గాడి తప్పితే ఉపేక్షించం!
ABN , Publish Date - Aug 09 , 2026 | 04:59 AM
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ గాడి తప్పుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలు చేసుకునే హక్కు అందరికీ ఉంది.
వైసీపీ దీక్షల్లో ఒక్కరైనా విద్యార్థి ఉన్నారా?
వారిపై మెగా డీఎస్సీ ఉపాధ్యాయులే తిరగబడుతున్నారు
మంచి చేస్తే జనం సహకరిస్తారనేందుకు భోగాపురం,
ప్రజలే కుట్రలను ఛేదిస్తారనేందుకు కర్నూలు నిరసనలే సాక్ష్యం
ఈ నెలలోనే వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రారంభం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు
పారదర్శకంగా వ్యవహరించి, వాస్తవాలు చెబితే ప్రజలే కుట్రలను ఛేదిస్తారనడానికి కర్నూలులో గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా జరిగిన డీఎస్సీ టీచర్ల ఆందోళనే ఉదాహరణ. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి, భాగస్వాములు అవుతారనేదానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే నిదర్శనం.
- సీఎం
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గొడ్డలి పార్టీ గాడి తప్పుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలు చేసుకునే హక్కు అందరికీ ఉంది. కానీ, చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించబోం. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్‌లు, రహదారుల వెంబడి నిరసనలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం’’ అని హెచ్చరించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు, మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మెగా డీఎస్సీపై గొడ్డలి పార్టీ నిర్వహిస్తున్న నిరసనలు శ్రుతి తప్పుతున్నాయన్నారు. రౌడీలు, గంజాయి బ్యాచ్ తప్ప ఒక్కరైనా డీఎస్సీ అభ్యర్థి ఆ నిరసనల్లో పాల్గొంటున్నారా అని ప్రశ్నించారు. కర్నూలులో శనివారం నిర్వహించిన డీఎస్సీ సంఘీభావ ర్యాలీలో డీఎస్సీకి ఎంపికై ఉపాధ్యాయులుగా చేస్తున్నవారు, డీఎస్సీ రాసిన వారే పాల్గొన్నారని తెలిపారు. గొడ్డలి పార్టీ చేసే నిరసనలు, దీక్షల వల్ల తమకు నష్టం కలుగుతుందన్న ఆందోళనతో వారంతా ఐక్యంగా తమ ఆత్మగౌరవం చాటారన్నారు. రాష్ట్రంలో రెండు ప్రధాన ప్రాజెక్టులను ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలిదశకు (అనకాపల్లి వరకు) ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాటితోపాటు అమరావతికి సంబంధించి రెండు కీలక ప్రారంభోత్సవాలు కూడా ఉన్నాయని తెలిపారు. సీడ్ యాక్సిస్ రహదారి ప్రారంభంతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా ఈ నెలలోనే అందుబాటులోకి వస్తాయన్నారు.
వర్షాకాలంలోనూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల రెండు రోజుల్లో శ్రీశైలం నిండే అవకాశం ఉందని, ఆ తర్వాత నాగార్జునసాగర్‌కూ నీరు రావచ్చునని సీఎం తెలిపారు. ‘‘ఆర్థిక శాఖపై నేను విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆర్థికశాఖకు సంబంధించిన అంశాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. వాటిని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పేందుకు నేను 10 గంటలకుపైగా అధ్యయనం చేశాను. ఇకపై ఏటా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.’’ అని చంద్రబాబు తెలిపారు.