వికాసం.. వైభవం
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:10 AM
ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం నుంచి వికాసానికి, వికాసం నుంచి వైభవం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం పయనిస్తోందని తెలిపారు.
తొలి సంతకం నుంచే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అంకితం
స్వర్ణాంధ ప్రతి ఒక్కరి సంకల్పం కావాలి
అవకాశాలను ఆర్థిక శక్తిగా మారుద్దాం
దేశ నిర్మాణంలో వ్యక్తిగత విజయాలూ భాగమే
రెండున్నరేళ్లలో సంక్షేమంపై 1.50 లక్షల కోట్లు,
అభివృద్ధికి రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు చేశాం
అప్పుల రీషెడ్యూల్‌తో 8,269 కోట్ల ఆదా
14 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
11 లక్షల ఉద్యోగాలు ఇస్తాం
ఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ: సీఎం
అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా 80వస్వాతంత్య్ర దినోత్సవం
అమరావతి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం నుంచి వికాసానికి, వికాసం నుంచి వైభవం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రం పయనిస్తోందని తెలిపారు. స్వర్ణాంధ్ర సాధన సంకల్పాన్ని 5.5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం అమరావతిలోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగిన 80వ స్వాతంత్య్రదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మువ్వన్నెల జెండాను సీఎం ఎగురవేశారు. అనంతరం పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అక్కడ ఏర్పాటుచేసిన వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్రం అంత తేలికగా, ఒక్కరోజులో, ఒక్కరి పోరాటంతో రాలేదని; దశాబ్దాల కృషి, ఎందరో మహనీయుల బలిదానం, అమరవీరుల ప్రాణత్యాగంతో సాకారమైందన్నారు. 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నంబర్ 1గా చేసే లక్ష్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. హక్కులను, గౌరవాన్ని ఇచ్చిన దేశానికి మనమేం చేయగలమనేది ప్రతి ఒక్కరం ఆలోచించాలని కోరారు. అనుకున్న లక్ష్యం సాధించడానికి వచ్చే 20 ఏళ్లు అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలన్నారు. వ్యక్తిగత విజయాలన్నీ దేశ నిర్మాణంలో భాగమేనని స్పష్టం చేశారు. దేశానికి బలమైన రాష్ట్రంగా ఏపీ ఎదగాలని ఆకాంక్షించారు. ’’గత పాలనలో రాష్ట్రం ధ్వంసమైంది. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. ఐదేళ్లూ చీకటి రోజులు చూశాం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడింది. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది.
కూటమి అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ బాధ్యతను తీసుకున్నాం. రెండేళ్లలో ఏపీని నిలబెట్టాం. తొలి సంతకం నుంచే...సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకు అసలైన అర్థం చెప్పాం. 26 నెలల్లోనే ప్రజలకు మార్పు కనిపించేలా చేశాం. విధ్వంసం నుంచి వికాసం వైపు...సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు... అనిశ్చితి నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం’’ అని సీఎం తెలిపారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ..ఇదే మన లక్ష్యమని నిర్దేశించారు. దీనికోసం 10 సూత్రాలు రూపొందించుకున్నామని, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ విధానమని వివరించారు. ‘‘పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్‌ప్లాంట్, రైల్వే జోన్, అంతర్జాతీయ పెట్టుబడులు.. ఇలా అన్నింటిలోనూ కేంద్రం సహకారం అందిస్తోంది. అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టడంతో నేడు వృద్ధి రేటు 11.3 శాతానికి పెరిగింది. గత పాలకులు చేసినఅప్పులను రీషెడ్యూల్ చేసి వడ్డీభారం తగ్గించగలిగాం. ఇప్పటి వరకు రూ.8,269 కోట్లు ఆదా అయ్యేలా చర్యలు చేపట్టాం. 26 నెలల్లో 1.50లక్షల కోట్లు సంక్షేమానికి, రూ.1.34 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం. పేదల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు పీ4 కార్యక్రమం చేపట్టాం’’ అని సీఎం తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
పెట్టుబడుల వెల్లువ...
‘‘రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం. రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో 14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వాటిద్వారా 11లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25ు రాష్ట్రానికే వచ్చాయి. రెండేళ్లలో ఎఫ్‌డీఐ ఆరున్నర రెట్లు పెరిగింది. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెల్లార్ మిత్తల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, దాల్మియా సిమెంట్, ఎఎం గ్రీన్ అమ్మోనియా, హీరో, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్వర్ణగిరి గోల్డ్‌మైన్ వంటి అనేక ప్రాజెక్టులు వచ్చాయి. 95 వేల కోట్ల విలువైన బీపీసీఎల్ వంటి భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. డిఫెన్స్ ప్రాజెక్టుకు 36రోజుల్లోనే అనుమతులు ఇచ్చాం. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కుల ఏర్పాటే లక్ష్యం. ఇప్పటికి 138 పార్కులకు శ్రీకారం చుట్టాం.’’
ప్రజలే ఫస్ట్ విధానం..
‘‘మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వయం బ్రాండ్ పేరిట వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. ఏపీలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వటం ద్వారా పెట్టుబడులు సాధిస్తున్నాం. వారసత్వంగా వచ్చిన ఆస్తులు, భూమిపై హక్కులు కాపాడేలా రెవెన్యూలో సంస్కరణలు తెచ్చాం. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగాన్ని బలోపేతం చేశాం.ప్రజలే ఫస్ట్ నినాదంతో పీపీపీకి ప్రాధాన్యం ఇస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు. అంతకుముందు.. పోలీసులకు పతకాలు అందించారు.
ఆకట్టుకున్న శకటాలు..
ప్రభుత్వ పథకాలను, వాటి ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రదర్శించిన శకటాలు ఆకర్షించాయి. దాదాపు 20పైగా శకటాలను వివిధ శాఖలు ప్రదర్శించాయి. అందులో సర్వ శిక్ష అభియాన్ శకటానికి, హార్టీకల్చర్ శకటానికి సీఎం మొదటి బహుమతి అందించారు. హ్యాండ్‌లూమ్స్ శకటానికి రెండో బహుమతి, అటవీ శాఖకు చెందిన శకటానికి మూడో బహుమతి లభించాయి.