నేడు వెలిగొండకు చంద్రబాబు
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:11 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.
ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు
గిద్దలూరు క్రిష్ణంశెట్టిపల్లిలో ‘సంజీవని డిజిటల్ సర్వ్’కు శ్రీకారం
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి
మార్కాపురం/అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని రెండుచోట్ల కార్యక్రమాలు ఉండడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఉదయం 10.45 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లి వద్దకు సీఎం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.35 వరకు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వెలిగొండ పనుల పరిశీలనతోపాటు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అందజేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.905 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.199 కోట్లను వ్యయం చేసింది. రెండు దశల్లో పూర్తికానున్న ఈ ప్రాజెక్టు ఫేజ్-1లో 1,19,000 ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు.. స్టేజ్-2లో 3,28,300 ఎకరాలకు సాగునీరు, 11.29 లక్షల మందికి తాగునీరు అందుతుంది. స్టేజ్-1 కోసం ఇప్పటికే రూ.5000 కోట్లకు పైగా వ్యయం చేశారు. దాదాపు 19 కిలోమీటర్ల మేర టన్నెల్-1 తవ్వకం, ఎగ్జిట్ చానల్-1 తవ్వకం, ఎగ్జిట్ చానల్-లింక్ చానల్ పనులు పూర్తయ్యాయి. ఫీడర్ కాలువ, తీగలేరు, గొట్టిపడియ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యాయి. రెండు హెడ్ రెగ్యులేటర్లు, టన్నెల్ లైనింగ్ అప్రోచ్ చానల్, తూర్పు ప్రధాన కాలువ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 11 గ్రామాల్లోని నిర్వాసిత కుటుంబాలను చంద్రబాబు కలుస్తారు. అనంతరం గిద్దలూరు నియోజకవర్గం క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ సర్వ్ పథకాన్ని ప్రారంభిస్తారు. చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ సంజీవని కార్యక్రమం.. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అనంతరం సీఎం ప్రజావేదిక వద్దకు చేరుకుని మధ్యాహ్నం 1.45 నుంచి 3.30 వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత టీడీపీ శ్రేణుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.