Share News

హిట్‌.. రన్‌.. ఎస్కేప్‌.. జగన్‌ విధానం!

ABN , Publish Date - Jul 12 , 2026 | 04:41 AM

‘‘జగన్‌ నమ్ముకున్నది రెండింటినే. ఒకటి గొడ్డలి. మరొకటి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడమే.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం మంగళగిరిలోని..

హిట్‌.. రన్‌.. ఎస్కేప్‌.. జగన్‌ విధానం!

  • గొడ్డలి, సోషల్‌ మీడియానే ఆయన అస్త్రాలు

  • ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడతారు

  • ఆ తర్వాత వెళ్లి బెంగళూరులో దాక్కుంటారు

  • జగన్‌ లాంటి నేతలు రాష్ట్రానికి ప్రమాదకరం

  • మావిగన్‌.. జగన్‌ నేర నైజానికి ఉదాహరణ

  • పారిశ్రామికవేత్తలను బెదిరించాలన్నదే ఉద్దేశం

  • పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే లక్ష్యం

  • ఇంతకాలానికి ‘బ్రహ్మణి’ దోపిడీకి చెక్‌ పెట్టాం

  • త్వరలో ఓబుళాపురం గనుల సంగతి తేలుస్తాం

  • మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌ నమ్ముకున్నది రెండింటినే. ఒకటి గొడ్డలి. మరొకటి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేయడమే.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ విధానంలో గొడ్డలి పార్టీ అధినేత పనిచేస్తున్నాడు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రానికి చుట్టపు చూపుగా వచ్చి ఏదో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి.. చిచ్చు పెట్టేసి వెళ్లి బెంగళూరులో దాక్కుంటున్నాడు. జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలందరిదీ నేర మనస్తత్త్వమే. అలాంటి వాళ్లు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని మరింత విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. నిరంతరం రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు. ప్రభుత్వాన్ని, కూటమి నేతల్ని లక్ష్యంగా చేసుకుని విషప్రచారం చేయడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ నేతలు పనిచేస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో టెక్నాలజీలో చాలా మార్పులు వస్తాయని, అవి మరింత ప్రమాదకరంగా ఉండొచ్చన్నారు. అలాంటి ప్రమాదాలు ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించడం కోసం టీడీపీ నేతలను రెచ్చగొట్టి ట్రాప్‌లోకి లాగాలని గొడ్డలి పార్టీ నేతలు చూస్తున్నారని, వైసీపీ వాళ్ల ట్రాప్‌లో పడొద్దని పార్టీ నాయకులందరికీ గట్టిగా హెచ్చరించానని సీఎం తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


ఆ హంతకుడిలానే.. జగన్‌ కూడా!

తెలంగాణలో ఓ సైకో తనపై పోక్సో కేసు పెట్టారని ఓ కుటుంబాన్ని, జైలుకు వెళ్లిన తనకు సహకరించలేదని సొంత కుటుంబాన్ని మొత్తంగా ఆరుగురిని హత్యచేశాడు. జగన్‌ మనస్తత్త్వం కూడా అలాంటిదే. తనకు సహకరించలేదని సొంత తల్లి, చెల్లిని తరిమేశాడు. సొంత బాబాయిపై గొడ్డలి ప్రయోగించాడు. ప్రజలు తనకు ఓటేయలేదని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఆలోచనతో జగన్‌ వ్యవహరిస్తున్నాడు. జగన్‌లాంటి నేరప్రవృత్తి ఉన్న నేతలు రాష్ట్రానికి ప్రమాదకరం. నేరప్రవృత్తిని నిలువరించాలంటే టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికత కూడా ఎంతో ముఖ్యం. జగన్‌ కుటుంబ చరిత్ర మొత్తం నేరపూరితమే. ఆ కుటుంబం వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా ఎందరో ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు, పలువురు పారిశ్రామికవేత్తలు కూడా జైలుకు వెళ్లారు.

ఆ భూదోపిడీ జరగకుంటే..

వైఎస్‌ హయాంలో బ్రహ్మణి స్టీల్స్‌ పేరుతో జరిగిన వ్యవహారం అంతా మోసమే. ఓబుళాపురం గనులను తవ్వి సొమ్ము చేసుకునేందుకు బ్రహ్మణీ స్టీల్స్‌ అనే డ్రామా ఆడా రు. 14వేల ఎకరాలను అప్పనంగా కట్టబెట్టేశారు. విలువైన ఖనిజాన్ని తవ్వి సొమ్ము చేసుకున్నారు. ఆ భూములను, ఓబుళాపురం గనులను సద్వినియోగం చేసుకుని ఉంటే ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. యువతకు ఉపాధి అవకాశాలు లభించేవి. విశాఖ బాక్సైట్‌ విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారు. ఇంతకాలానికి బ్రహ్మణి స్టీల్స్‌కు చెక్‌ పెట్టి భూములను స్వాధీనం చేసుకోగలిగాం. ఓబుళాపురం మైనింగ్‌ వ్యవహారాన్ని త్వరలో కొలిక్కి తెస్తాం. రాష్ట్రానికి ఉన్న ప్రధాన వనరు విలువైన భూములే. వాటిని వైఎస్‌ కుటుంబం తమ సొంత ఆస్తిలా ధారాదత్తం చేసి లక్షల కోట్ల దోపిడీకి పాల్పడింది.


జగన్‌ను ఆదర్శంగా తీసుకోవద్దు!

టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును.. టెక్కలి మాజీ ఎమ్మెల్యే వరద సరోజ భర్త, ఆమె ఇద్దరు కుమార్తెలు కలిశారు. తమ ఆస్తిని సొంత కొడుకు లాగేసుకుని ఇంటి నుంచి గెంటేశాడని సరోజ భర్త ఆవేదన వ్యక్తంచేశారు. పరిశీలించి న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఈ ఉదంతాన్ని చంద్రబాబు మీడియాతో ప్రస్తావించారు. ‘‘సరోజ ఫ్యామిలీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. శ్రీకాకుళంలో మొదట హోటల్‌ పెట్టింది వారే. జగన్‌ లాంటి నేతలను సమాజంలో కొందరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకర ధోరణి. అదే జరిగితే కుటుంబ విలువల అర్ధమే మారిపోతుంది. సరోజ కొడుకు కూడా జగన్‌లానే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని లాగేసుకుని తండ్రిని, తోబుట్టువులను గెంటేశాడు. జగన్‌లాంటి నేతలను ఆదర్శంగా తీసుకోవద్దు. ప్రతి ఒక్కరూ కుటుంబ బంధాలకు ప్రాధాన్యమివ్వాలి.’’ అని సూచించారు.

Updated Date - Jul 12 , 2026 | 06:03 AM