జగన్ రైతుద్రోహి
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:50 AM
రైతులకు జగన్ ద్రోహం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల మరమ్మతులకు పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.
సీఎంగా ఉన్న ఐదేళ్లూ ప్రాజెక్టులు గాలికి
గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి
ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పూయలేదు
మరమ్మతులకు ఒక్క పైసా ఇవ్వలేదు
పట్టిసీమను ఒట్టిసీమ అని విమర్శించారు
ఈ ప్రాజెక్టు లేకుంటే నేడు పరిస్థితి ఏంటి?
మూడేళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై షెడ్యూల్
అమరావతికి జగన్ అడ్డుపడుతున్నారు
భూములివ్వకుండా రైతులను రెచ్చగొడుతున్నారు
15 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి: సీఎం
పవిత్ర సంగమం వద్ద చంద్రబాబు జలహారతి
సమాజంలో మంచిని ప్రోత్సహించాలి. చెడును ఖండించాలి. నీకు చెడు జరిగితే బాధతో మాట్లాడి, సమాజానికి చెడు జరిగితే మాట్లాకుండా ఉండడం సరికాదు. మీ పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే బాధ్యత నాది. దానికి అవరోధం కలిగించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజల భవిష్యత్తు కోసం పనిచేసే వారితో కలిసి పనిచేస్తాం
- చంద్రబాబు
అమరావతి/విజయవాడ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రైతులకు జగన్ ద్రోహం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల మరమ్మతులకు పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఐదేళ్లలో ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజు పూసేందుకు నయా పైసా కూడా విదిలించలేదని, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుంటే ఒట్టిసీమ అంటూ జగన్ ఎగతాళి చేశారని, ఇప్పుడు రాష్ట్రానికి ఈ పథకం జీవనాధారమైందని అన్నారు. కృష్ణా-గోదావరి నదులను కలుపుతోందని, రైతులకు సాగు నీరందిస్తోందని వ్యాఖ్యానించారు. బుధవారం ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమం వద్ద సీఎం చంద్రబాబు వేద పండితుల సమక్షంలో జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత ఇంజనీర్ కేఎల్‌రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కేఎల్‌రా వు కుమారుడు కేఎల్ విజయరావు, మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ తదితరులు హాజరయ్యారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోయాయన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందన్నారు. పంట సీజన్ మారిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి నుంచి రైతులను రక్షించాలనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామన్నారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారకుండా చర్యలు చేపట్టామ ని వివరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత బస్సులోనే బస చేసి కృష్ణా డెల్టాకు న్యాయం చేసేలా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించామన్నారు.
కృష్ణా డెల్టా బంగారం
‘గోదావరి నీళ్లు అరుణ వర్ణంలో ఉంటాయి. కృష్ణవేణి నీలం రంగులో ఉంటుంది. ఈ రెండు కలిస్తే బంగారం రంగు వస్తుంది. గోదావరి నీళ్లు కృష్ణవేణి లో కలిశాక కృష్ణా డెల్టా బంగారమే అయింది. పట్టిసీమ పంపులకు పదేళ్లలో రూ.120 కోట్లు ఖర్చయిం ది. విద్యుత్ బిల్లు రూ.100 కోట్లు, ఇతర ఖర్చులు రూ.20 కోట్లు అయ్యాయి. 13 లక్షల ఎకరాల స్థిరీకర ణ జరిగింది’ సీఎం చంద్రబాబు అన్నారు. నాడు పట్టిసీమను జగన్ అవహేళన చేశారని, ఇప్పుడు ఈ ప్రాజెక్టు లేకపోతే రైతులు ఏమయ్యేవారని ప్రశ్నించా రు. 2017-2025 వరకూ పట్టిసీమ ద్వారా 450 టీఎంసీల నీటిని తరలించారని చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.1300 కోట్లతోనే నిర్మించామన్నారు.
నదుల అనుసంధానం జరగాలి
2014-19 మధ్య కాలంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.60,000 కోట్లను ఖర్చు చేశామని చంద్రబాబు వెల్లడించారు. తుంగభద్ర డ్యామ్‌కు కొత్త గేట్ల ను అమర్చామని చెప్పారు. 2014-19 మధ్య కాలం లో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చే స్తే.. 2019-24 మధ్య జగన్ కనీసం 2 శాతం కూడా చేయలేదన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.2250 కోట్లు ఇచ్చామని తెలిపారు. 2027 నాటికి పోలవరం తొలిదశ పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసి జీవనాడిగా మారుస్తామన్నారు. ప్రాధాన్య క్రమంలో మూడేళ్లలో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు పారించి ఈ ఏడాది ఆగస్టు 14న అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ప్రకటించా రు. వెలిగొండను పూర్తి చేసి ఈ ఏడాది సెప్టెంబరు 1న జాతికి అంకితమిస్తామన్నారు. వైసీపీ పాలనలో ఈ ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. ఇక్కడ టన్నెళ్లలో మిషన్ ఇరుక్కుపోయింద న్న విషయాన్ని ప్రజలకు చెప్పకుండా మోసం చేశారని ఆరోపించారు. ఇవన్నీ దాచిపెట్టి పనులు పూర్తయ్యాయని శిలాఫలకం పెట్టి ప్రారంభోత్సవం చేశారని, ఈ మోసానికి చిహ్నంగా ఉన్న శిలాఫలానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు.
‘ఆరుతడి’పై ఆలోచించండి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సా గుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయని ముందుచూపు లేకుండా పంటలు వేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. రైతులు ఈ ఏడాది ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. మెట్టప్రాంత రైతులు ప్రకృతి సే ద్యం చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. వర్షపు నీటిని భూగర్భ జలాలు గా మార్చాలని సూచించారు. రాష్ట్రంలో మెట్ట ప్రాం తాల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఇటీవల జలధార కార్యక్రమంలో 79,625 పనులు ప్రారంభించామన్నారు. ఇందుకోసం రూ.3267 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇప్పటి వరకు 93శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
తలసరిలో లింగాల టాప్
గోదావరి నీళ్లను పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి తరలించడం వల్ల కృష్ణా డెల్టా బాగుపడిందని చం ద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉపయోగించే కృష్ణా నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు ఇచ్చామన్నారు. అక్కడి నుంచి సీమకు నీళ్లు వెళ్తున్నాయని వివరించారు. ఇప్పుడు రాయలసీమ ఉద్యాన పంటలకు హబ్‌గా మారిందన్నారు. కడప జిల్లా లింగాల మం డలంలో ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కువ తలసరి ఆదాయం ఇక్కడి నుంచే వస్తోందని చెప్పారు. అనంతపురం జిల్లాలో గొల్లపల్లి రిజర్వాయర్‌ను పూర్తిచేసి కియా కార్ల తయారీ పరిశ్రమకు నీళ్లు ఇచ్చామన్నారు. నీరు ఉంటేనే పరిశ్రమలు వస్తాయని వివరించారు.
జగన్ అడ్డుపడుతున్నారు
ఉమ్మడి ఏపీలో హైటెక్ సిటీ నిర్మాణం వృథా అని నాటి ప్రతిపక్షాలు గోల చేశాయని, ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ప్రతిపక్ష నేత జగన్ అడ్డుపడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతుంటే.. కొందరు రైతులను రెచ్చగొట్టి సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయ త్నం చేశారన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి 99.5 శాతం మంది రైతులు భూములు ఇచ్చారని తెలిపారు. ఒక రైతు మాత్రం తనకున్న ఐదెకరాల భూమి ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని, ఈ విషయంలో ఆయన తప్పేమీ లేదని, కొందరు వైసీపీ నేతలు ఆ రైతును రెచ్చగొట్టి ఈ విధంగా చేయిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు నిర్మాణం ఆగకూడదన్న ఉద్దేశ్యంతో అవా ర్డు పాస్ చేసి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందన్నారు.
ఇదిగో షెడ్యూల్
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ను ప్రారంభించడానికి, కొత్తగా చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేయడానికి చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించారు. 36 ప్రాజెక్టులకు ఇప్పటి వరకు రూ.85 వేలకోట్లు చేశామని, మరోరూ.35 వేలకోట్లతో పూర్తి చేస్తామని తెలిపారు.
గుంటూరు చానల్ ఆధునికీకరణ ఈ నెలలోనే.
పేరూరు బ్రాంచ్ కెనాల్‌కు ఆగస్టు 4న శంకుస్థాపన.
పాలేరు రిజర్వ్‌కు సెప్టెంబరు 10న శంకుస్థాపన.
హంద్రీనీవా 400-490 వరకు రెండో దశ ప్రధాన కాలువ అక్టోబరు 31న, 490-554 వరకు 2027 జూన్ 30న ప్రారంభం.
నేరేడు బ్యారేజీకి నవంబరు 30న శంకుస్థాపన.
పెన్నా, సర్వేపల్లి రిజర్వాయర్ డిసెంబరులో ప్రారంభం.
జనవరి 31న మద్దువలస-2 ప్రారంభిస్తారు.
జంజావతి రిజర్వాయర్ 2027 జనవరిలో ప్రారంభం.
ఏప్రిల్ 30న హీర మండలం ఎత్తిపోతల ప్రారంభం.
నీవా బ్రాంచ్ కెనాల్ 2027 జూన్ 30న ప్రారంభం.
నాగావళి-చంపావతి ఇంటర్ లింకింగ్ పనులకు 2027 జూన్ 30న శంకుస్థాపన.
బుడమేరు అండర్ టన్నెల్‌ను 2027 జూన్ 30న ప్రారంభిస్తారు. బుడమేరు డైవర్షన్ చానల్ పూర్తి.
వంశధార రెండో దశ 2027 జూన్ 30 నాటికి పూర్తి.
చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు 2027 జూలై 31 నాటికి పూర్తి.
2027 జూలై 15న మహేంద్రతనయ ఆఫ్‌షోర్ ప్రారంభం.
గజపతినగరం బ్రాంచ్ కెనాల్ 2027 జూలై 31న జాతికి అంకితం.
తోటపల్లి ప్రాజెక్టు 2027 జులై 20న ప్రారంభం.
ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకాన్ని, రిజర్వాయర్‌ను 2027 సెప్టెంబరు 30న ప్రారంభిస్తారు.
ఎస్‌ఎస్ఎల్‌సీ ఆల్లూరుపాడు-మేర్లపాక ప్రాజెక్టును 2027 సెప్టెంబరు 30న ప్రారంభిస్తారు.
తిరుపతి వద్ద ఉన్న మల్లెమడుగు ప్రాజెక్టును 2027 సెప్టెంబరు 30న ప్రారంభిస్తారు. అదే ఏడాది డిసెంబరు 31న మల్లెమడుగు రిజర్వాయర్ ప్రారంభం.
మడకశిర బ్రాంచ్ కెనాల్ 2027 డిసెంబరు 31కి పూర్తి.
తారకరామ ప్రాజెక్టు 2027 డిసెంబరు 30కి పూర్తి.
వేదావతి పథకాన్ని 2028 జూన్ 30కి పూర్తిచేస్తారు.
భైరవానితిప్ప ఎత్తిపోతల 2028 జూన్ 30కి పూర్తి.
2028 జూన్ 30కి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పూర్తి.
గాలేరు-నగరి-కడప టౌన్ ప్రాజెక్టు 2028 జూన్ 30 నాటికి పూర్తి.
గోదావరి డెల్టా ఆధునికీకరణ 2028 జూన్ 30కి పూర్తి.
పల్నాడు జిల్లాలో వరికపూడిశిల 2028 డిసెంబరు 15న ప్రారంభం.
ఎస్‌ఆర్‌ఎంసీని 80 వేల క్యూసెక్కులకు ఆధునికీకరించే పనులు 2028 డిసెంబరు 28 నాటికి పూర్తి.
జీఎన్‌ఎస్ఎస్‌ను కడప నుంచి నీటిని కోడూరుకు తీసుకొచ్చే పనులు 2028 డిసెంబరు నాటికి పూర్తి.