Share News

దేశ చరిత్రలో బ్లాక్‌డే!

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:30 AM

మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పార్లమెంటులో మహిళలకు అన్యాయం జరిగింది.

దేశ చరిత్రలో బ్లాక్‌డే!

  • పార్లమెంటులో మహిళలకు అన్యాయం: చంద్రబాబు

  • మహిళా రిజర్వేషన్‌ బిల్లు వీగిపోవడంపై ఆవేదన

  • నిరసన ఉద్యమానికి నిడదవోలులో శ్రీకారం

  • మండుటెండలో 2 కిలోమీటర్ల పాదయాత్ర

  • కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు ద్రోహం చేశాయి

  • దీనిపై మహిళా లోకం ఒక్కటవ్వాలి

  • బిల్లు ఆమోదం వరకూ ఉద్యమం ఆగదు: సీఎం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘పార్లమెంటులో మహిళలకు అన్యాయం జరిగింది. భారతదేశ చరిత్రలో బ్లాక్‌డే’ అని పేర్కొన్నారు. దీనికి నిరసనగా శనివారం ఉద్యమాన్ని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో దీనికి శ్రీకారం చుట్టారు. మహిళలతో కలిసి మండుటెండలో సుమారు 2కిలోమీటర్లు నిరసన తెలుపుతూ స్వచ్ఛాంధ్ర వేదిక వరకూ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగాను, అనంతరం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో సీఎం మాట్లాడారు. ‘మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని అందరం అనుకున్నాం. 33 శాతం మంది మహిళలను చట్టసభల్లో చూస్తామని ఆశపడ్డాం. అందరూ ముందుకొచ్చిన సమయంలో కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు మహిళలకు ద్రోహం చేశాయి’ అని ధ్వజమెత్తారు. దీనిపై మహిళా లోకం ఒక్కటవ్వాలని పిలుపిచ్చారు. మహిళలను గౌరవించడం. అన్ని రంగాల్లో వారిని ఆదరించడం భారతదేశ సంస్కృతి.. ఎక్కడైతే మహిళలను పూజిస్తారో అక్కడ దేవతలుంటారని అంటారని.. అలాంటి సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా జరిగిన ద్రోహానికి ఈ రోజు నిడదవోలులో నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. తన పర్యటన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. దేశమంతా వ్యాప్తి చేస్తామని.. బిల్లును ఆమోదించేదాకా ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు సాధించే వరకూ ఆడబిడ్డలకు అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


మహిళలకు అన్యాయం చేసే పార్టీ..

‘‘కాంగ్రెస్‌.. మహిళలకు అన్యాయం చేసే పార్టీ. ఎప్పుడూ పట్టించుకోని పార్టీ అని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఆ పార్టీ, దాని మిత్రపక్షాలు అనుకుంటే మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ అయ్యేది. ఎందుకు పాస్‌ చేయలేదని ఈ సభ ద్వారా ఆ పార్టీలను నిలదీస్తున్నాను. ఈ సమస్య ఇప్పటిది కాదు. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉండగా యునైటెడ్‌ ఫ్రంట్‌కు నేను కన్వీనర్‌గా ఉన్నా. ఆ రోజుల్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రయత్నించగా కాంగ్రెస్‌ సపోర్టు చేసింది. కానీ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఒప్పుకోలేదు. దీంతో విత్‌డ్రా చేసుకున్నాం. 1998, 99, 2002, 2003ల్లో నాలుగు సార్లు బిల్లు తీసుకొచ్చాం. రాజ్యాంగ సవరణ అవసరం. 2/3 మెజారిటీ కావాలి. ప్రతిసారీ బిల్లు పాస్‌ కాకుండా కాంగ్రెస్‌ అడ్డుపడింది. 2010 యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాజ్యసభలో బిల్లు ఆమోదించారు. చిత్తశుద్ధి ఉంటే దానిని లోక్‌సభకు ఎందుకు తీసుకురాలేదు? ఆరోజు రాజ్యసభలో ఈ బిల్లును బీజేపీ సమర్థించింది. కానీ కాంగ్రెస్‌ ద్రోహం చేసింది. 2023లో మోదీ మహిళా రిజర్వేషను బిల్లు తీసుకొచ్చారు. అప్పుడు అందరూ సహకరించారు. 2026లో జనగణన జరగాలి. అటుపై పునర్విభజన చేపట్టాలి. ఆ తర్వాత రిజర్వేషన్‌ బిల్లుతో ముందుకు పోవాలని నిర్ణయించారు. జనగణన ఇప్పుడే ప్రారంభమైంది. 2029 వరకూ ఆగితే కుదరదని మోదీ ఆలోచన చేసి ఎంతో పట్టుదల, ఆలోచనతో రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చారు. ఈ బిల్లు కోసం మాది 3 దశాబ్దాల పోరాటం. 2017లోనే దీనికోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం. ఆడబిడ్డలను గుర్తించి, వారి తెలివితేటలను గౌరవించి ఎన్టీఆర్‌ దేశంలోనే మొదటిసారిగా వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. మహిళా వర్సిటీ పెట్టారు.’’


రాజకీయ ఎజెండా కోసం దుర్మార్గం..

దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ అభివృద్ధి చెందాలని బిల్లు ప్రవేశపెడితే దానికి కుంటి సాకులు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని, చిన్న రాష్ట్రాలకు నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా స్పష్టంగా చెప్పారు. యూపీలో 50శాతం పెంచితే.. ఏపీలో కూడా 50శాతం సీట్లు పెంచుతామని ప్రకటన చేసి బిల్లు పెట్టినా.. కాంగ్రెస్‌ పక్షాలు రాజకీయ ఎజెండా కోసం దుర్మార్గమైన పని చేశాయి. ఇది క్షమించరాని నేరం. ఆడబిడ్డలను వంటింటికే పరిమితం చేయాలనే అహంకారంతో ఇలాంటి దుర్మార్గమైన పని చేశారు. అందుకే ప్రతి ఆడబిడ్డనూ చైతన్యం చేయాలని ఇక్కడి నుంచి ఉద్యమం ప్రారంభించాం. నేను ఇక్కడకు బయల్దేరేటప్పుడు బీజేపీ నేత మాధవ్‌తో, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడాను. ఆయన అందుబాటులో లేకపోవడంతో మంత్రి దుర్గేశ్‌ వచ్చారు.

Updated Date - Apr 19 , 2026 | 03:34 AM