Share News

దక్షిణాది ప్రగతికి కలిసి కదులుదాం

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:24 AM

రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు.

దక్షిణాది ప్రగతికి కలిసి కదులుదాం

  • రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్‌ భారత్‌ సాకారం: చంద్రబాబు

  • దేశ స్థూల ఉత్పత్తిలో 5 దక్షిణ రాష్ట్రాల వాటా 31శాతం

  • 2047కి 10 ట్రిలియన్‌ డాలర్ల శక్తిగా సౌతిండియా

  • గోదావరి-కావేరి సంధానంతో 500 టీఎంసీల వరద

  • సద్వినియోగం.. ఉమ్మడి లాజిస్టిక్స్‌, డ్రైపోర్టుల నెట్‌వర్క్‌

  • ఏపీ, తమిళనాడు, కర్ణాటక నడుమ బుల్లెట్‌ రైలు

  • జాతీయ విద్యుత్‌ గ్రిడ్‌తో సదరన్‌ గ్రిడ్‌ అనుసంధానం

  • తిరుపతి టు అయోధ్య.. తీర్థయాత్ర సర్క్యూట్‌

  • సదరన్‌ కౌన్సిల్‌ భేటీలో సీఎం ప్రతిపాదనలు

దేశ స్థూల ఉత్పత్తిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల వాటా ప్రస్తుతం 31 శాతంగా ఉంది. 2047 నాటికి భారత్‌ 30-35 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో వీటిది ప్రధాన భూమిక.

దక్షిణాది రాష్ట్రాలు విడివిడిగా విజయం సాధించినా.. కలిసికట్టుగా పనిచేస్తే భారతదేశ భవిష్యత్‌నే నిర్దేశించగలవు. రాష్ట్రాల నడుమ పోటీని సమష్టి శక్తిగా మారిస్తే దక్షిణాదికి తిరుగుండదు.

నదీ పరీవాహక ప్రాంతాల మధ్య సమన్వయానికి ప్రత్యేక దక్షిణాది నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. డీపీఆర్‌లు, అనుమతులను నిర్దేశిత కాలపరిమితిలో కేంద్రం పూర్తి చేయాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర సహకారం, సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగితే దేశాభివృద్ధికి మరింత బలమైన చోదక శక్తిగా నిలుస్తాయన్నారు. 2047 నాటికి దక్షిణ భారతదేశానికి 10 ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందని తెలిపారు.


తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో 24 అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. దక్షిణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం సాధించడమే తమ లక్ష్యమన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సూచించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ఏపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్‌ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందన్నారు. ఏపీ 2.4 ట్రిలియన్‌ డాలర్లు, తమిళనాడు 2.6, కర్ణాటక 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థలుగా లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని.. సమష్టిగా దక్షిణ భారత రాష్ట్రాలన్నీ 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదుగుతాయని వివరించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో పరస్పర విశ్వాసం, రాష్ట్రాల మధ్య సహకారం, సమష్టి అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా సదరన్‌ కౌన్సిల్‌ పనిచేయాన్నారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు త్వరితగతిన అమలు అయ్యేలా చూడాలని కోరారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..


సమీకృత ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా..

‘దక్షిణాది రాష్ట్రాలకు ఉమ్మడి లాజిస్టిక్స్‌ వ్యవస్థ, డ్రై పోర్టుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. ఇది దక్షిణ భారతాన్ని సమీకృత ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా మార్చగలదు. దక్షిణాది గ్రిడ్‌ను జాతీయ విద్యుత్‌ గ్రిడ్‌తో అనుసంధానించాలి. ఒక రాష్ట్రంలో మిగులు కరెంటు ఉంటే మరో రాష్ట్ర అవసరాన్ని తీర్చే విధంగా సమర్థ విద్యుత్‌ మార్పిడి వ్యవస్థ అవసరం. దక్షిణాది వర్సిటీలు, ఇతర స్కిల్లింగ్‌ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రకృతి విపత్తుల సమయంలో పరస్పర సహాయానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ టాస్క్‌ఫోర్స్‌ (మ్యూచువల్‌ ఎయిడ్‌ ఫోర్స్‌)ను కేంద్రం ఏర్పాటు చేయాలి. దక్షిణాది ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉత్తర భారతంలోని ఆధ్యాత్మిక కేంద్రాలతో అనుసంధానిస్తూ ప్రత్యేక వారసత్వ, పర్యాటక, తీర్ధయాత్ర సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలి. తిరుపతి, శ్రీశైలం, కాంచీపురం, మధురై, రామేశ్వరం, మైసూరు వంటి ప్రాంతాలను వారణాసి, అయోధ్య, చార్‌ధామ్‌ ప్రాంతాలతో అనుసంధానిస్తే.. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చు.’

గోదావరి-కావేరి అనుసంధానంతో నీటి భద్రత

‘భవిష్యత్‌ నీటి భద్రతకు నదుల అనుసంధానమే శాశ్వత పరిష్కారం. ఏపీలో గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా వంటి 40 నదులు 28 జిల్లాలకు సాగునీటిని అందిస్తున్నాయి. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా పోలవరం, కృష్ణా, పెన్నా మీదుగా 500 టీఎంసీలకుపైగా మిగులు వరదల జలాలను కావేరి బేసిన్‌కు తరలించాలి. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం. గంగా-కావేరి అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి. గంగా నది మిగులు జలాలను దక్షిణాదికి తరలించడం ద్వారా తమిళనాడుతోపాటు దక్షిణాది రాష్ట్రాల నీటి భద్రతకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.’

Updated Date - Aug 21 , 2026 | 05:29 AM