Share News

ఉగాదికి అవార్డుల ‘కళ’

ABN , Publish Date - Mar 18 , 2026 | 05:04 AM

రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది.

ఉగాదికి అవార్డుల ‘కళ’

  • 38 మందికి కళారత్న (హంస), 123 మంది ఉగాది పురస్కారాలు

  • రేపు సీఎం చేతుల మీదుగా ప్రదానం

అమరావతి/తెనాలి అర్బన్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. సాహిత్యం, సంగీతం, నృత్యం, జర్నలిజం, చిత్రలేఖనం, నాటకం, బుర్రకథ, సామాజిక సేవ తదితర రంగాల్లో ప్రముఖులను అవార్డులకు ఎంపిక చేశారు. ఈ మేరకు పర్యాటక, భాషా, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 161 మందిని ఎంపిక చేయగా వీరిలో 38 మందికి కళారత్న (హంస), 123 మందికి ఉగాది పురస్కారాలు ప్రకటించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విజేతలకు అవార్డులను ప్రదానం చేయనున్నారు.

2వేలకు పైగా దరఖాస్తుల వడపోత

ఈ ఏడాదికి అవార్డుల కోసం సాంస్కృతిక శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అవార్డు గ్రహీతలను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారాల కోసం దాదాపు 2వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన కమిటీ 38 మందినిహంస అవార్డుకు, 123 మందిని ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. కళారత్న(హంస) గ్రహీతకు రూ.50 వేల నగదు, హంస ప్రతిమ, శాలువ, ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. అలాగే ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేలు నగదు, మొమెంటో, శాలువాతో పాటు ధ్రువీకరణ పత్రం అందిస్తారు.

Updated Date - Mar 18 , 2026 | 05:04 AM