Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబు పొలంబాట.. రీసర్వే, సమస్యలపై ప్రత్యేక దృష్టి..

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:19 AM

ప్రభుత్వ కార్యక్రమాల్లో.. ఇటు అధికారులు, అటు వేదిక మీదకు తీసుకొచ్చే వారికి పక్కాగా ట్రైనింగ్‌ ఇచ్చి తీసుకొస్తారు. ‘అంతా బాగుంది’ అనిపిస్తారు. జేజేలు కొట్టించుకుని వెళ్లిపోతారు!

CM Chandrababu: సీఎం చంద్రబాబు పొలంబాట.. రీసర్వే, సమస్యలపై ప్రత్యేక దృష్టి..

  • ఉన్నతాధికారులను పక్కనపెట్టి.. వీఆర్వో, సర్వేయర్లతో నడిచిన సీఎం చంద్రబాబు

  • రైతు పొలంలోకి వెళ్లి ప్రత్యక్ష పరిశీలన భిన్నంగా జరిగిన రాయవరం ‘గ్రామసభ’

  • తప్పులు, సమస్యలపై రైతులకు ప్రశ్నలు

  • ఈ-కేవైసీ అయిన వారంతా సభకు రాలేదేమని ప్రశ్న

  • లోపం ఎక్కడుందని జేసీపై ఆగ్రహం

  • తర్వాత మంత్రులు, అధికారులతో సమీక్ష

  • రీసర్వేలో తప్పులను సహించేదిలేదని అధికారులకు స్పష్టీకరణ

  • కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

జగన్‌ హయాంలో జరిగిన భూముల రీసర్వేలో ఘోరమైన తప్పులు జరగడం నిజం! వాటిని నేటికీ సరిదిద్దకపోవడమూ నిజం! జగన్‌ ఫొటో తొలగించి... రాజముద్రతో ఇస్తున్న కొత్త పాస్‌ పుస్తకాల్లోనూ తప్పులు దొర్లుతున్నాయి. ఈ లోటుపాట్లపై అధికారులు ప్రభుత్వానికి ఇస్తున్న నివేదికలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకూ పొంతనలేదని ‘ఆంధ్రజ్యోతి’ పలు కథనాల ద్వారా స్పష్టం చేసింది. ఈ విషయం సీఎం దృష్టికీ వచ్చింది. అందుకే... శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పట్టాదారు పాస్‌ పుస్తకాలను అందించే కార్యక్రమాన్ని ఆయన పూర్తి భిన్నంగా నిర్వహించారు. ఉన్నతాధికారులు, నేతలను పక్కనపెట్టి.. వీఆర్వో, సర్వేయర్లతో పొలంబాట పట్టారు. అధికారులు, మంత్రులతో సమావేశమై రీసర్వేల్లో తప్పులు సహించేది లేదని హెచ్చరించారు.

రైతుకు భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు.. జీవనాధారం. కుటుంబానికి భద్రత. భవిష్యత్‌కు నమ్మకం. అది ఎకరా కావచ్చు. అర ఎకరా కావచ్చు. ఐదు సెంట్లు కావచ్చు. కనీసం ఇంటి జాగా కావచ్చు.

రాజధానిపై కొత్తనాటకాలు చేస్తున్నారు. రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదట. మూడుముక్కలాట అయిపోయింది. రాక్షసుల మాదిరిగా అబద్ధాలు చెబుతున్నారు.

- చంద్రబాబు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ కార్యక్రమాల్లో.. ఇటు అధికారులు, అటు వేదిక మీదకు తీసుకొచ్చే వారికి పక్కాగా ట్రైనింగ్‌ ఇచ్చి తీసుకొస్తారు. ‘అంతా బాగుంది’ అనిపిస్తారు. జేజేలు కొట్టించుకుని వెళ్లిపోతారు! ఇది ఎప్పుడూ జరిగేదే! కానీ... రీసర్వేలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భిన్నమైన పంథా అనుసరించారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాయవరం పర్యటనలో స్థానిక యంత్రాంగం చేసిన ‘ఏర్పాట్లు’ దాటి ముందుకు నడిచారు.


ఉన్నతాధికారులు, మంత్రులను సైతం పక్కనపెట్టి నేరుగా పొలాల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. రీసర్వేలో కష్టాలు, పట్టాదారు పుస్తకాల్లో తప్పులపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. అధికారులు మాత్రం ప్రభుత్వానికి ‘అంతా బాగుంది’ అనే నివేదికలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో తేడా ఉందని గ్రహించిన చంద్రబాబు తన సొంత వనరులు, ఇతర వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. రాయవరం పర్యటనలో అసలు విషయాన్ని నేరుగా రైతులు, సర్వేయర్ల నుంచే తెలుసుకునేందుకు పొలంబాట పట్టారు. అమరావతి నుంచి వచ్చిన రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌, సీసీఎల్‌ఏ జయలక్ష్మి, సర్వే డైరెక్టర్‌ కూర్మనాథ్‌, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ మేఘ స్వరూప్‌, ఇతర ఉన్నతాధికారులను గ్రామ సభకే పరిమితం చేశారు. స్థానిక వీఆర్‌ఓ శైలజ, సర్వేయర్లు మాధురి, కళ్యాణిలతో కలిసి పొలంబాట పట్టారు. అక్కడ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన తీరును పరిశీలించారు. సత్యసాయిబాబా అనే రైతు పొలం వద్దకు వెళ్లి ‘గ్రామంలో రీసర్వే జరుగుతోంది కదా.. మీరు సంతోషంగా ఉన్నారా?’ అని ప్రశ్నించారు. తాను సంతోషంగానే ఉన్నానని రైతు చెప్పారు. ‘‘భూములకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయి. రీసర్వే చేసి వివాదాలకు శాశ్వత పరిష్కారం ఇస్తాం. నీ భూమి ఎక్కడుంది? నీ పట్టా ఏది?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. రైతు తన భూమి వద్దకు బాబును తీసుకెళ్లి చూపించగా... ‘‘మీ దగ్గర ఉన్న రోవర్‌లో ఈ భూమిని ఎలా చూపిస్తారు? కోఆర్డినేట్స్‌లో చూపించగలరా?’’ అని సీఎం సిబ్బందిని ప్రశ్నించారు. వారు రోవర్‌లో చూపించిన పాయింట్‌కు వద్దకు వెళ్లేందుకు పంట కాలువ దాటారు. స్థానిక రైతులు ‘వారధి’లా వేసిన పాత విద్యుత్‌ స్తంభంపైనే ముఖ్యమంత్రి నడిచారు. రోవర్స్‌ వినియోగం గురించి, రీ సర్వేలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపై గ్రామస్థాయి అధికారులకు ఉన్న అవగాహనను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వీఆర్‌ఓ లాగిన్‌ద్వారా రైతు సాయిబాబా డేటాను పరిశీలించారు. అనంతరం రైతుకు కొత్తగా రాజముద్రతో ముద్రించిన పాస్‌పుస్తకాన్ని పొలంలోనే అందించారు. అందులో అన్ని వివరాలు కరెక్టుగా ఉన్నాయా? అని సీఎం ఆరాతీశారు.


విభిన్నంగా గ్రామసభ

పొలాలను పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు రైతులతో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొన్నారు. ఇక సీఎం నుంచి ఎలాంటి ప్రశ్నలు ఉండవని, నలుగురైదుగురు రైతులను వేదికమీదకు పిలిచి పాస్‌పుస్తకాలు ఇచ్చి, ఆ తర్వాత ప్రసంగించి వెళ్లిపోతారని అధికారులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు రైతుల నుంచే అనేక వివరాలు ఆరా తీశారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు తీసుకున్నవారు చేతులెత్తండి అంటే 15 మంది మాత్రమే స్పందించారు. దీంతో సీఎంకు అనుమానం వచ్చి... ‘ఇంతేనా? అందరికీ ఇవ్వలేదా?’ అని వీఆర్‌ఓ శైలజను సీఎం ప్రశ్నించారు. ‘ఇస్తున్నాం సర్‌’ అని ఆమె బదులిచ్చారు. తమకు ఇవ్వలేదని సభలో కూర్చున్న రైతులు గట్టిగా చెప్పారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌పై సీఎం ఆగ్రహించారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘మొత్తం పంచాయతీలో 2037 పాస్‌ పుస్తకాలు వచ్చాయి. అందులో 1873 కరెక్టుగా ఉన్నాయి. ఈ-కేవైసీ చేసి 900 మందికి ఇచ్చాం’’ అని జేసీ చెప్పారు. మరి ఆ 900 మంది ఇక్కడ లేరే అని సీఎం ప్రశ్నించారు. పాస్‌ పుస్తకాలు పొందిన వారు ఎంత మంది సభకు వచ్చారన్న వివరాలను అధికారులు స్పష్టంగా చెప్పలేకపోయారు. ‘‘ఈ-కేవైసీ తర్వాత రైతులను తీసుకొచ్చే బాధ్యత మీదే. ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు రైతులూ ఇక్కడ ఉండాలి. ఇది మీ లోపమా? వారి లోపమా? గ్రామసభలో రైతుల వివరాలు చదివి వినిపించి అన్నీ కరెక్టుగా ఉన్న తర్వాతే పుస్తకాలను రైతులకు ఇవ్వాలి. వాటిని రైతులు చూసి సంతృప్తి చెందితేనే మీరు పరీక్షలో పాస్‌ అయినట్లు. మీరు ఇలాంటివి చేస్తారని తెలిసే నేను ఇక్కడకు నేరుగా వచ్చా. రూపాయి అవినీతి లేకుండా, సమస్యలు లేకుండా, వారి భూమి వారి హక్కు. దాన్ని నెరవేర్చే బాధ్యత మీ అందరిది. ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోండి’’ ఆని సీఎం స్పష్టం చేశారు.


తప్పులు చేస్తే సహించను

రాయవరంలో గ్రామసభ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. సమావేశం ప్రారంభంలోనే అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘రీ సర్వేలో తప్పులెందుకు వస్తున్నాయి? ఇందుకు బాధ్యులెవరు? తప్పులకు కారణం ఏమిటి’’ అని అధికారులను సీఎం నిలదీశారు. రీ సర్వేను సరిగ్గానే చేస్తున్నామని, తప్పులు రావడం లేదని జేసీ నివేదించారు. మరి.. దేవరపల్లి మండలం కురుకూరులో రైతులు ఎందుకు ధర్నా చేశారని సీఎం ప్రశ్నించారు. రీ సర్వేలో భారీగా తప్పులు వస్తున్నాయని సీఎం స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘భూసమస్యల శాశ్వత పరిష్కారానికి, రీ సర్వేకు ఎంతో ఖర్చుపెడుతున్నాం. తప్పులు జరిగితే అదంతా వృథా అవుతుంది. రైతుల సమ్మతి, సమక్షంలోనే కొలవండి. రైతుతో రీ సర్వే డేటాను సరిపోల్చుకోండి. గ్రామసభలో ఆ వివరాలను ఉంచి చర్చించండి’’ అని సీఎం ఆదేశించారు. మళ్లీ మళ్లీ రీసర్వేలో అవే తప్పులు వస్తే సహించనని తీవ్రంగా హెచ్చరించారు. జగన్‌ ప్రభుత్వంలో ఇలాంటి తప్పులే జరిగాయని గుర్తు చేశారు. రెవెన్యూ, సర్వే అధికారులు రీ సర్వే జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Jan 10 , 2026 | 06:33 AM