Share News

నేడు విశాఖలో సీఎం సైకిల్‌ సవారీ

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:50 AM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలసి సంకల్పిద్దాం’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘భూమి మన ఇల్లు....

నేడు విశాఖలో సీఎం సైకిల్‌ సవారీ

  • పర్యావరణ పరిరక్షణకు కలసి రండి: చంద్రబాబు

అమరావతి, విశాఖపట్నం, జూన్‌4(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరం కలసి సంకల్పిద్దాం’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘భూమి మన ఇల్లు. ప్రకృతి మన జీవనాధారం. పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. సహజ వనరులను కాపాడుకుంటూ, గాలి, నీరు, నేల కలుషితం కాకుండా అందరం కృషి చేద్దాం. పచ్చదనం పెంపు, ఇంధన వనరులు పొదపుగా వినియోగించడం అవసరం. అందులో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 5న సైకిళ్లు, ఈ సైకిళ్లపై ప్రయాణిద్దాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. శుక్రవారం నా విశాఖ పర్యటనలో సైకిల్‌పై ప్రయాణిస్తాను. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తాను. అంతా సహకరించాలని, మంచి కార్యక్రమానికి కలసి రావాలని కోరుతున్నా’ అని గురువారం ఎక్స్‌లో పేర్కొన్నారు.

పర్యటన ఇలా...

సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విశాఖపట్నంలోని నోవాటెల్‌ హోటల్‌లో శుక్రవారం నిర్వహించే జాతీయ సదస్సుకు సీఎం హాజరవుతున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 10 గంటలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో దిగుతారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అక్కడ మొక్కలు నాటుతారు. అక్కడి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ రోడ్డు నుంచి త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మీదుగా కరకచెట్టు పోలమాంబ ఆలయం వరకు చేరుకొని అక్కడ కుడి వైపు మలుపు తీసుకొని, ఈఎన్‌టీ, చెస్ట్‌ ఆస్పత్రుల మీదుగా ఈస్ట్‌ పాయింట్‌ కాలనీలోకి వెళ్లి అక్కడ బీచ్‌ రోడ్డులోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి ఉడా పార్క్‌, పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ మీదుగా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు. మొత్తం మీద సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు చంద్రబాబు సైకిల్‌పై సవారీ చేయనున్నారు.

Updated Date - Jun 05 , 2026 | 05:50 AM