పెట్టుబడులే లక్ష్యంగా
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:55 AM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఒప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సింగపూర్ పర్యటనకు వెళ్లారు. దిగ్గజ వ్యాపార సంస్థల ప్రతినిధులతో..
సింగపూర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు
నేడు ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ
దిగ్గజ వ్యాపార సంస్థలతోనూ సమావేశాలు
రేపు వరల్డ్ సిటీస్ సమ్మిట్, సీఐఐ రోడ్‌షోకు హాజరు
ఏపీలోని అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాల గురించి వివరించనున్న సీఎం
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఒప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సింగపూర్ పర్యటనకు వెళ్లారు. దిగ్గజ వ్యాపార సంస్థల ప్రతినిధులతో ఆయన వరుస సమావేశాలు కానున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఆమోదించడం, పరిశ్రమలు స్థాపించేవరకు అందిస్తున్న సహకారం గురించి సింగపూర్ ప్రభుత్వంతో పాటు వాణిజ్య, పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. సోమవారం సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తోనూ, పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమవుతారు. మంగళవారం వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లోనూ, సీఐఐ నిర్వహించే రోడ్‌షోలోనూ పాల్గొంటారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో ‘వన్ టు వన్’ సమావేశాలు నిర్వహించనున్నారు. సీఐఐ నిర్వహించే రోడ్‌షోలోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, సహజ వనరులు, ఎలక్ట్రానిక్ రంగ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, ప్రోత్సాహకం వంటి అంశాల గురించి సింగపూర్ పారిశ్రామిక, వాణిజ్య దిగ్గజ సంస్థలకు సీఎం వివరించనున్నారు. ప్రధానంగా బ్లాక్ చెయిన్ ఆర్థిక సంస్థలకు రాష్ట్రం గమ్యస్థానమని తెలియజేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గడచిన రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడుల గురించి అక్కడి సంస్థలకు సీఎం వివరించనున్నారు.
