రెండేళ్ల పాలనపై ఎల్లుండి తిరుపతిలో బహిరంగ సభ
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:41 AM
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ సభలను మూడు నుంచి ఒకటికి కుదించారు. ఈ నెల 9న తిరుపతిలో...
ఉక్కు ప్రమాదంతో అమరావతి, వైజాగ్ సభలు రద్దు
అమరావతి/తిరుపతి సిటీ, జూన్ 9(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ సభలను మూడు నుంచి ఒకటికి కుదించారు. ఈ నెల 9న తిరుపతిలో సంక్షేమంపై, 12న అమరావతిలో సుపరిపాలనపై, 15న విశాఖలో అభివృద్ధిపై సభలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన సభను 12వ తేదీకి వాయిదా వేశారు. అలాగే, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో నిర్వహించాల్సిన సభలను రద్దు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్టీల్‌ప్లాంట్ విషాదం నేపథ్యంలో వైజాగ్‌లో సభను నిర్వహించడం సరికాదని చంద్రబాబు భావించారు. కూటమి నేతలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ తిరుపతిలో జరిగే విజయోత్సవ సభలో ఈ రెండేళ్ల కాలంలో తాము అందించిన సుపరిపాలన, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్టు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం రాత్రి ఆయన పరిశీలించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు 50వేల మంది ప్రజలు పాల్గొనేందుకు వీలుగా ప్రాంగణాన్ని సిద్ధం చేయడంతో పాటు, అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.