Share News

సొంత మనుషులనే చంపి.. నేరం మనపై వేస్తారు!

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:36 AM

కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారు. మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను దోపిడీ చేశారు.

సొంత మనుషులనే చంపి.. నేరం మనపై వేస్తారు!

  • నా జీవితంలో రాజకీయ పోరాటాలే చేశా

  • ఏనాడూ నేరగాళ్లతో పోరాడలేదు

  • పంపకాల్లో తేడాతోనే పెద్ద దస్తగిరి హత్య

  • వైసీపీ అరాచకాలను నిత్యం

  • ప్రజలకు వివరించాలి: చంద్రబాబు

  • క్లస్టర్‌ ఇన్‌చార్జులతో కాఫీ కబుర్లు

ఆస్తి విషయంలో తల్లి, చెల్లిపై ఎవరైనా కోర్టుకు వెళ్తారా? సోషల్‌ సైకోలతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ఇలాంటి పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. కిల్లర్‌ పార్టీ ఆలోచనా విధానాన్ని అధ్యయనం చేసి.. ప్రతిస్పందించాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘కడపలో సొంత పార్టీ కార్యకర్తనే హత్య చేశారు. మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డి కలిసి ప్రభుత్వ భూములను దోపిడీ చేశారు. పంపకాల్లో విభేదాలు రావడంతో పెద్ద దస్తగిరి అనే వైసీపీ కార్యకర్తను చంపేశారు. వాళ్ల మనుషుల్ని వాళ్లే చంపి.. నేరం మనపై నెట్టేస్తారు. నా జీవితంలో రాజకీ య పోరాటాలు చేశాను తప్ప నేరగాళ్లతో ఏనాడూ పో రాడలేదు. ఇది నాకు కొత్తగానే ఉంది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన క్లస్టర్‌ ఇన్‌చార్జులతో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన దస్తగిరి హత్య, ఎమ్మెల్సీ అనంతబాబు బరితెగింపు వంటి అంశాలను ప్రస్తావించారు. ‘2019 ఎన్నికల కోసం వివేకా హత్యను వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక న్యాయం చేయండని సునీతారెడ్డి అడిగితే సైలెంట్‌గా ఉండాలంటూ ఆమెను బెదిరించారు’ అని చెప్పారు. వైసీపీ నాయకుల అరాచకాలకు అంతే లేకుండా పోయిందన్నారు. ‘వారిష్టమొచ్చినట్లు రోడ్ల మీదకు వస్తారు.. రెచ్చగొడతారు.. రప్పా రప్పా అంటారు. ప్రజలను ఇబ్బందులు పెడతారు. చర్యలు తీసుకుంటే రాజకీయమంటారు. అన్యా యం జరిగిందని పరామర్శకు వెళ్తారు. కార్యకర్తలను కార్ల కింద తొక్కించి చంపేస్తారు. కానీ తన కారు కింద పడిపోయిన కార్యకర్తను మాత్రం పరామర్శించరు’ అని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సొంత డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని గొడ్డలి పార్టీ ఎమ్మెల్సీ హత్య చేశాడని, కోర్టులో సాక్ష్యం చెప్పినవారిని బెదిరించాడని, వారి తీరు ఇలాగే ఉంటుందన్నారు.


ప్రతి కార్యకర్తనూ..

ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని, అవకాశాలను క్యాడర్‌ అందిపుచ్చుకుని.. నాయకులుగా ఎదగాలని చంద్రబాబు పిలుపిచ్చారు. సమకాలీన రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ‘టీడీపీలో కార్యకర్తలే అధినేతలు.. రైట్‌ రాయల్‌గా బతకాలి.’ అని స్పష్టం చేశారు.

Updated Date - Apr 25 , 2026 | 04:37 AM