నేడు నంద్యాల జిల్లాకు సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:26 AM
సీఎం చంద్రబాబు గురువారం నంద్యాల జిల్లాకు రానున్నారు. బనగానపల్లె మండల కేంద్రంలో నిర్వహించే ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమానికి ఆయన హాజరై రైతులకు పట్టాదారు..
‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమానికి హాజరు
బనగానపల్లెలో పాసు పుస్తకాల పంపిణీ
నంద్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు గురువారం నంద్యాల జిల్లాకు రానున్నారు. బనగానపల్లె మండల కేంద్రంలో నిర్వహించే ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమానికి ఆయన హాజరై రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం విశ్రాంతి అనంతరం 2:35 గంటలకు బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి 5:20 గంటలకు అమరావతికి చేరుకుంటారు. బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పంపిణీ చేసే పట్టాదారు పాసుపుస్తకాలతో కలిపి ఇప్పటి వరకు 29 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తవుతుంది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 6,887 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయడంతో పాటు 29.04 లక్షల మంది రైతులకు రాజముద్రతో పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. కాగా, వచ్చే మార్చినాటికి 9,929 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి 64.53 లక్షల పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే నంద్యాలజిల్లాలో 8,412 మందికి, బనగానపల్లెలో 1,125 మందికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనున్నారు.