గొడ్డలిని కట్టడి చేద్దాం!
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:30 AM
మంచి పనిని కూడా చెడు ప్రచారంతో చెడగొట్టాలన్నదే గొడ్డలి పార్టీ అధినేత సిద్ధాంతం. ప్రభుత్వం చేస్తున్న మంచి, కల్పిస్తున్న ఉపాధిపై దుష్ప్రచారం చేయడమే ఆ పార్టీ తన విధానంగా పెట్టుకుంది....
డీఎస్సీపైనా వివేకా హత్య తరహా కుట్ర
రాజధాని రైతుల్లో గందరగోళం సృష్టే లక్ష్యం: చంద్రబాబు
అమరావతి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ‘మంచి పనిని కూడా చెడు ప్రచారంతో చెడగొట్టాలన్నదే గొడ్డలి పార్టీ అధినేత సిద్ధాంతం. ప్రభుత్వం చేస్తున్న మంచి, కల్పిస్తున్న ఉపాధిపై దుష్ప్రచారం చేయడమే ఆ పార్టీ తన విధానంగా పెట్టుకుంది’ అని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ విషయంలో మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా పనిచేసేందుకు మరింత కష్టపడాలన్నారు. జనంలో సంతృప్త స్థాయి మరింత పెరగాల్సిన అవసరం ఉందని.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయన్న ఆలోచనతో కాకుండా.. మరో మూడేళ్లలో ఎన్నికలకు వెళ్లాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని పనిచేయాలని కోరారు. గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక.. తాజా రాజకీయ పరిణామాలపై సహచరులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుల్లా వ్యవహరించాలని, జగన్‌లా బాధ్యతారహితంగా వ్యవహరించొద్దని హితవు పలికారు. బూటకపు ప్రచారంతో ప్రజలను నమ్మించేందుకు వైసీపీ చేస్తున్న యత్నాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టాలన్నారు. గొడ్డలి పార్టీ విషయంలో అప్రమత్తంగా లేకపోతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాదిరిగా పదే పదే మనపై నిందలు వేస్తుంటారని చంద్రబాబు హెచ్చరించారు. మెగా డీఎస్సీ విషయంలో కూడా వివేకా హత్య తరహాలోనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్ సమగ్ర వివరణ ఇచ్చినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ప్రభుత్వం వివరణ ఇచ్చాక కూడా ప్రజలను తప్పుదారి పట్టించేలా జగన్ పత్రికలో కథనాలు రాయడంపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచించాలని కోరారు. గొడ్డలి పార్టీ వాళ్లనే రాజధాని రైతులుగా చూపుతూ జగన్ అమరావతి విషయంలో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ డ్రామాలాడడం మామూలేనని.. కోడికత్తి, గులకరాయి డ్రామాలే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాజధాని రైతుల్లో గందరగోళం.. అయోమయం సృష్టించాలన్నది ఆయన లక్ష్యంగా ఉందని.. రైతులు ఆయన్ను నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టంచేశారు.
ప్రగతిపై శ్వేతపత్రాలు..
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనా విజయాలను శాఖలవారీగా వివరించాలని, 20లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేశామని.. ఇప్పుడు కూడా రెండేళ్లలో సాధించిన ప్రగతిని శ్వేతపత్రాల ద్వారా వివరించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని రైతులు పంటమార్పిడిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. స్థానిక అవసరాలను బట్టి పంటల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. పామాయిల్ సాగుకు చాలా అవకాశాలు ఉన్నాయని, దేశీయ అవసరాల కోసం ఇంకా 60 శాతం పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటులో జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు
చరిత్రాత్మక విజయానికి రెండేళ్లు
క్యాబినెట్ సమావేశానికి సీఎం రాగానే మంత్రులు, అధికారులు నిల్చొని చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. 2024 జూన్ 4న కూటమి చరిత్రాత్మక విజయం సాధించి.. విధ్వంస పాలనకు చెక్ పెట్టి ఇప్పటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రులు చెప్పగా.. మీకు గుర్తుందాఅని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖకు వివిధ విభాగాల్లో వచ్చిన కేంద్ర అవార్డులను ప్రదర్శించారు. ఆ శాఖ అధికారులను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సీఎం అభినందించారు. కాగా, ఏడాదిలో మోదీ పదవి కోల్పోతారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని, ఇలాంటి మాటలతో రాహుల్ తన విశ్వసనీయతను తానే దెబ్బతీసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. కాగా, రష్యా పర్యటనలో ఉన్నందున లోకేశ్, కేరళం పర్యటనలో ఉన్న కారణంగా కందుల దుర్గేశ్ క్యాబినెట్ భేటీకి హాజరుకాలేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వల్ప అనారోగ్యం కారణంగా సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు.