Share News

డిజిటల్‌ నేరాలకు చెక్‌ పెట్టాలి

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:23 AM

‘డిజిటల్‌ అరెస్టుల కారణంగా చదువుకున్న వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. గడచిన మూడు నెలల్లో అనేక మంది ఈ డిజిటల్‌ మోసాల బారిన పడ్డారు. ఈ కేసుల్లో నేరస్థులను పట్టుకోవడం ఆలస్యమవుతోంది.

డిజిటల్‌ నేరాలకు చెక్‌ పెట్టాలి

  • బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలి

  • ఈ ఏడాది రుణ వితరణ లక్ష్యం రూ. 8.10 లక్షల కోట్లు.. ఎంఎ్‌సఎంఈలకు ప్రాధాన్యం

  • సెంట్రల్‌ ట్రాన్సాక్షన్‌ మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేయండి

  • విద్యా రుణాలకు అదనంగా 4 శాతం వడ్డీ రాయితీ

  • స్టార్ట్‌పలకు సాయంలో బ్యాంకులు చొరవ చూపాలి

  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి సాధనలో బ్యాంకర్ల సహకారం అవసరం

  • బ్యాంకులకు లాభాపేక్షే కాదు.. సామాజిక బాధ్యతా ఉండాలి

  • గృహ నిర్మాణ లబ్ధిదారుల రుణాల్లో జాప్యం చేయొద్దు

  • వెనుకబడిన వర్గాల లబ్ధిదారులకు పూర్తి చేయూతనివ్వాలి

  • బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ‘డిజిటల్‌ అరెస్టుల కారణంగా చదువుకున్న వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతున్నారు. గడచిన మూడు నెలల్లో అనేక మంది ఈ డిజిటల్‌ మోసాల బారిన పడ్డారు. ఈ కేసుల్లో నేరస్థులను పట్టుకోవడం ఆలస్యమవుతోంది. డిజిటల్‌ ఆర్థిక నేరాల్లో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్‌ బ్యాంక్‌ సీఎండీ/సీఈవో ఆశిష్‌ పాండేతో కలిసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్యాంకుల రుణ ప్రణాళికపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘‘బ్యాంకులు సెంట్రల్‌ ట్రాన్సాక్షన్‌ మానిటరింగ్‌ సెల్స్‌ను ఏర్పాటు చేసి, ఫైనాన్షియల్‌ ఫ్రాడ్స్‌ను నియంత్రించాలి.


డిజిటల్‌ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. డిజిటల్‌ అరెస్టులు, ఇతర సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక ప్రత్యేక స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్వోపీ)ని రూపొందించాలి. బ్యాంకులకు పూర్తిగా సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ రంగానికి బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలి. రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ల ద్వారా స్టార్ట్‌పలు, ఆవిష్కరణలు వస్తున్నాయి. అర్హులైన వారికి రుణాలివ్వడంలో బ్యాంకులు చొరవ చూపాలి. విద్యా రుణాలపై వడ్డీలో 4 శాతం రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నాం.


ఆక్వాకు బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలి

వయబిలిటీ, సస్టైనబిలిటీ అనేది వ్యాపార సంస్థలకు అత్యంత కీలకం. రుణ వితరణ, ఎన్పీఏలపై బ్యాంకర్లు, అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలి. ఆక్వా రంగానికి బ్యాంకులు ప్రోత్సాహం ఇవ్వాలి. సబ్సిడీపై 200 మెకనైజ్డ్‌ బోట్లు కొనుగోలుకు కూడా బ్యాంకులకు ప్రతిపాదనలిచ్చాం. పునరుత్పాదక ఇంధనానికి రుణ మంజూరు బాగా పెంచాల్సిన అవసరం ఉంది. బ్యాంకర్లు, ప్రభుత్వ విభాగాల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలి. ప్రైవేట్‌ బ్యాంకులు కూడా స్టాండప్‌ ఇండియా లాంటి పథకాలను అమలు చేసి, లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి వెనుకబడిన వర్గాల లబ్ధిదారులకు పూర్తి చేయూతనివ్వాలి. బ్యాంకులకు లాభాపేక్ష మాత్రమే కాదు.. సామాజిక బాధ్యత, నిబద్ధత ఉండాలి. గృహ నిర్మాణ లబ్ధిదారులకు రుణాలు మంజూరులో జాప్యం చేయొద్దు.

అమరావతిలో ఐకానిక్‌ బ్యాంక్‌ భవనాలు

రాజధాని అమరావతిలో భూములు తీసుకున్న బ్యాంకులు ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌లో ఉన్న బ్యాంక్స్‌ స్ర్టీట్‌లో త్వరతగతిన నిర్మాణాలు పూర్తి చేయాలి. ప్రతి బ్యాంకూ బిల్డింగ్‌ ఓ ఐకానిక్‌ భవనంలా ఉండేలా చూసుకోవాలి. ఆర్బీఐ కూడా ఏపీలో కార్యకలాపాలను విస్తృతం చేయాలి. మహిళలు, యువతకు డెయిరీ, ఆక్వా రంగాల్లో సంపదకు ఆస్కారం ఉంటుంది. ఈ ఏడాది 15 శాతం వృద్ధి రేటు సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఆయా రంగాలకు బ్యాంకులు ఆర్థికంగా ఊతమివ్వాలి’’ అని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు.

సీఎంతో బాబా రాందేవ్‌ భేటీ

సీఎం చంద్రబాబును యోగా గురువు బాబా రాందేవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. యోగాడేలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా యోగాడే కార్యక్రమ నిర్వహణపై సీఎంతో చర్చించారు.


వివిధ రంగాలకు రుణ కేటాయింపులు ఇలా..

2026-27 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రూ.8.10లక్షల కోట్ల రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. వ్యవసాయం సహా ప్రాధాన్యతా రంగాలకు రూ.5.40 లక్షల కోట్లు(45 శాతం), ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1.55లక్షల కోట్లు(19 శాతం), ప్రాధాన్యేతర రంగాలకు రూ. 2.70కోట్లు (33 శాతం), ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.23 వేల కోట్లు(3 శాతం) ఇవ్వాలని వార్షిక రుణ ప్రణాళికలో లక్ష్యంగా నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి రూ.3.60లక్షల కోట్లు రుణాలివ్వాలని ప్రతిపాదించారు. పంట రుణాలకు రూ.2 లక్షల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.10,693 కోట్లు, డెయిరీ రంగానికి రూ. 8,184 కోట్లు, పౌల్ట్రీకి రూ. 3,142 కోట్లు, మత్స్య రంగానికి రూ.17,757 కోట్లు, ఇతర పథకాలకు రూ.80,224 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.20 లక్షల కోట్లు, వ్యవసాయ మౌలిక వసతులకు రూ.3వేల కోట్లు, ఇతర అవసరాలకు రూ.37వేల కోట్లు ప్రతిపాదించారు. వ్యక్తిగత రుణాలకు రూ.53,379 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.11,500 కోట్లు, విద్యా రుణాలకు రూ.2,500 కోట్లు, పునరుత్పాక శక్తికి రూ.1,500 కోట్లు, ఎగుమతుల రంగంలో 25వేల కోట్లు, ఇతర రుణాలకు 7,900 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:28 AM