Share News

‘నా పార్టీ - నా బాధ్యత’

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:14 AM

‘నా దేశం - నా బాధ్యత. నా తెలుగుదేశం - నా బాధ్యత’ అని గుర్తించి కార్యకర్తలందరూ బాధ్యతగా కష్టపడితే టీడీపీ ఓడిపోయే ప్రసక్తే ఉండదని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు.

‘నా పార్టీ - నా బాధ్యత’

  • ఇదే ప్రతి కార్యకర్త నినాదం కావాలి

  • అప్పుడిక మనకు ఓటమి ఉండదు

  • మీరు జనంలో గట్టిగా ప్రచారం చేస్తే గొడ్డలి పార్టీ నేతల ఆటలు సాగవు

  • మంత్రాలయం కార్యకర్తలతో చంద్రబాబు

కర్నూలు, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘నా దేశం - నా బాధ్యత. నా తెలుగుదేశం - నా బాధ్యత’ అని గుర్తించి కార్యకర్తలందరూ బాధ్యతగా కష్టపడితే టీడీపీ ఓడిపోయే ప్రసక్తే ఉండదని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలే అధినేతలని, పార్టీ సమావేశం ఏదైనాసరే... జై కార్యకర్త, జైజై కార్యకర్త అనే నినాదాలతో ముగించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‘‘టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేయడం వల్లే 94 శాతం సీట్లలో కూటమి విజయకేతనం ఎగురవేసింది. మీరు (కార్యకర్తలు) అలిగితే ఎక్కడికీ పోరు.. ఇంట్లో కూర్చుంటారు. మేం ఓడిపోతాం.. అదేగనుక మీరు ఉత్తేజంతో పని చేస్తే విజయం సాధిస్తాం. నా కోసం.. పార్టీ కోసం భుజాలు అరిగేలా జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటా. అది నా బాధ్యత. మీతో కలసి రెండు గంటలు గడిపితే, ఆ రోజు నాకు ఎంతో ఎనర్జీ, ఉత్సాహం వస్తుంది. ఓడిపోతామనే ఆలోచనే ఉండకూడదు. 2029లో కూడా కూటమే గెలుస్తుంది.. మళ్లీ మనమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఎన్నికల్లో అన్నింటా కూటమే విజయకేతనం ఎగురవేయాలి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. ఇంకా ఏమన్నారంటే..


అభివృద్ధి, సంక్షేమం.. రెండూ ముఖ్యమే

‘‘కూటమి ఆశయం అభివృద్ధి, సంక్షేమం. అన్నదాత సుభీభవ కింద రైతులకు రూ.7 వేలు చొప్పున సాయం అందించాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ ఇస్తున్నాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 1నే అవ్వాతాతలకు రూ.4 వేలు పింఛన్‌ ఇస్తున్నాం. ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇవన్నీ మీరు ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. మరోవైపు గొడ్డలి పార్టీ దుష్ప్రచారానికి తెర తీసింది. మనం చేసింది చెప్పకపోతే గొడ్డలి పార్టీ చెప్పింది నిజమేనని నమ్మే ప్రమాదం ఉంది. ఆ అవకాశం ఇవ్వకూడదు. మంత్రాలయం నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లోకి వేరే పార్టీల నాయకులను గొడ్డలి పార్టీ రానివ్వడం లేదని తెలిసింది. తమాషాగా ఉందా? ముందు శాంతి యాత్ర.. కాదంటే దండయాత్ర.. ఏయాత్రకైనా సిద్ధమే. 2009లో (ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి) టికెట్‌ ఇస్తే గెలిచి మోసం చేశాడు. నేనైతే టికెట్‌ ఇచ్చేవాడిని కాదు. ఆ రోజు బీవీ మోహన్‌రెడ్డి వచ్చి మనోడే.. మంచోడు అంటేనే ఇచ్చాను. మంత్రాలయంలో తిక్కారెడ్డి, రాఘవేంద్రరెడ్డి కలసి పనిచేయాలి. ఒకే వర్గంగా ముందుకు సాగాలి.’’


మేమంతా సామాన్యులమే

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, ఎన్టీఆర్‌, ప్రధాని మోదీ, నేను సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లమే. అవకాశాలను అందిపుచ్చుకొని కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. మీ ఆరోగ్యం మా బాధ్యత. కార్యకర్త తలసరి ఆదాయం రూ.72 లక్షలు ఉండాలని నా సంకల్పం. అది ఎలా సాధ్యమనే ప్రశ్నే అక్కర్లేదు. నేను చెప్పింది చేయండి చాలు. గుండ్రేవుల ప్రాజెక్టు పై కర్ణాటక, తెలంగాణ సీఎంలతో మాట్లాడాను. గుండ్రేవుల కోసం కమిటీ వేస్తాం. ఆ ప్రాజెక్టు కూడా తీసుకొస్తాం. అన్ని ప్రాంతాలకూ జలాల్లో సమ న్యాయం చేస్తాం.’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతరం రెండు వేల మంది కార్యకర్తలో ఆయన ఫొటోలు దిగారు.

Updated Date - Jun 26 , 2026 | 06:15 AM