మీరు ఓడించింది ఢిల్లీని కాదు దక్షిణాదిని
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:49 AM
పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ‘ఢిల్లీని ఓడించాం’ అంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
మీ వల్ల భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతుంది
స్టాలిన్‌కు చంద్రబాబు కౌంటర్
మహిళలకు కాంగ్రెస్, డీఎంకే ద్రోహం
ఒకప్పుడు తమిళనాడు ఆర్థికంగా బలోపేతం
ఇప్పటి పరిస్థితి ఏంటో ఆలోచించాలి
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే అభివృద్ధి
తమిళనాడులో ఎన్డీయే అభ్యర్థులకు బాబు ప్రచారం
చెన్నై, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ‘ఢిల్లీని ఓడించాం’ అంటూ డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఓడించింది ఢిల్లీని కాదు, దక్షిణ భారతదేశాన్ని. రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళల్ని, వారి ఆశల్ని. మీ కారణంగా భవిష్యత్‌లో దక్షిణ భారతం తీవ్రంగా నష్టపోతుంది’ అని అన్నారు. సోమవారం తమిళనాట పరిశ్రమల నగరంగా పేరుగాంచిన కోయంబత్తూరుకు వచ్చిన చంద్రబాబు.. స్థానిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశమయ్యారు. వారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోయంబత్తూరు జిల్లాలోని ఎన్‌డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ‘అనైవరుక్కుం వణక్కం’ అంటూ తమిళంలో ప్రసంగం ప్రారంభించి.. అనంతరం తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రసంగించారు. తమిళనాడుతో ఏపీకి, ఎన్‌టీఆర్‌కు, తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ‘‘తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలది ద్రవిడ సంస్కృతి. పాండ్యులు, చోళులు పాలించిన నేల తమిళనాడు.

అత్యంత ప్రాచీన భాష తమిళం. మాతృభాషను తమిళులు ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేరు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే మనస్తత్వమే తమిళుల విజయ రహస్యం. సుబ్రహ్మణ్య భారతి, కన్నగి, తిరువళ్లువర్, సీవీ రామన్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి ఎంతోమంది ప్రముఖులు ఈ గడ్డ నుంచే వచ్చారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవడానికి కుప్పంలో ద్రవిడ వర్సిటీని ఏర్పాటు చేశాం. తమిళనాడుతో తెలుగువారికి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. నా వివాహం చెన్నైలోనే జరిగింది. ఈ గడ్డపై నుంచే ఎన్‌టీఆర్ మహానాయకుడిగా ఎదిగారు. ఎన్‌టీఆర్-ఎంజీఆర్ మధ్య మంచి స్నేహం ఉండేది. తమిళనాడుకు నీరందించేందుకు ఎన్‌టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టును తీసుకువచ్చారు. జాతీయ రహదారులు అనుసంధానం అయినట్లే గంగ-కావేరి నదులు అనుసంధానం కావాలి. అనుసంధానమైతే క్రమంగా మిగతా నీటి వనరులు కలిసే అవకాశముంటుంది’’ అని వివరించారు.
మళ్లీ అన్నాడీఎంకే ప్రభుత్వం
అన్నాడీఎంకే అంటే గుర్తుకు వచ్చేది జయలలితేనని, ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తాను వచ్చానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మళ్లీ గెలిచేది అన్నాడీఎంకే-బీజేపీ కూటమేనన్నారు. 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు ఇవ్వాలని ప్రధాని నిర్ణయిస్తే, డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ లాంటి పార్టీలు వ్యతిరేకించాయని, డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతానికి సీట్లు పెరగవంటూ అపోహలు సృష్టించారని విమర్శించారు. ‘‘అభివృద్ధి-సంక్షేమం సమతూకంలో ఉండాలి. గతంలో తమిళనాడు ఓ బలమైన ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది తమిళ ప్రజలే అంచనా వేయాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
డీఎంకే హయాంలో నేరాల మయం
గత ఐదేళ్లుగా చెన్నై అభివృద్ధి ఆగిపోయిందని, తమిళ ప్రజలకు ప్రయోజనాలు అందడం లేదని.. అప్పులు పెరిగిపోయాయని, యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని చంద్రబాబు అన్నారు. డీఎంకే హయాంలో నేరాల రేటు బాగా పెరిగిపోయిందని, తమిళ ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలను తీసుకువచ్చారని విమర్శించారు. ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా రూ.10 వసూలు చేస్తూ మందుబాబులను కూడా దోచుకుంటున్నారన్నారు. గతంలో చెన్నై ఉమ్మడి రాజధానిగా ఏపీ, తమిళనాడు కలిసే ఉన్నాయని, ఇప్పుడు చెన్నై వెనుకబడిపోయిందని అన్నారు. ‘‘బ్రిటిష్ కాలం నుంచి దక్షిణ భారతదేశానికి చెన్నై ప్రధానకేంద్రం. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అలాంటి చెన్నై.. హైదరాబాద్, బెంగళూరు నగరాల కన్నా వెనుకబడిపోయింది. ముఖ్యంగా విమానాశ్రయంలో ఈ వెనుకబాటుతనం కనిపిస్తోంది. కోయంబత్తూరు విమానాశ్రయానికి 500 ఎకరాలు కూడా సేకరించలేకపోతున్నార’ అని అన్నారు.
మహిళలకు ద్రోహం
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, డీఎంకే మహిళలకు ద్రోహం చేశాయని చంద్రబాబు ఆరోపించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో డీఎంకే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన వాటాను డీఎంకే అడ్డుకుందన్నారు. డీలిమిటేషన్ ద్వారా 50 శాతం సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెబుతుంటే డీఎంకేకు ఏమి ఇబ్బంది అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తనలాంటి వ్యక్తులు చాలాకాలంగా పోరాడుతున్నారని, 2029 ఎన్నికలకే ఈ రిజర్వేషన్ అమలు కావాలని ప్రధాని భావించారని తెలిపారు. ‘‘కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు వల్ల తమిళనాడు, ఏపీ, కేరళ, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు సీట్లు పెరిగేవి. డీఎంకే తీసుకున్న నిర్ణయంతో మహిళలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు కూడా నష్టపోయాయి. 2027 జనాభా లెక్కల ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోక తప్పదు’’ అని వివరించారు. వాటికి అన్యాయం జరగాలని డీఎంకే కోరుకుంటోందా? మహిళలకు రిజర్వేషన్లు అవససరం లేదని కోరుతోందా అని ప్రశ్నించారు. 1960ల్లో ఏకచత్రాధిపత్యంగా ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి, దానిని తమిళనాట భూస్థాపితం చేసిన పార్టీ డీఎంకే అని, ఇప్పుడు అలాంటి పార్టీతో స్టాలిన్ పొత్తు పెట్టుకుని వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. కోయంబత్తూరులో ప్రచారం చేసేందుకు వచ్చిన చంద్రబాబు.. అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది. బ్యానర్‌పైనా ఆయన ఫొటో కనిపించలేదు.
దక్షిణాదికి అన్యాయం జరగనివ్వను: బాబు
చెన్నై, హోసూరు రూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): గోదావరి నుంచి కావేరి వరకు నీళ్లు తీసుకువెళ్లేలా నదులు అనుసంధానం చేస్తామని, ఇది జరగాలంటే కేంద్రంలో ప్రధాని మోదీ ఉండాలని చంద్రబాబు అన్నారు. అప్పుడే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదని, ఈ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వబోనని చెప్పారు. కృష్ణగిరి జిల్లా తళి వచ్చిన ఆయనకు జనం భారీగా తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు సభనుద్దేశించి మాట్లాడుతూ... తమిళనాడుకు వచ్చినా తనకు సొంత గడ్డపై ఉన్నట్లే ఉందని.. మన భాష ఏదైనా అంతా ద్రావిడులమేనని వ్యాఖ్యానించారు. తళి నుంచి తిరుపతికి బస్సు వేయాలని స్థానిక ఎన్‌డీఏ నేతలు కోరగా, చంద్రబాబు వెంటనే అంగీకరించారు. ఢిల్లీని ఓడించామని డీఎంకే విర్రవీగుతోందని, మహిళా బిల్లును అడ్డుకుని ఆ పార్టీ ఏం సాధించిందో చెప్పాలని ప్రశ్నించారు. భారత్‌ను ప్రపంచపటంలో గౌరవమైన స్థానంలో ఉంచిన వ్యక్తి ప్రధాని మోదీ అని అన్నారు. ఎన్‌డీఏకు వేసే ఓటుతో తమిళనాడు రాష్ట్రం గెలుస్తుందని, తద్వారా ప్రతి ఇల్లూ, ప్రతి వ్యక్తీ గెలుస్తారని చెప్పారు.
చెన్నైలో చంద్రబాబు రోడ్ షో
తమిళనాడులో ఎన్‌డీఏ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టేందుకు రెండు రోజుల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ప్రచారానికి విశేష స్పందన లభించింది. కోయంబత్తూరు, తళి పర్యటనలను ముగించుకుని రాత్రికి చెన్నై చేరుకున్న ఆయన.. 7.30 గంటలకు అమింగిజరై నుంచి అన్నానగర్ షెనాయ్‌నగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. వేలాదిమంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ, వివిధ రకాల సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆహ్వానించారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పలుచోట్ల వాల్‌పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. పలువురు భారీ పూలమాలలు, పుష్పగుచ్ఛాలు తీసుకొచ్చి ఆయనకు ఇచ్చేందుకు పోటీపడ్డారు. రోడ్‌షో రాత్రి 9.30 వరకు సాగింది.

‘అర్థమయిందా రాజా?’
చంద్రబాబు ప్రసంగం చివర్లో.. ‘అవినీతి లేని గ్రామం లేదు. నాశనం చేయని నగరం లేదు. నష్టపరచని ప్రాంతం లేదు. డీఎంకేను ఓడించాలి. తమిళనాడును గెలిపించాలి. అర్థమైందా రాజా?’ అనగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
చంద్రబాబు నోట తమిళ పలుకులు
చంద్రబాబు తన ప్రసంగంలో పలుమార్లు తమిళ పదాలను ఉచ్ఛరించారు. ప్రసంగం ప్రారంభంలో ‘అనైవరుక్కుం వణక్కం.. ఎన్ అన్బన తమిళ్ నాడు మక్కళే.. ఉంగళుడన్ ఎన్ పిరందనాళిల్ ఇంగే ఇరుప్పదు రొంబ వే సంతోషం’ (అందరికీ నమస్కారం. నా ప్రియమైన తమిళనాడు ప్రజలారా, నా పుట్టిన రోజున మీతో ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది) అని వ్యాఖ్యానించారు. అలాగే ‘మీకు అభివృద్ధి కావాలా.. ఉద్యోగావకాశాలు కావాలా.. అలా అయితే కేంద్రంలో మోదీ ఉండాలి. రాష్ట్రంలో అమ్మ జయలలిత పాలన రావాలి. అందుకోసం ఎన్‌డీఏకి విజయం చేకూర్చండి’ అని పిలుపునిచ్చారు.