ్స్ వస్తాయి. బాగా పనిచేసినవారు మరింత ముందుకెళ్లి టాప్‌లో నిలుస్తారు. ‘నేను పనిచేయకపోతే ఏమవుతుం’దంటూ ప్రతికూల ఆలోచనలు చేసేవారు నష్టపోతారు. ఇది మంత్రులకు కూడా వర్తిస్తుంది. ప్రజల కోసం పనిచేసేవారు భయపడాల్సిన అవసరమే లేదు.
- సీఎం చంద్రబాబు
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రిగా నేను ప్రతి గంటా, ప్రతి రోజూ లెక్కపెట్టుకుంటున్నాను. ఏ జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏ కలెక్టర్ ఎలా పనిచేస్తున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారనేది ప్రతిదీ గమనిస్తున్నా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు, విభాగాధిపతులు సమష్టిగా పనిచేయాలని, ప్రజల సంతృప్తే లక్ష్యంగా ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో 7వ విడత జిల్లా కలెక్టర్ల సమావేశాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘వారంలో రెండున్నర గంటలపాటు రియల్‌టైమ్ డేటా దగ్గర పెట్టుకొని పరిశీలన చేస్తున్నా. పార్టీ కోసం రెండు గంటలు వెచ్చిస్తున్నా. ఇటు ప్రభుత్వం, అటు పార్టీలో ఏం జరుగుతుందో, ఏం చేయాలో అన్నీ పరిశీలన చేస్తున్నాను.’’ అని తెలిపారు. ప్రజల తీర్పు ఎలా ఉందో నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో చూశామని, పనిచేయకపోతే ప్రభుత్వాలను ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం కూడా సరిగ్గా పనిచేసి దాన్ని ప్రజలకు తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పునర్‌నిర్మాణం చేస్తామని ప్రధానిమోదీ, తాను, పవన్‌కళ్యాణ్ హామీలిచ్చామని, ఈ దిశగా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాల్లో మంత్రులు, కలెక్టర్లు, ప్రభుత్వ స్థాయిలో కార్యదర్శులు, విభాగాధిపతులు సమష్టిగా కలిసి పనిచేయాలని, అభివృద్ధిలో పోటీపడాలని సీఎం పిలుపునిచ్చారు. అయితే, కొందరు కలెక్టర్లు, అధికారులు ‘మేం పనిచేయం..పని చేయకపోతే ఏమవుతుందని అనుకుంటే తీవ్రంగా నష్టపోతారు.’’ అని హెచ్చరించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే...
ప్రజా సంతృప్తే కొలమానం
‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అహర్నిశలు పనిచేస్తున్నాం. పింఛన్ల పంపిణీ నుంచి అర్జీల పరిష్కారం వరకు ప్రతి సేవను ప్రజలు హర్షించాలి. వారి సంతృప్తినే అధికారుల పనితీరుకు కొలమానంగా తీసుకుంటాం. అన్ని అంశాలను ప్రజాసంతృప్తి కోణంలో పరిశీలన చేస్తున్నాం. లబ్ధిదారుల స్పందన ఎలా ఉందో ఐవీఆర్‌ఎస్, క్యూఆర్ కోడ్, ఇతర సర్వేలద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పటికి 74-75శాతం ప్రజా సంతృప్తి స్థాయికి చేరుకున్నాం. దానిని 90ప్లస్ శాతానికి తీసుకురావాలన్నది లక్ష్యం. దీనికోసం సీఎస్ నుంచి గ్రామస్థాయి ఉద్యోగి వరకు సమష్టిగా పనిచేయాలి. ఇది టార్గెట్ కాదు. తప్పనిసరి అంశం. ప్రజల పిటిషన్లను 100 శాతం పరిష్కారించాలి. ఒకప్పుడు మీరు ప్రభుత్వానికి రిపోర్టులు పంపించేవారు. ఇప్పుడు మేమే మీకు రిపోర్టులు పంపిస్తున్నాం. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడమే మీ బాధ్యత.’’
రెవెన్యూ మంత్రి సమర్థత మార్చిలో తెలుస్తుంది
‘‘వచ్చే మార్చినాటికి సమాజానికి హానికరమయిన, లిటిగేషన్‌తో ఉన్న అంశాలు మినహా మిగిలిన సమస్యలన్నీ పరిష్కారం కావాల్సిందే. భూసమస్యల పరిష్కారం ద్వారా వచ్చే మార్చి నాటికి రెవెన్యూ మంత్రి సమర్థత ఏపాటిదో తెలుస్తుంది. అధికారుల అనాలోచిత చర్యలతో అనవసరంగా 22(ఏ)లో భూములు నమోదు చేశారు. వాటి పరిష్కారం కోసం బాధితులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇవన్నీ పోవాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఏడాది తర్వాత ఒక్క భూ సమస్య కూడా ఉండటానికి వీల్లేదు. కలెక్టర్లు, మంత్రులు పనితీరులో పోటీపడాలి. ప్రజలతో మాట్లాడితేనే అభివృద్ధి, సంక్షేమం ఎలాఉందో తెలుస్తుంది. నెలలో 3 రోజులు కార్యదర్శి, 6రోజులు విభాగాధిపతులు, 8 రోజులు కలెక్టర్‌లు ప్రజల వద్దకు వెళ్లాలి. రాష్ట్ర,, జిల్లా స్థాయిలో సమాచార ప్రజా సంబంధాల శాఖ ఉంది. అది పనిచేయడం లేదు. ఇప్పుడు సోషల్‌మీడియా వచ్చింది. న్యూట్రల్ ప్లాట్‌ఫామ్స్, ఇన్‌ప్లూయెన్సర్‌లను ఉపయోగించుకోవాలి.’’
ఏపీ బ్రాండ్ పెరిగింది..బుల్లెట్ కూడా వచ్చింది
‘‘28 ఉత్తమ పాలసీలతో ఏపీ బ్రాండ్ పెరిగింది. పెట్టుబడులు ఒక పండుగ వాతావరణాన్ని తలపించేలా వస్తున్నాయి. ఒకప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ప్లాంట్ తమిళనాడులోనే ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కీ వస్తోంది. నేను కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎక్కితే అదో గౌరవప్రద ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మనం రాష్ట్రానికి తేగలిగాం. కియా, గూగుల్ వంటివి తీసుకొచ్చాం. అనుకున్నవన్నీ సాధ్యమవుతున్నాయి. స్వర్ణాంధ్ర 2047 అంటే, అప్పటిదాకా సమయం ఉంది, అప్పుడే ఫలితాలు చూపిస్తాం అంటే కుదరదు. 2029లో మేం ప్రజల తీర్పును కోరాల్సి ఉంది. కాబట్టి ఫలితాలు ముందునుంచే చూపాలి. ప్రతీ సంవత్సరం, త్రైమాసికం, ప్రతీ నెల లక్ష్యాల సాధనపై దృష్టిఉంచాలి. టెన్త్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తే... అది మా క్రెడిట్ అని రాజకీయ నాయకులు ఫొటోలు వేసి ప్రకటనలు ఇవ్వడం సాధారణం. మొన్న ఆ ట్రెండ్‌ను రివర్స్ చేశాం. రియల్ హీరోలు విద్యార్థులే. అందుకే వారి ఫొటోలు వేసి ప్రకటనలు ఇచ్చాం. ప్రైవేటు, కార్పొరేట్ సెక్టార్‌లో ఇలాంటి వరవడి ఉండేది. కానీ తొలిసారి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చాం.’’
టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి సాధ్యం
‘‘టీమ్ వర్క్‌తోనే అభివృద్ధి జరుగుతుంది. నేను అని కాకుండా, మనం అనే ఆలోచనా విధానం అందరిలో రావాలి. సింగపూర్‌లో అనుసరిస్తున్న పాలనా విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయి. వాటిలో అత్యుత్తమ విధానాలను తీసుకుని ఒక జిల్లాను మోడల్‌గా అభివృద్ధి చేద్దాం. దీనికోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించి, పర్యవేక్షణ చేపట్టాలి. సింగపూర్‌లో ‘నేను కాదు.. మనం’ అనే విధానం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోనూ అవలంబిద్దాం. దీన్ని నాతోనే ప్రారంభిస్తున్నా. జీఎ్‌సడీపీ వృద్ధిలో కలెక్టర్లు ఎలా పనిచేస్తున్నారనే అంశంపై అధ్యయనం చేస్తున్నాం..’’ అని సీఎం తెలిపారు. అంతకుముందు సీఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ.. కలెక్టర్లు ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని సూచించారు. కాగా, తొలిరోజు సమావేశాలను సీసీఎల్‌ఏ జయలక్ష్మీ ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లు పాల్గొన్నారు.
ఆ అవార్డు టీమ్ ఏపీకి అంకితం: సీఎం
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు సాధించిన సీఎం చంద్రబాబుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు అభినందనలు తెలిపారు. మంత్రులతో పాటు సీఎస్ నుంచి గ్రామ స్థాయి అధికారి వరకూ కలసికట్టుగా పనిచేయడం వల్లే ఈ అవార్డు దక్కిందని సీఎం తెలిపారు. ఈ పురస్కారం మనందరి సమష్టి కృషితోనే సాధ్యమైందని అన్నారు. రాష్ట్రం గురించి రెండేళ్ల క్రితం ఏం మాట్లాడారు... ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనేదానికి ఈ అవార్డు ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడేవాడిని కాదని, ఇప్పుడు మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఎన్ని అవార్డులు వస్తే రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుందని, తద్వారా మరిన్ని పెట్టుబడులు వస్తాయని వివరించారు. ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితం చేస్తున్నామని సీఎం ప్రకటించారు.
ప్రజా విశ్వాసమే ముఖ్యం: అనిత
సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను సీఎం చంద్రబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 1996లోనే జన్మభూమి కమిటీల ద్వారా పౌర భాగస్వామ్యం గురించి మాట్లాడారని గుర్తుచేశారు. సింగపూర్ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యానికి మించి ప్రజల విశ్వాసం పొందడంపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. అక్కడ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ చాలా బలంగా ఉందని మంత్రి వివరించారు.
కీలక సంస్కరణలు చేపట్టాం: అనగాని
ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూశాఖలో అనేక సంస్కరణలు చేపట్టామని ఆశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అడంగల్, పాసుపుస్తకాలను వేగంగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 1.37 లక్షల ఎకరాల భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజెన్ ఫ్రెండ్లీగా మార్చామని, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సర్వీసులను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొస్తున్నామని చెప్పారు. నిర్దేశిత గడువులోగా రీ సర్వేను పూర్తిచేసి భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేస్తామని అనగాని తెలిపారు.
అభివృద్ధి కోసమే వ్యయాలు: కేశవ్
రాష్ట్రంలో వృఽథా ఖర్చులు తగ్గించుకొని, అభివృద్ధి కోసమే వ్యయాలు జరగాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రభుత్వ శాఖలు బడ్జెట్ ను దాటి ప్రతిపాదనలు పంపించవద్దని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవసరం ఉన్నవాటిపైనే ఖర్చుపెట్టాలని సూచించారు.
గ్రీవెన్స్ విధానం మారాలి: నారాయణ
సింగపూర్ పర్యటన అనుభవాలను కలెక్టర్ల సదస్సులో మంత్రి నారాయణ పంచుకున్నారు. అర్బన్ ప్లానింగ్, పౌరసేవలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో అక్కడ అనుసరిస్తున్న విధానాలు తమను ఎంతగానో ప్రభావితం చేశాయని తెలిపారు. సింగపూర్‌లో పౌర ఫిర్యాదుల పరిష్కారానికి నిర్వహించే ‘మీట్ ది పీపుల్’ కార్యక్రమాన్ని పరిశీలించామని చెప్పారు. ఫిర్యాదు వినగానే సదరు సంబంధిత శాఖలకు అక్కడికక్కడే లేఖలు పంపే విధానం బాగుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూడా గ్రీవెన్స్ విధానాన్ని కొంచెం సవరించుకుంటే మంచి ఫలితాలొస్తాయని సూచించారు.
సింగపూర్ చిన్న దేశమైనా..: సత్యకుమార్
సింగపూర్ చిన్న దేశమే అయినా ప్రపంచం దృష్టిలో పెద్దదిగా నిలిచిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. సింగపూర్-ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమానికి సంబంధించి ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సింగపూర్ చాలా చిన్న దేశమని, అక్కడ వనరులతో పాటు భూమి, జనాభా కూడా తక్కువేనని తెలిపారు. అయినా ఆ దేశం ప్రపంచంలో మొదటి వరుసలో ఉంటోందని చెప్పారు.