Share News

రౌడీ రాజకీయం

ABN , Publish Date - Jul 05 , 2026 | 03:57 AM

‘‘ప్రజల విషయంలో నేను సౌమ్యుడినే. సంఘ విద్రోహ శక్తుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

రౌడీ రాజకీయం

  • నేరస్థులతో సమాజానికి నష్టం

  • రెండేళ్లలో నా రాజకీయ జీవితానికి 50 ఏళ్లు

  • ఈ వయసులోనూ రౌడీలు, మాఫియాతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధాకరం

  • రౌడీలు రాజకీయాల్లోకి రావడం వల్లే వివేకా హత్య, కోడికత్తి డ్రామా

  • రాజధానిపై జగన్‌ది రోజుకొక మాట

  • ఇక్కడా గోల్డ్‌ఫీల్డ్స్‌.. స్వర్ణ కుప్పంగా మారుస్తా

  • కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు

కుప్పం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల విషయంలో నేను సౌమ్యుడినే. సంఘ విద్రోహ శక్తుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మరో రెండేళ్లలో తన రాజకీయ జీవితానికి 50 ఏళ్లు నిండుతాయని, ఇలాంటి సమయంలో కూడా రౌడీలు, మాఫియాలతో రాజకీయాలు చేయాల్సి రావడం బాధాకరమన్నారు. నేరస్థులతో సమాజానికి తీరని నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రెండో రోజు శనివారం కుప్పం పర్యటనలో భాగంగా ఆయన రూ.118 కోట్లతో నిర్మించనున్న కుప్పం ఆర్టీసీ బస్టాండు, డిపోకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినందువల్లే వైఎస్‌ వివేకానంద హత్య జరిగింది. కోడికత్తి డ్రామా నడిచింది. వాటికి నాడు నన్ను బాధ్యుణ్ణి చేశారు. మాస్క్‌ అడిగిన డాక్టర్‌ను చనిపోయేలా చేశారు. డ్రైవర్‌ను కారు డిక్కీలో పెట్టి డోర్‌ డెలివరీ చేశారు’’ అని సీఎం మండిపడ్డారు. రాజధాని విషయంలో ప్రతి రోజూ కొత్త మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి ఆగ్రహించారు. ‘‘కేంద్రం చట్టం చేసిన తర్వాత రాజధానిని మార్చడం సాధ్యం కాదు. వాటికన్‌ తరహాలో మావిగన్‌ కావాలని గొడ్డలి పార్టీ మాట్లాడుతోంది. గొడ్డలి పార్టీ అని మేం చెప్పడం కాదు.


వాళ్లే అంగీకరిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజల భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే, మేం వివాదాస్పద భూముల సమస్యలను పరిష్కరిస్తున్నాం. శెట్టిపల్లె, వట్టిచెరుకూరు భూముల సమస్యలకు పరిష్కారం చూపాం. టీటీడీ నిధులు రూ.34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. తిరుమలలో గత పాలకమండలి కల్తీ నెయ్యి వినియోగించి భక్తుల మనోభావాలను దెబ్బ తీసింది. కూటమి ప్రభుత్వం దాన్ని అరికట్టింది’’ అని చంద్రబాబు వివరించారు. పూర్వోదయ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన పంటల్ని ప్రోత్సహించి రాయలసీమను అభివృద్ధి చేస్తామని, దీనికి వచ్చే నెలలో మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామన్నారు. సీమలో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు కాలం చెల్లిందని, అభివృద్ధే అజెండాగా మారిందని తెలిపారు. ‘‘కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్స్‌ ప్రారంభించాం. ఇప్పుడు దేశంలో బంగారం సరఫరా చేసే వాటిల్లో కేజీఎఫ్‌ తర్వాత జొన్నగిరి గోల్డ్‌ ఫీల్డ్స్‌ పేరే వినిపిస్తోంది. కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని చెప్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని అందుబాటులో తెచ్చి స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాం. మైక్రో ఇరిగేషన్‌లో కుప్పం దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రానికి అది శ్రీరామరక్షగా మారింది’’ అని సీఎం వివరించారు.


నెట్‌ జీరో విధానం ఇళ్ల సందర్శన

తన పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తొలుత నలగంపల్లెలోని నెట్‌ జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్లను సందర్శించారు. సోలార్‌ రూఫ్‌టాప్‌, ఇండక్షన్‌ కుక్‌టా్‌పలు, వర్షపునీటి సంరక్షణ, కిచెన్‌ కంపోస్టింగ్‌, టెర్రస్‌ గార్డెనింగ్‌ వంటి విధానాలను పరిశీలించారు. నెట్‌జీరో విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తున్న నలగంపల్లె గ్రామాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని అధికారులకు సూచించారు. అనంతరం కుప్పం ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌, డయాలసిస్‌ సెంటర్లను ఆయన ప్రారంభిచారు. ఆ తర్వాత కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడ అమలవుతున్న ‘జన నాయకుడు’ పోర్టల్‌ పనితీరు గురించి తెలుసుకున్నారు. పోర్టల్‌ సిబ్బందితో మాట్లాడారు. కుప్పంలో ఫుడ్‌ స్ట్రీట్‌- ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాజాను ప్రారంభించి నిర్వాహకులతో మాట్లాడారు. కాగా, శనివారం రాత్రి తన నివాసంలో స్వర్ణ కుప్పం విజన్‌- 2029 మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనపై అధికారులు, ఐఐటీ కాన్పూర్‌ బృందంతో సమావేశమయ్యారు. కుప్పం సమన్వయ కమిటీతో పాటు పార్టీ నాయకులతో వేర్వేరు సమావేశాల్ని నిర్వహించారు.


ఆరు దశాబ్దాల పట్టా కల సాకారం

ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కుప్పం మండలం కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు సీఎం చంద్రబాబు తెర దించారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు అందించారు. కంగుందిలో నిర్వహించిన డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మొత్తం 460.19 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అడవి పోరంబోకు భూమిని అసెస్డ్‌ వేస్డ్‌ డ్రై భూమిగా మార్చేందుకు క్యాబినెట్‌ ఆమోదం తీసుకుని రైతులకు పంపిణీ చేస్తున్నామన్నారు. రౌడీయిజం, గూండాయిజానికి రాష్ట్రంలో తావు లేదని, గత ప్రభుత్వ హయాంలో అనేక భూవివాదాలు సృష్టించారని, ప్రజల పట్టాదారు పాసుపుస్తకాలపై ఫొటోలు ముద్రిస్తే, తాను వాటిని తొలగించి రాజముద్రతో అందజేశానని సీఎం గుర్తుచేశారు. భూవివాదాల పరిష్కారంలో ఓపికతో వ్యవహరించి అన్ని రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భూములకు భద్రత కల్పించేందుకు సాంకేతికత జోడిస్తున్నామని చెప్పారు. కుటుంబ ఆస్తి వివాదాల కారణంగా కూడా అనేక భూములు వివాదాస్పదమవుతున్నాయన్నారు. తల్లిదండ్రులు, సోదరీమణుల హక్కులను గౌరవించాలని సూచించారు.

Updated Date - Jul 05 , 2026 | 03:59 AM